Loss farmers
-
ముంచిన మొక్కజొన్న
ప్రకాశం, గిద్దలూరు: మా కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు విత్తుకుంటే మీ జీవితాలు మారిపోతాయని ఆశ చూపించిన సీడ్ కంపెనీల ప్రతినిధులు సకాలంలో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయకుండా రైతులను నిండా ముంచారు. దీంతో రైతులకు ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 15 క్వింటాళ్లు వచ్చే పరిస్థితులు కూడా లేవని రైతులు ఆరోపిస్తున్నారు. మేము విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఉచితంగా ఇస్తామని రైతులకు ఆశచూపిన పలు మొక్కజొన్న విత్తన కంపెనీల ప్రతినిధులు చివరకు ఎరువులు, పురుగు మందులు సకాలంలో ఇవ్వకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతిని తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా జిల్లాలో సుమారు 65 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగులో ఉండగా, ఇందులో 40 వేల ఎకరాల వరకు సీడ్ కోసం రైతుల ద్వారా కంపెనీల ప్రతినిధులు పంటను సాగు చేయిస్తున్నారు. మరో 25 వేల ఎకరాల్లో కమర్షియల్ పంటను సాగు చేస్తున్నారు. మొక్కజొన్న కండెలో కనిపించని గింజలు: గత ఐదారేళ్ల పాటు తీవ్ర వర్షాభావంతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీరు లేక కరువుతో అల్లాడారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడం, భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పంటల సాగు విస్తారంగా చేపట్టారు. మొక్కజొన్న పంట సాగు జిల్లాలోనే అత్యధికంగా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. మొక్కజొన్న నాటితేఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెడితే పంట ద్వారా రూ.50 వేల వరకు వస్తుందని, ఇందులో రూ.30 వేల వరకు మిగు లుతుందని విత్తన కంపెనీ ప్రతినిధుల మాయమాటలు విని ఎంతో ఆశపడ్డారు. కంకుల్లో విత్తనాలు కనిపించడం లేదని, ఎక్కడో ఒక విత్తనం ఉంటే కండె బరువు ఎలా తూగుతుందని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి రాదని, చివరకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని చెబుతున్నారు. ఒక్కో రైతు 10 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని పంటను సాగు చేశారు. పండిన పంట తీసుకునేందుకు కొన్ని చోట్ల కంపెనీ ప్రతినిధులు రాకపోవడంతో పొలంలోనే రాలిపోతున్నాయి. కమర్షియల్ విత్తనాలు సాగుచేస్తే దున్నేస్తామంటూ బెదిరింపులు:‘‘మేము గ్రామంలో సీడ్ మొక్కజొన్న విత్తనాలు సాగు చేయిస్తున్నాం... మీరు మొక్కజొన్న సాగుచేయాలంటే మా వద్దే విత్తనాలు తీసుకోండి. కమర్షియల్ విత్తనాలు సాగుచేస్తే మా పంటలకు దిగుబడి రాదు. ఒక వేళ మమ్మల్ని కాదని మీ ఇష్టానుసారం కమర్షియల్ విత్తనాలు సాగుచేస్తే రాత్రికి రాత్రే దున్నేస్తామంటూ’’ కంపెనీ ప్రతినిధులు రౌడీయిజం చేస్తున్నారు.అందుకే తాము వారి వద్దనే విత్తనాలు తీసుకుని పంట సాగు చేస్తే ఇలా మమ్మల్ని నట్టేట ముంచారని రైతులు వాపోయారు. పంటను కోసుకెళ్లాల్సిన కంపెనీ ప్రతినిధులు పొలం వద్దకు రావడం లేదని, కనీసం తమకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల్లోనూ వ్యత్యాసం.. సీడ్ విత్తనాలు సాగు చేసిన రైతులకు ఎక్కువ ధరలు ఇవ్వాల్సిన కంపెనీల ప్రతినిధులు ధరల చెల్లింపులోనూ నిలువునా మోసం చేస్తున్నారు. కమర్షియల్ విధానంలో సాగైన మొక్కజొన్న పంటకు క్వింటాలు రూ.2,200 నుంచి రూ.2,600లు డిమాండ్ ఉండగా, సీడ్ కంపెనీలు మాత్రం రూ.1,650లు మాత్రమే ఇస్తామంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. విత్తనాలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకునే కంపెనీలు విత్తనాల సంచిపై ఎలాంటి అనుమతి ఉన్న సర్టిఫికెట్, కంపెనీ వివరాలు లేకుండానే రైతులకు అందిస్తున్నారు. కనీసం బిల్లులు ఉండవు. గ్రామాల్లో వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఏ విత్తనాలు సాగు చేస్తున్నారనేది వ్యవసాయాధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు మొక్కజొన్న రైతులు పంట దిగుబడి రాలేదన్న విషయం నా దృష్టికి తాలేదు. రైతులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సీడ్ కోసం సాగు చేసే పంట కాబట్టి విత్తనాలను స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేయరు. కంపెనీ నుంచి ఏజెంట్ల ద్వారా నేరుగా రైతులకు ఇస్తారు. రైతులు కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. కనీసం రశీదైనా తీసుకోవాలి. రైతులు రశీదులు తీసుకోరు, అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. దీనిపై గతంలోనూ రైతులకు అనేక పర్యాయాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. పంట దిగుబడి రాని రైతుల వద్దకు వెళ్లి విచారిస్తాం. కంపెనీల ద్వారా తగిన పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – ఎస్.రామ్మోహన్‌రెడ్డి, ఏఓ, గిద్దలూరు 12 ఎకరాల్లో సాగు చేశాను నేను 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సీడ్ మొక్కజొన్న విత్తనాలు సాగు చేశాను. ఎరువులు, పురుగు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీ ప్రతినిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుందనుకుంటే 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కౌలు కార్డు లేకపోవడంతో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు లేవు. సీడ్ కంపెనీలు చేస్తున్న మోసాలపై తగు చర్యలు తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలి.– పుల్లయ్య, రైతు, ప్రతాపరెడ్డి కాలనీ,గిద్దలూరు మండలం. -
కేజీ.. క్యాజీ..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ధాన్యం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి.. పంట పండించి.. ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే.. తూకం సమయంలో బస్తా బరువు కింద తరుగును నిబంధనల ప్రకారం 500 గ్రాములు తీయాల్సి ఉండగా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్తాకు కేజీ తరుగు కింద తీస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో బస్తాకు కేజీ చొప్పున తీస్తే పెద్ద మొత్తంలో ధాన్యం అమ్ముకునే రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. జిల్లాలో డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 28, ఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 94.. మొత్తం 122 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 15, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 80.. మొత్తం 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 7 డీఆర్డీఏ ఐకేపీ కేంద్రాల ద్వారా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 34 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,005 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం ధాన్యం 2,323.360 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 5,090.640 మెట్రిక్ టన్నులు.. మొత్తం 7,414 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కోతల విధింపుతో.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకునే రైతులకు కొర్రీలు తప్పడం లేదు. ధాన్యం తూకం వేసే సమయంలో కొనుగోలుదారులు కోతలు విధిస్తుండడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పాత బస్తాతో తూకం వేస్తే 500 గ్రాముల ధాన్యం, కొత్త బస్తాతో తూకం వేస్తే 600 గ్రాముల ధాన్యం తీయాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా.. బస్తాకు కేజీ చొప్పున ధాన్యం తరుగు తీస్తుండడంతో రైతులకు నష్టాలను మిగులుస్తున్నాయి. ధాన్యం పండించేందుకు శ్రమించి.. కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతుకు ధాన్యం అమ్మే దగ్గర కన్నీళ్లే మిగులుతున్నాయి. తన కళ్లముందే తరుగు తీస్తుండడంతో చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నిబంధనలకతీతంగా కొనుగోలు కేంద్రాల్లో కేజీ ధాన్యం తరుగు కింద తీస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇది చిన్న విషయంగానే కనిపిస్తున్నా.. రైతులకు కనిపించని నష్టాన్ని మిగులుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే మద్దతు ధరకు అమ్ముకోవచ్చనే ఆశతో ఇక్కడకు వస్తున్న రైతులకు నిబంధనల పేరుతో తీస్తున్న తరుగుతో నష్టం తప్పడం లేదు. ఒక్క తరుగు విషయంలోనే కాకుండా.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో లభించే మద్దతు ధర ఏమోగానీ.. ఇలాంటి ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలని రైతులు వాపోతున్నారు. హమాలీ ధరల విషయంలో.. ఇతర విషయాల్లో కూడా రైతులు ఇబ్బందులపాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కిలో తరుగు తీస్తున్నారు.. పాలేరులోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాను. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో బస్తా తరుగుగా కిలో తీస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 600 గ్రాములు తీయాల్సి ఉండగా.. కొనుగోలు కేంద్రాల్లో మాత్రం కిలో తరుగుగా తీస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. – బజ్జూరి నారాయణరెడ్డి, రైతు, పాలేరు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. ధాన్యం బస్తాలో తరుగు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగితే ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – బి.రాజేంద్రప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
పౌల్ట్రీ రైతు విలవిల
యాచారం: ఇటీవల భానుడి ప్రకోపానికి పౌల్ట్రీఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో నిత్యం ఒక్కో ఫారంలో వందలాదిగా చనిపోతున్నాయి. నిత్యం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కోళ్లు పెంచుతున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్ల మృత్యువాతను భరించలేక చిన్న, సన్నకారు రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల చికెన్ ధరలు కిలో రూ. 200 దాటింది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు చల్లదనం కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో కోళ్లు చనిపోవడం పరిపాటిగా మారింది. ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల తదితర మండలాల్లో వెయ్యి మంది రైతులు ఆయా మండలాల్లోని పీఏసీఏస్‌లు, వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్నారు. కొందరు రైతులు ఇంటిగ్రేషన్ పద్ధతిలో సుగుణ, స్నేహ, సీపీ తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని కోళ్లను పెంచుతున్నారు. ఆయా కంపెనీలు రైతులకు కోడిపిల్లలను సరఫరా చేయడంతో అవి రెండు నుంచి రెండున్నర కిలోల బరువు వచ్చే వరకు పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్నారు. కోడి పిల్లలకు కావాల్సిన దాణా, వైద్యం తదితరాలను కంపెనీ ప్రతినిధులే భరిస్తారు. కోళ్లు 40 నుంచి 45 రోజుల వయసు రాగానే రైతులు ఆయా కంపెనీలకే కోళ్లను విక్రయిస్తుంటారు. కిలోకు రూ. 22 నుంచి రూ.23 వరకు కంపెనీలు రైతులకు చెల్లిస్తున్నాయి. ఇలా డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో వెయ్యి మందికి పైగా రైతులు కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, ఇటీవల భానుడి ప్రతాపంతో పౌల్ట్రీ రైతు పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఒక్కో ఫారంలో వందలాదిగా కోళ్లు చనిపోవడం(మొటాల్టీ)తో ఇంటిగ్రేటెడ్ రైతులతో పాటు స్వతహాగా ఫారాలు నిర్వహిస్తున్న రైతులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో ఒక్కో ఫారంలో సగటున 20 నుంచి 30 శాతం వరకు కోళ్లు చనిపోతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నిత్యం లక్ష వరకు మృతి.. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో డివిజన్లోని ఆయా గ్రామాల్లో నిత్యం 50 వేల నుంచి లక్ష వరకు కోళ్లు చనిపోతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కోళ్లకు ఉపశమనం కలిగించడం కోసం రైతులు ఫ్యాన్లను ఏర్పాటు చేయడం, గోనె సంచులు కట్టి నీళ్లను చల్లడం, పైకప్పులపై గడ్డి వేసి నీళ్లు పోయడం.. తదితర రక్షణ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎండల తీవ్రత పెరగడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. యాచారం, మంచాల, మాడ్గుల, ఇబ్రహీంపట్నం మండలాల్లో బోరుబావుల్లో భూగర్భజలాలు లేకపోవడంతో కోళ్లను కాపాడుకోవడం, వాటి దాహార్తి తీర్చడం కోసం రైతులు ఒక్కో ట్యాంటర్కు రూ. 800 నుంచి రూ. 1,500 వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కోళ్ల పెరిగే 40 రోజుల్లోనే కేవలం నీటికే రూ. 40 వేల ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లేక పోవడంతో రైతులు చాలా మంది ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో కోళ్లు పెంచుతున్నారు. ఎండలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇక స్వయంగా కోళ్ల పెంపకం చేపడుతున్న రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వేలసంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. చనిపోతున్న కోళ్లను పొలాల్లో గుంతలు తీసి పూడ్చివేస్తున్నారు. నష్టం రోజుకు రూ. కోటికి పైగానే ఇబ్రహీంపట్నం డివిజన్లోని ఆయా మండలాల్లో పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్న దాదాపు వెయ్యి మందికి పైగా రైతులు ఆయా పీఏసీఎస్‌లు, వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.100 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. కోళ్ల పెంపకంతో వచ్చే ఆదాయంతో ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా అనుకూలిస్తే 10 వేల కోళ్ల పెంపకం చేస్తున్న రైతులకు 40 రోజులకు రూ. 60 వేల నుంచి రూ.80 వేలు, 20 వేల కోళ్ల పెంపకం చేసే రైతులకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. తద్వారా బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తుంటారు. అయితే, ఎండల తీవ్రతతో ఇబ్రహీంపట్నం డివిజన్లోని పలు గ్రామాల్లో వేలాది కోళ్లు మృతి చెందడంతో రైతులకు నిత్యం రూ. కోటికి పైగానే నష్టం వస్తోంది. ఇక జిల్లావ్యాప్తంగా అది రూ. 10 కోట్లకు పైమాటే. ఎండల తీవ్రతకు కోళ్లు చనిపోతే ఇంటిగ్రేషన్ సంస్థలు కోడి పిల్లల ఖర్చు భరిస్తాయే తప్పా, కోళ్ల పెంపకం ఉపయోగించే దాణా, వైద్యం ఖర్చులను రైతే భరించాల్సి ఉంటుంది. కోళ్లు చేతికి వచ్చే సమయంలో చనిపోతుండడంతో రైతులు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఆయా మండలాల్లో రెండు, మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ విషయంలో తమకు ఆపన్నహస్తం అందివ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు. చనిపోయిన కోళ్లను చూపిస్తున్న రైతు లిక్కి సుధాకర్‌రెడ్డి -
‘రెడ్ జోన్’లో గ్రీన్హౌస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్హౌస్ రైతుల వెతలు ఇవి. గ్రీన్హౌస్లో కూరగాయలు సాగుచేసిన రైతులంతా నష్టాల పాలై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం గ్రీన్హౌస్ సాగుకు ప్రోత్సాహం కోసం 75 శాతం సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రీన్హౌస్ సాగుకు ఎకరానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చయితే.. ప్రభుత్వమే రూ.30 లక్షలు భరిస్తుండగా, రైతులు రూ.10 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,042 ఎకరాల్లో గ్రీన్హౌస్లకు అనుమతి ఇచ్చారు. అందులో 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు జరుగుతోంది. మిగతా 292 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే సరైన విత్తనాలు, సాంకేతిక అవగాహన కరువై నష్టాలపాలవుతున్నారు. పూలతో లాభాలు జరబెర వంటి పూల సాగుతో రైతులు లాభాలు పొందుతున్నారు. కూరగాయల సాగుతో మాత్రం చాలా చోట్ల నష్టాలే వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అయితే పూల సాగులోనూ పెద్దగా లాభాలు రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. రైతులకు అవగాహన లేకపోవడం, అధికారుల నుంచి సహకారం లభించకపోవడం, వాతావరణంలో వచ్చే మార్పులను అంచనా వేసే పరిస్థితి లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల మండలం చెనుపల్లిలో ఒక రైతు సీజన్లో టమాటా సాగు చేశారు. కానీ ధర కిలో రెండు మూడు రూపాయలకు పడిపోవడంతో తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఏ సమయంలో ఏయే కూరగాయలు సాగు చేయాలన్న అవగాహన లేక ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. సూచనలతో లాభదాయకం అయితే పలు చోట్ల రైతులు స్వయంగా సొమ్ము ఖర్చు చేసుకుని.. శాస్త్రవేత్తల సూచనలతో లాభాలు పొందుతున్నారు. చేవెళ్ల మండలం చెనుపల్లిలో 45 గ్రీన్‌హౌస్‌ల సాగును పరిశీలించేందుకు నెలకోసారి పుణే నుంచి శాస్త్రవేత్త వస్తుంటారు. వచ్చినప్పుడల్లా ఒక్కో రైతు రూ.3 వేల చొప్పున రూ.1.35 లక్షలు ఆయనకు చెల్లించి.. తగిన సూచనలు పొందుతుంటారు. దీంతో అక్కడ గ్రీన్హౌస్ సాగు లాభదాయకంగా ఉంది. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదు. సాధారణ రైతులకు అవగాహన లేక, ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేక నష్టాలపాలవుతున్నారు. నెట్హౌస్లపై దృష్టి.. గ్రీన్ హౌస్‌లకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చయ్యే నెట్ హౌస్‌పై రైతులు దృష్టి సారిస్తున్నారు. దీనికి ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. పంజాబ్, హరియాణాల్లో నెట్‌హౌస్ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కూరగాయల సాగుకు నెట్హౌస్లను ప్రోత్సహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైతు పేరు నాగిరెడ్డి.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం. రెండేళ్ల కింద ఎకరా విస్తీర్ణంలో గ్రీన్హౌస్ సాగు మొదలుపెట్టారు. రూ.10 లక్షలు అప్పుచేసి మార్జిన్ మనీగా ప్రభుత్వానికి చెల్లించారు. భూమిలో మట్టి మార్పు, ఎరువులు, విత్తనాలు, ఇతర ఖర్చులకు మరో రూ.5 లక్షలు ఖర్చుచేశారు. గ్రీన్హౌస్లో క్యాప్సికం, టమాటా సాగుచేశారు. కానీ దిగుబడులు సరిగా రాలేదు. సీజన్లో టమాటా బాగా పండినా ధర లేక నష్టం వాటిల్లింది. ఏడాదిగా గ్రీన్‌హౌస్‌ను ఖాళీగా ఉంచారు. ఇప్పుడా భూమిని అమ్మకానికి పెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన ఈ రైతుపేరు రాజిరెడ్డి. రెండేళ్ల క్రితం మూడెకరాల్లో గ్రీన్హౌస్ సాగు మొదలుపెట్టారు. కీరా, క్యాప్సికం, టమాటా పంటలు వేశారు. టమాటా ఏపుగా పెరిగినా దిగుబడి రాలేదు. గతేడాది క్యాప్సికం వేసినా.. గ్రీన్హౌస్ నిర్మాణం దెబ్బతిని పంటకు నష్టం వాటిల్లిందని, వేసవిలో కీరా వేస్తే వైరస్ కారణంగా నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. ప్రత్యేక నిర్వహణ అవసరం గ్రీన్హౌస్లో కూరగాయలు సాగు చేయాలంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజువారీగా పరిజ్ఞానం పెంచుకోవాలి. నిర్వహణ సరిగా లేకపోతే నష్టాలు తప్పవు. ఏ సీజన్లో ఏ పంటలు వేసుకోవాలన్న అవగాహన ఉండాలి. వర్షాకాలంలో ఆకుకూరలు, చలికాలంలో బెండ, బీర, కాకరకాయలు పండించాలి. క్యాప్సికం, కీరాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. మార్కెట్ సరళిని బట్టి పూల సాగు చేపట్టాలి.. – వెంకట్రామిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ -
సీఎం మాటలు.. నీటి మూటలు మిగిలేది కన్నీరే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘నష్టం వాటిల్లని రైతుల పేర్లు ఉన్నా ఫర్వాలేదు. కానీ నష్టపోయిన ఒక్క రైతు పేరు కూడా పంట దెబ్బతిన్న వారి జాబితాలో లేకపోతే ఉపేక్షించేది లేదు. పంట నష్ట పోయిన రైతులను గుర్తించడంలో మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఏ మాత్రం అవకాశమున్నప్పటికీ నష్టపోయిన వారి జాబితాలో చేర్చండి. నేలకొరిగిన పంటలనే కాదు.. పైకి బాగానే ఉండి లోపల కుళ్లిపోయిన పంటను గుర్తించేందుకు శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలను రంగంలోకి దింపుతున్నాం’ సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనలో పలికిన పలుకులివి. ఆచరణకు వచ్చేసరికి ఈ మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాలో ప్రాథమిక అంచనాలకు పొంతన లేని రీతిలో తయారవుతున్న పంటనష్టం నివేదికలు నష్టపోయిన రైతుల ఆశలపై నీళ్లుచల్లుతున్నాయి. ముఖ్యమంత్రి హామీలు ఆదిలోనే అటకెక్కేలా కనిపిస్తున్నాయనేఆవేదన వారిలో పెల్లుబుకుతోంది. పంటలో 50 శాతం - మిగతా 2లోఠపైగా నష్టపోతేనే నష్టంగా పరిగణించాలన్న నిబంధన తమకు పరిహారం చెల్లించకుండా ఏదోలా ఎగ్గొట్టేందుకేనని వారు ఆక్రోశిస్తున్నారు. జరిగిన నష్టం రూ.505 కోట్లకు పైనే.. గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లావ్యాప్తంగా వరితో సహా అన్ని రకాల పంటలు కలిపి సుమారు 3లక్షల15వేల ఎకరాలలో దెబ్బతిన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. వరి 2 లక్షల 40వేల ఎకరాల్లో, పత్తి 37 వేల హెక్టార్లలో, కూరగాయల తోటలు 12,500 ఎకరాల్లో, అపరాలు 150 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. పంట నష్టం రూ.505.22 కోట్ల పైమాటేనని అంచనా వేశారు. జిల్లాలో 1404 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 906 గ్రామాలు భారీ వర్షాల బారినపడ్డాయని అధికారులు విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలే చెపుతున్నాయి. పంట నష్టం అంచనా వేసేందుకు జిల్లావ్యాప్తంగా 40 బృందాలను ఏర్పాటు చేశారు. నిర్దేశించిన 906 గ్రామాల్లో సర్వే దశకు వచ్చేసరికి సుమారు 200 గ్రామాలను జాబితా నుంచి తప్పించారని తెలియవచ్చింది. ఇందుకు అధికారులు 50 శాతం మేర పంట దెబ్బ తినలేదనే కారణం చూపిస్తున్నారు. దీనిని బట్టే బాధిత రైతుల పట్ల కిరణ్ ప్రభుత్వం కారుణ్యం ఏ పాటిదో అర్థమవుతుంది. జాబితా నుంచి పేర్లు తొలగించిన 200 గ్రామాల్లో కనీసం 100 గ్రామాల్లో 40 నుంచి 50 శాతం దెబ్బ తిన్నప్పటికీ నిబంధనల పేరుతో పక్కనపెట్టేయాల్సి వచ్చిందని క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. 50 శాతం లోపు నష్టపోతే పరిగణనలోకి తీసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో తామేమి చేయగలుగుతామని పేర్కొంటున్నారు. పంట నష్టం అంచనాల బృందాలు 55 మండలాల పరిధిలో సర్వే నిర్వహించి లక్షన్నర ఎకరాల్లో మాత్రమే వరిపంట దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చినట్టు మంగళవారం రాత్రి జిల్లాకేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పత్తి పంట పాతికవేల ఎకరాల్లో దెబ్బ తిన్నట్టు నిర్ధారించారు. మరో మూడు మండలాలు (యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు) మినహా 55 మండలాల్లో వరి, పత్తి సహా అన్ని రకాల పంటల నష్టాలపై నివేదికలు తయారయ్యాయి. వరి, పత్తికి సంబంధించిన నివేదికల్లోనే ప్రాథమికంగా అంచనా వేసిన దానిలో సుమారు 40 శాతం వరకు నష్టం జరగలేదని తేలుస్తుండగా మిగిలిన పంటలకు సంబంధించి కూడా ప్రాథమిక అంచనాలకు పొంతన లేకుండా నివేదికలు తయారవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదేమి ప్రామాణికం..? గ్రామంలో ఏదో ఒక కమతాన్ని ఎంపిక చేసుకుని అక్కడ పంట దిగుబడిని అంచనా వేస్తారు. దీన్నే గ్రామంలో సాగైన మొత్తం విస్తీర్ణానికి వర్తింపచేస్తారు. ఈ ప్రామాణికంగానే ఆ గ్రామంలో దిగుబడిపై ఒక అంచనాకొస్తున్నారు. ఖరీఫ్‌లో ఎకరాకు 24 బస్తాల ఉత్పత్తి అవుతుందని అంచనా. 10 నుంచి 12 బస్తాల దిగుబడి వస్తే 50 శాతం పంట దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ, రెవెన్యూశాఖాధికారులు సంయుక్తంగా నిర్ధారణకు వస్తారు. ఎంపిక చేసిన కమతంలో 50 శాతం కంటే ఒక్క శాతం తగ్గినా ఆ గ్రామంలో పంట దెబ్బ తినలేదన్నట్టుగా లెక్కతేల్చి మొత్తం గ్రామాన్నే పంటనష్టపోయిన గ్రామాల జాబితా నుంచి తొలగిస్తారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నరైతులు ప్రభుత్వాధికారుల తీరుతో మరింత కుదేలవుతున్నారు. సాధారణంగా 50 శాతానికి పైబడి దెబ్బతిన్న పంటలకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ లభించనుంది. ఇప్పుడేమో ప్రాథమిక అంచనాలకు పొంతన లేకుండా తయారవుతున్న పంట నష్టాల అంచనాలతో తమకు అందే అరకొర సాయం కూడా అందకుండా పోతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.