chinnashamkarampeta
-
20 ఏళ్ల తర్వాత చెరువులకు జలకళ
చిన్నశంకరంపేట: ఇరవై ఏళ్ల తరువాత చెరువులకు జలకళ రావడంతో చిన్నశంకరంపేట మండలంలోని ప్రజలు ఆనందంతో మునిగితేలుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో చిన్నశంకరంపేట మండలంలోని చెరువులు నిండుకుండలుగా మారాయి. చెరువులు నిండి అలుగులు పారుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు గంగమ్మకు పూజలు నిర్వహిస్తు ముందుకు సాగుతున్నారు. చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట పాత చెరువు ఇరవై ఏళ్ల క్రితం నిండిందంటే మళ్లీ ఇప్పుడే నిండిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని శేరిపల్లి, చందంపేట, సూరారం గ్రామాల చెరువులు నాలుగేళ్ల క్రితం నిండినప్పటికీ అలుగు మాత్రం పారలేదు.ఈ సారి మాత్రం చెరువులు నిండి అలుగులు పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. జప్తిశివనూర్, సంకాపూర్, ఖాజాపూర్, మందాపూర్, గవ్వలపల్లి, జంగరాయి, ధరిపల్లి, కామారం గ్రామాల చెరువులు నిండిపొంగిపోర్లుతున్నాయి. రికార్డు స్థాయిలో నిండిన చెరువులు మండలంలో మునుపెన్నడు లేనిస్థాయిలో 21 సె.మీ.వర్షం కురువడంతో రికార్డు స్థాయిలో చెరువులు నిండాయి. ఉదయం నుంచిచెరు వు కట్టలపైనే ఉన్న ప్రజలు చూస్తుండగానే చెరువులు నిండి అలుగులు పొంగిపొర్లడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రుద్రారం చెరువు శుక్రవారం ఉదయం 8 గంటలవరకే నిండిపొంగిపోర్లగా, సూరారం పెద్ద చెరువుతో పాటు మరో మూడు చెరువులు ఉదయం 9 గంటల వరకు నిండాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు మండలంలోని శేరిపల్లి, ధరిపల్లి, జప్తిశివనూర్, కామారం గ్రామాల చెరువులు నిండిపోయాయి. ఏన్నో ఏళ్లుగా చూస్తున్న తమకు ఇలా గంటల వ్యవధిలో చెరువులు నిండిన సంఘటనలు లేవని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నిండని పెద్ద చెరువు మండలంలో పెద్దచెరువుగా గుర్తిపు ఉన్న అంబాజిపేట పెద్ద చెరువు ఇంక నిండలేదు.ఇందులో నీటి మట్టం 21 అడుగులు కాగా,శనివారం సాయంత్రం వరకు 13 అడుగుల నీటి మట్టం చేరాయి. ఈ చెరువు నిండితే ఏగు గ్రామాలలోని 930 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. ఈ చెరువు పరిధిలో చిన్నశంకరంపేట, అంబాజిపేట,ఆగ్రహరం, గవ్వలపల్లి, మల్లుపల్లి, చందాపూర్, జంగరాయి గ్రామాల పరిధిలోని రైతుల పొలాలు పారనున్నాయి.మండలంలోని శాలిపేట నల్లచెరువు, మిర్జాపల్లి పించెరువు ఇంకా నిండాలేదు. చిన్నశంకరంపేట పాత చెరువులో కూడా మరో రెండు అడుగుల నీరు చేరితేనే అలుగు పారుతుంది. -
మొలకెత్తిన మొక్కజొన్న
ఆదుకోవాలంటూ తహసీల్దార్‌కు రైతుల విన్నపం చిన్నశంకరంపేట: భారీగా కురిసిన వర్షాలకు తడిసిన మొక్కజొన్న కంకులు మొలకెత్తి తీవ్రంగా నష్టం వచ్చిందని పలు గ్రామాల రైతులు తహసీల్దార్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. శనివారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయానికి మొలకెత్తిన మొక్కజొన్న కంకులతో తరలి వచ్చి తమకు జరిగిన నష్టం వివరించారు. జంగరాయి గ్రామ నాగులమ్మ తండాకు చెందిన రెడ్యా నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలతో మొక్కజొన్న కంకులు మొలకెత్తి చేతికందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన మొక్కజొన్నలను ఎవరూ కొనుగోలు చేయరని, దీంతో తాము పెట్టిన పెట్టుబడులు చేతికందకపోగా, మరింత అప్పులయ్యయన్నారు. ప్రభుత్వం నష్టపరిహరం అందించి ఆదుకోవాలని కోరారు. గవ్వలపల్లి తండాకు కిషన్ కూడా మొలకెత్తిన మొక్కజొన్న కంకులతో తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయలక్ష్మి మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి మొలకెత్తిన మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరారు. -
చేగుంట-మెదక్ రోడ్డు మూసివేత
చిన్నశంకరంపేటకు దారి లేక ఇబ్బందులు అత్యవసరమైతే నడక తప్పని పరిస్థితి చిన్నశంకరంపేట: మండల కేంద్రానికి ఇరువైపులా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీల వద్ద వేసిన తాత్కాలిక రోడ్లు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రెండు రోజులుగా మెదక్-చేగుంట రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. అత్యవసర పనులపై వచ్చివెళ్లేవారు చేగుంట మండలం పోలంపల్లి వరకు ఆటోల్లో వచ్చి అక్కడి నుంచి కాలినడకన చిన్నశంకరంపేటకు వస్తున్నారు. శనివారం చిన్నశంకరంపేటలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన బంధువులు చేగుంట వైపు నుంచి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. అత్యవసరమవడంతో చేగుంట మండలం పోలంపల్లి దగ్గరికి ఆటోల్లో వచ్చి అక్కడి నుంచి నడుస్తూ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నశంకరంపేటకు చేరుకున్నారు. చిన్నశంకరంపేట-అంబాజిపేట గ్రామాల మధ్య సైతం రోడ్డు తెగిపోవడంతో అక్కడి నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ దారిలోనూ అత్యవసరమైన వారు అంబాజిపేట పెద్ద చెరువు కట్టమీదుగా కాలినడకన లేదా ద్విచక్ర వాహనాల ద్వారా చిన్నశంకరంపేటకు చేరుకుంటున్నారు. చిన్నశంకరంపేట నుంచి జంగరాయి మీదుగా, లేదా మిర్జాపల్లి మీదుగా కొంత దూరమైనప్పటికీ వాహనాల్లో వెళ్లే అవకాశం ఉన్నప్పటికి కొత్తగా వచ్చేవారికి ఈ విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ద్విచక్రవాహనాలు లేదా ఆటోల్లో ఈ బ్రిడ్జీల వద్దకు చేరుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన రోడ్డు క్లోజ్ బోర్డులను చూసి నివ్వెరపోతున్నారు. అక్కడి నుంచి ఎటూపాలుపోని స్థితిలో నడుస్తూ చిన్నశంకరంపేటకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో చిన్నశంకరంపేటలోని పలు పరిశ్రమలకు రావాల్సిన వాహనాలు రాలేకపోతున్నాయి. దీంతో తాము నష్టపోవాల్సి వస్తోందని పలు పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తాత్కాలిక రోడ్లు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పోలంపల్లి శివారులో బ్రిడ్జి నిర్మాణం 90 శాతం వరకు పూర్తైంది. ఇక్కడ రెండు వైపులా నిర్మించాల్సిన వాల్స్ ఇంకా పూర్తికాలేదు. కానీ ఈ రోడ్డుపై చిన్నపాటి మరమ్మతులు చేస్తే వాహనాలు రాకపోకలు కొనసాగించవచ్చని పారిశ్రామికులంటున్నారు. బ్రిడ్జి పక్కనే ఉన్న పేపర్‌మిల్ యాజమాన్యం తాత్కాలిక రోడ్డు వేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ దానికి అధికారులు ఒప్పుకోలేదు. వారు చేగుంట తహసీల్దార్ నిర్మలకు విషయం చెప్పి సహకరించాల్సిందిగా కోరడంతో ఆమె ఇక్కడకు వచ్చి పరిశీలించి విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వరద ఉధృతి తగ్గే వరకు తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేయడం కుదరదని, జిల్లా అధికారుల సూచన మేరకే రోడ్డును క్లోజ్ చేస్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు.