చేగుంట-మెదక్‌ రోడ్డు మూసివేత | chegunta-medak road closed | Sakshi
Sakshi News home page

చేగుంట-మెదక్‌ రోడ్డు మూసివేత

Published Sat, Sep 24 2016 7:55 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

చిన్నశంకరంపేటలో చేగుంట-మెదక్‌ రోడ్డును మూసేస్తూ ఏర్పాటు చేసిన బోర్డు - Sakshi

చిన్నశంకరంపేటలో చేగుంట-మెదక్‌ రోడ్డును మూసేస్తూ ఏర్పాటు చేసిన బోర్డు

చిన్నశంకరంపేటకు దారి లేక ఇబ్బందులు
అత్యవసరమైతే నడక తప్పని పరిస్థితి

చిన్నశంకరంపేట: మండల కేంద్రానికి ఇరువైపులా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీల వద్ద వేసిన తాత్కాలిక రోడ్లు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రెండు రోజులుగా మెదక్‌-చేగుంట రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. అత్యవసర పనులపై వచ్చివెళ్లేవారు చేగుంట మండలం పోలంపల్లి వరకు ఆటోల్లో వచ్చి అక్కడి నుంచి కాలినడకన చిన్నశంకరంపేటకు వస్తున్నారు.

శనివారం చిన్నశంకరంపేటలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన బంధువులు చేగుంట వైపు నుంచి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. అత్యవసరమవడంతో చేగుంట మండలం పోలంపల్లి దగ్గరికి ఆటోల్లో వచ్చి అక్కడి నుంచి నడుస్తూ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నశంకరంపేటకు చేరుకున్నారు.

చిన్నశంకరంపేట-అంబాజిపేట గ్రామాల మధ్య సైతం రోడ్డు తెగిపోవడంతో అక్కడి నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.  ఈ దారిలోనూ అత్యవసరమైన వారు అంబాజిపేట పెద్ద చెరువు కట్టమీదుగా కాలినడకన లేదా ద్విచక్ర వాహనాల ద్వారా చిన్నశంకరంపేటకు చేరుకుంటున్నారు.

చిన్నశంకరంపేట నుంచి జంగరాయి మీదుగా, లేదా మిర్జాపల్లి మీదుగా కొంత దూరమైనప్పటికీ వాహనాల్లో వెళ్లే అవకాశం ఉన్నప్పటికి కొత్తగా వచ్చేవారికి ఈ విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ద్విచక్రవాహనాలు లేదా ఆటోల్లో ఈ బ్రిడ్జీల వద్దకు చేరుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన రోడ్డు క్లోజ్‌ బోర్డులను చూసి నివ్వెరపోతున్నారు.

అక్కడి నుంచి ఎటూపాలుపోని స్థితిలో నడుస్తూ చిన్నశంకరంపేటకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా మెదక్‌-చేగుంట ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో చిన్నశంకరంపేటలోని పలు పరిశ్రమలకు రావాల్సిన వాహనాలు రాలేకపోతున్నాయి. దీంతో తాము నష్టపోవాల్సి వస్తోందని పలు పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే తాత్కాలిక రోడ్లు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పోలంపల్లి శివారులో బ్రిడ్జి నిర్మాణం 90 శాతం వరకు పూర్తైంది. ఇక్కడ రెండు వైపులా నిర్మించాల్సిన వాల్స్‌ ఇంకా పూర్తికాలేదు. కానీ ఈ రోడ్డుపై చిన్నపాటి మరమ్మతులు చేస్తే వాహనాలు రాకపోకలు కొనసాగించవచ్చని పారిశ్రామికులంటున్నారు.

బ్రిడ్జి పక్కనే ఉన్న పేపర్‌మిల్ యాజమాన్యం తాత్కాలిక రోడ్డు వేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ దానికి అధికారులు ఒప్పుకోలేదు. వారు చేగుంట తహసీల్దార్‌ నిర్మలకు విషయం చెప్పి సహకరించాల్సిందిగా కోరడంతో ఆమె ఇక్కడకు వచ్చి పరిశీలించి విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వరద ఉధృతి తగ్గే వరకు తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేయడం కుదరదని, జిల్లా అధికారుల సూచన మేరకే రోడ్డును క్లోజ్‌ చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement