chegunta-medak
-
మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం
సాక్షి, తూప్రాన్: కన్నకొడుకును హత్యచేసి పూడ్చిపెట్టిన కుమారుడి మృతదేహాన్ని వెలికితీసి ఇబ్రహీంపూర్ గ్రామంలోనే తహసీల్దార్ గోవర్ధన్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామానికి చెందిన పీఎసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి తన కొడుకును ఈనెల 7వ తేదీ సోమవారం రాత్రి చంపేసి పౌల్ట్రీఫాం సమీపంలో పూడ్చివేసి గురువారం పోలీసులకు లొంగిపోయాడు. శుక్రవారం తహసీల్దార్ గోవర్ధన్ తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం ముఖం భాగం కుళ్లిపోయి ఉండగా సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేశాన్ని బంధువులకు అప్పగించారు. అనంతరం అక్కడే శవాన్ని పాతిపెట్టారు. మధ్యాహ్నం వరకు పోస్టుమార్టం నిర్వహించే సిబ్బంది రాకపోవడంతో గ్రామస్తులు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పౌల్ట్రీఫాం ఆవరణలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డికి సంబంధించిన బంధువులతో మాట్లాడి తండ్రీకొడుకులకు మధ్య గొడవలకు గల కారణాలపై ఆరా తీశారు. నారాయణరెడ్డి అంటే భయంగా ఉందని, ఆయనను గ్రామంలోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు డీఎప్పీని కోరారు. ఇబ్రహింపూర్ గ్రామాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావ్ సందర్శించి చట్టప్రకారం నిందితులకి శిక్షపడేలా పోలీసులు చూడాలని కోరారు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి మృతితో బంధువులు ఇబ్రహీంపూర్‌లోని పౌల్ట్రీఫాంకు చేరుకున్నారు. నిందితులందరినీ అరెస్టు చేస్తాం: డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌రెడ్డి హత్య విషయంలో నారాయణరెడ్డితో పాటు అతని సోదరుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామంలోనే పోస్టుమార్టం పూర్తి చేయించామని పోస్టుమార్టం నివేదిక రాగానే అన్ని కోణాల్లో కేసును విచారించి శ్రావణ్‌కుమార్‌రెడ్డి హత్యలో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేస్తామని డీఎస్పీ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా మూడు రోజల వరకు గ్రామంలో పోలీస్‌ల పర్యవేక్షణ ఉంటుందని డీఎస్పీ తెలిపారు. చేగుంట ఎస్ఐ సత్యనారాయణ, చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాశ్‌గౌడ్‌తో పాటు ఆయా పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఉన్నారు. చదవండి: కొడుకును చంపి పూడ్చిపెట్టిన తండ్రి -
కొడుకును చంపి పూడ్చిపెట్టిన తండ్రి
చేగుంట (తూప్రాన్): కన్న కొడుకును ఓ తండ్రి హత్యచేసి పౌల్ట్రీఫాం ఆవరణలో పూడ్చిపెట్టిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో చోటు చేసుకుంది. సహకార సంఘం చైర్మన్ నారాయణరెడ్డి కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) మేడ్చల్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. శ్రావణ్ దసరా పండుగ కోసం శనివారం ఇబ్రహీంపూర్‌కు వచ్చాడు. సోమవారం రాత్రి పౌల్ట్రీఫాంలోని ఇంట్లో శ్రావణ్, నారాయణరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదై మద్యం మత్తులో ఉన్న కొడుకును తండ్రి నారాయణరెడ్డి గొంతునులిమి చంపేసి పౌల్ట్రీఫాంలో గొయ్యితీసి పాతిపెట్టాడు.గురువారం మధ్యాహ్నం తనకొడుకు శ్రావణ్‌కుమార్‌రెడ్డిని హత్య చేశానని చేగుంట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్ఐ సత్యనారాయణ వద్ద లొంగిపోయాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
చేగుంట-మెదక్ రోడ్డు మూసివేత
చిన్నశంకరంపేటకు దారి లేక ఇబ్బందులు అత్యవసరమైతే నడక తప్పని పరిస్థితి చిన్నశంకరంపేట: మండల కేంద్రానికి ఇరువైపులా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీల వద్ద వేసిన తాత్కాలిక రోడ్లు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రెండు రోజులుగా మెదక్-చేగుంట రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. అత్యవసర పనులపై వచ్చివెళ్లేవారు చేగుంట మండలం పోలంపల్లి వరకు ఆటోల్లో వచ్చి అక్కడి నుంచి కాలినడకన చిన్నశంకరంపేటకు వస్తున్నారు. శనివారం చిన్నశంకరంపేటలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన బంధువులు చేగుంట వైపు నుంచి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. అత్యవసరమవడంతో చేగుంట మండలం పోలంపల్లి దగ్గరికి ఆటోల్లో వచ్చి అక్కడి నుంచి నడుస్తూ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నశంకరంపేటకు చేరుకున్నారు. చిన్నశంకరంపేట-అంబాజిపేట గ్రామాల మధ్య సైతం రోడ్డు తెగిపోవడంతో అక్కడి నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ దారిలోనూ అత్యవసరమైన వారు అంబాజిపేట పెద్ద చెరువు కట్టమీదుగా కాలినడకన లేదా ద్విచక్ర వాహనాల ద్వారా చిన్నశంకరంపేటకు చేరుకుంటున్నారు. చిన్నశంకరంపేట నుంచి జంగరాయి మీదుగా, లేదా మిర్జాపల్లి మీదుగా కొంత దూరమైనప్పటికీ వాహనాల్లో వెళ్లే అవకాశం ఉన్నప్పటికి కొత్తగా వచ్చేవారికి ఈ విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ద్విచక్రవాహనాలు లేదా ఆటోల్లో ఈ బ్రిడ్జీల వద్దకు చేరుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన రోడ్డు క్లోజ్ బోర్డులను చూసి నివ్వెరపోతున్నారు. అక్కడి నుంచి ఎటూపాలుపోని స్థితిలో నడుస్తూ చిన్నశంకరంపేటకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో చిన్నశంకరంపేటలోని పలు పరిశ్రమలకు రావాల్సిన వాహనాలు రాలేకపోతున్నాయి. దీంతో తాము నష్టపోవాల్సి వస్తోందని పలు పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తాత్కాలిక రోడ్లు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పోలంపల్లి శివారులో బ్రిడ్జి నిర్మాణం 90 శాతం వరకు పూర్తైంది. ఇక్కడ రెండు వైపులా నిర్మించాల్సిన వాల్స్ ఇంకా పూర్తికాలేదు. కానీ ఈ రోడ్డుపై చిన్నపాటి మరమ్మతులు చేస్తే వాహనాలు రాకపోకలు కొనసాగించవచ్చని పారిశ్రామికులంటున్నారు. బ్రిడ్జి పక్కనే ఉన్న పేపర్‌మిల్ యాజమాన్యం తాత్కాలిక రోడ్డు వేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ దానికి అధికారులు ఒప్పుకోలేదు. వారు చేగుంట తహసీల్దార్ నిర్మలకు విషయం చెప్పి సహకరించాల్సిందిగా కోరడంతో ఆమె ఇక్కడకు వచ్చి పరిశీలించి విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వరద ఉధృతి తగ్గే వరకు తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేయడం కుదరదని, జిల్లా అధికారుల సూచన మేరకే రోడ్డును క్లోజ్ చేస్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు.