ముంచిన మొక్కజొన్న | Farmers Loss With Fake Corn Seeds in Prakasam | Sakshi
Sakshi News home page

ముంచిన మొక్కజొన్న

Published Mon, Jan 13 2020 12:46 PM | Last Updated on Mon, Jan 13 2020 12:46 PM

Farmers Loss With Fake Corn Seeds in Prakasam - Sakshi

గింజలు లేని కంకులు

ప్రకాశం, గిద్దలూరు: మా కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు విత్తుకుంటే మీ జీవితాలు మారిపోతాయని ఆశ చూపించిన సీడ్‌ కంపెనీల ప్రతినిధులు సకాలంలో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయకుండా రైతులను నిండా ముంచారు. దీంతో రైతులకు ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 15 క్వింటాళ్లు వచ్చే పరిస్థితులు కూడా లేవని రైతులు ఆరోపిస్తున్నారు. మేము విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఉచితంగా ఇస్తామని రైతులకు ఆశచూపిన పలు మొక్కజొన్న విత్తన కంపెనీల ప్రతినిధులు చివరకు ఎరువులు, పురుగు మందులు సకాలంలో ఇవ్వకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతిని తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా జిల్లాలో సుమారు 65 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగులో ఉండగా, ఇందులో 40 వేల ఎకరాల వరకు సీడ్‌ కోసం రైతుల ద్వారా కంపెనీల ప్రతినిధులు పంటను సాగు చేయిస్తున్నారు. మరో 25 వేల ఎకరాల్లో కమర్షియల్‌ పంటను సాగు చేస్తున్నారు.

మొక్కజొన్న కండెలో కనిపించని గింజలు:  గత ఐదారేళ్ల పాటు తీవ్ర వర్షాభావంతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీరు లేక కరువుతో అల్లాడారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడం, భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పంటల సాగు విస్తారంగా చేపట్టారు. మొక్కజొన్న పంట సాగు జిల్లాలోనే అత్యధికంగా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. మొక్కజొన్న నాటితేఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెడితే పంట ద్వారా రూ.50 వేల వరకు వస్తుందని, ఇందులో రూ.30 వేల వరకు మిగు లుతుందని విత్తన కంపెనీ ప్రతినిధుల మాయమాటలు విని ఎంతో ఆశపడ్డారు. కంకుల్లో విత్తనాలు కనిపించడం లేదని, ఎక్కడో ఒక విత్తనం ఉంటే కండె బరువు ఎలా తూగుతుందని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి రాదని, చివరకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని చెబుతున్నారు. ఒక్కో రైతు 10 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని పంటను సాగు చేశారు. పండిన పంట తీసుకునేందుకు కొన్ని చోట్ల కంపెనీ ప్రతినిధులు రాకపోవడంతో పొలంలోనే రాలిపోతున్నాయి. 

కమర్షియల్‌ విత్తనాలు సాగుచేస్తే దున్నేస్తామంటూ బెదిరింపులు:‘‘మేము గ్రామంలో సీడ్‌ మొక్కజొన్న విత్తనాలు సాగు చేయిస్తున్నాం... మీరు మొక్కజొన్న సాగుచేయాలంటే మా వద్దే విత్తనాలు తీసుకోండి. కమర్షియల్‌ విత్తనాలు సాగుచేస్తే మా పంటలకు దిగుబడి రాదు.  ఒక వేళ మమ్మల్ని కాదని మీ ఇష్టానుసారం కమర్షియల్‌ విత్తనాలు సాగుచేస్తే రాత్రికి రాత్రే దున్నేస్తామంటూ’’ కంపెనీ ప్రతినిధులు రౌడీయిజం చేస్తున్నారు.అందుకే తాము వారి వద్దనే విత్తనాలు తీసుకుని పంట సాగు చేస్తే ఇలా మమ్మల్ని నట్టేట ముంచారని రైతులు వాపోయారు. పంటను కోసుకెళ్లాల్సిన కంపెనీ ప్రతినిధులు పొలం వద్దకు రావడం లేదని, కనీసం తమకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ధరల్లోనూ వ్యత్యాసం..
సీడ్‌ విత్తనాలు సాగు చేసిన రైతులకు ఎక్కువ ధరలు ఇవ్వాల్సిన కంపెనీల ప్రతినిధులు ధరల చెల్లింపులోనూ నిలువునా మోసం చేస్తున్నారు. కమర్షియల్‌ విధానంలో సాగైన మొక్కజొన్న పంటకు క్వింటాలు రూ.2,200 నుంచి రూ.2,600లు డిమాండ్‌ ఉండగా, సీడ్‌ కంపెనీలు మాత్రం రూ.1,650లు మాత్రమే ఇస్తామంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. విత్తనాలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకునే కంపెనీలు విత్తనాల సంచిపై ఎలాంటి అనుమతి ఉన్న సర్టిఫికెట్, కంపెనీ వివరాలు లేకుండానే రైతులకు అందిస్తున్నారు. కనీసం బిల్లులు ఉండవు. గ్రామాల్లో వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఏ విత్తనాలు సాగు చేస్తున్నారనేది వ్యవసాయాధికారులు పట్టించుకోకపోవడం లేదు. 

ఎవరూ ఫిర్యాదు చేయలేదు
మొక్కజొన్న రైతులు పంట దిగుబడి రాలేదన్న విషయం నా దృష్టికి తాలేదు. రైతులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సీడ్‌ కోసం సాగు చేసే పంట కాబట్టి విత్తనాలను స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేయరు. కంపెనీ నుంచి ఏజెంట్ల ద్వారా నేరుగా రైతులకు ఇస్తారు. రైతులు కంపెనీలతో అగ్రిమెంట్‌ చేసుకోవాలి. కనీసం రశీదైనా తీసుకోవాలి. రైతులు రశీదులు తీసుకోరు, అగ్రిమెంట్‌ చేసుకోవడం లేదు. దీనిపై గతంలోనూ రైతులకు అనేక పర్యాయాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. పంట దిగుబడి రాని రైతుల వద్దకు వెళ్లి విచారిస్తాం. కంపెనీల ద్వారా తగిన పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
– ఎస్‌.రామ్మోహన్‌రెడ్డి, ఏఓ, గిద్దలూరు  

12 ఎకరాల్లో సాగు చేశాను
నేను 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సీడ్‌ మొక్కజొన్న విత్తనాలు సాగు చేశాను. ఎరువులు, పురుగు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీ ప్రతినిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుందనుకుంటే 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కౌలు కార్డు లేకపోవడంతో ఇన్సూరెన్స్‌ వచ్చే అవకాశాలు లేవు. సీడ్‌ కంపెనీలు చేస్తున్న మోసాలపై తగు చర్యలు తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలి.– పుల్లయ్య, రైతు, ప్రతాపరెడ్డి కాలనీ,గిద్దలూరు మండలం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement