సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘నష్టం వాటిల్లని రైతుల పేర్లు ఉన్నా ఫర్వాలేదు. కానీ నష్టపోయిన ఒక్క రైతు పేరు కూడా పంట దెబ్బతిన్న వారి జాబితాలో లేకపోతే ఉపేక్షించేది లేదు. పంట నష్ట పోయిన రైతులను గుర్తించడంలో మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఏ మాత్రం అవకాశమున్నప్పటికీ నష్టపోయిన వారి జాబితాలో చేర్చండి. నేలకొరిగిన పంటలనే కాదు.. పైకి బాగానే ఉండి లోపల కుళ్లిపోయిన పంటను గుర్తించేందుకు శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలను రంగంలోకి దింపుతున్నాం’ సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనలో పలికిన పలుకులివి. ఆచరణకు వచ్చేసరికి ఈ మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాలో ప్రాథమిక అంచనాలకు పొంతన లేని రీతిలో తయారవుతున్న పంటనష్టం నివేదికలు నష్టపోయిన రైతుల ఆశలపై నీళ్లుచల్లుతున్నాయి. ముఖ్యమంత్రి హామీలు ఆదిలోనే అటకెక్కేలా కనిపిస్తున్నాయనేఆవేదన వారిలో పెల్లుబుకుతోంది. పంటలో 50 శాతం - మిగతా 2లోఠపైగా నష్టపోతేనే నష్టంగా పరిగణించాలన్న నిబంధన తమకు పరిహారం చెల్లించకుండా ఏదోలా ఎగ్గొట్టేందుకేనని వారు ఆక్రోశిస్తున్నారు.
జరిగిన నష్టం రూ.505 కోట్లకు పైనే..
గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లావ్యాప్తంగా వరితో సహా అన్ని రకాల పంటలు కలిపి సుమారు 3లక్షల15వేల ఎకరాలలో దెబ్బతిన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. వరి 2 లక్షల 40వేల ఎకరాల్లో, పత్తి 37 వేల హెక్టార్లలో, కూరగాయల తోటలు 12,500 ఎకరాల్లో, అపరాలు 150 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. పంట నష్టం రూ.505.22 కోట్ల పైమాటేనని అంచనా వేశారు. జిల్లాలో 1404 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 906 గ్రామాలు భారీ వర్షాల బారినపడ్డాయని అధికారులు విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలే చెపుతున్నాయి. పంట నష్టం అంచనా వేసేందుకు జిల్లావ్యాప్తంగా 40 బృందాలను ఏర్పాటు చేశారు. నిర్దేశించిన 906 గ్రామాల్లో సర్వే దశకు వచ్చేసరికి సుమారు 200 గ్రామాలను జాబితా నుంచి తప్పించారని తెలియవచ్చింది. ఇందుకు అధికారులు 50 శాతం మేర పంట దెబ్బ తినలేదనే కారణం చూపిస్తున్నారు. దీనిని బట్టే బాధిత రైతుల పట్ల కిరణ్ ప్రభుత్వం కారుణ్యం ఏ పాటిదో అర్థమవుతుంది.
జాబితా నుంచి పేర్లు తొలగించిన 200 గ్రామాల్లో కనీసం 100 గ్రామాల్లో 40 నుంచి 50 శాతం దెబ్బ తిన్నప్పటికీ నిబంధనల పేరుతో పక్కనపెట్టేయాల్సి వచ్చిందని క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. 50 శాతం లోపు నష్టపోతే పరిగణనలోకి తీసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో తామేమి చేయగలుగుతామని పేర్కొంటున్నారు. పంట నష్టం అంచనాల బృందాలు 55 మండలాల పరిధిలో సర్వే నిర్వహించి లక్షన్నర ఎకరాల్లో మాత్రమే వరిపంట దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చినట్టు మంగళవారం రాత్రి జిల్లాకేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పత్తి పంట పాతికవేల ఎకరాల్లో దెబ్బ తిన్నట్టు నిర్ధారించారు. మరో మూడు మండలాలు (యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు) మినహా 55 మండలాల్లో వరి, పత్తి సహా అన్ని రకాల పంటల నష్టాలపై నివేదికలు తయారయ్యాయి. వరి, పత్తికి సంబంధించిన నివేదికల్లోనే ప్రాథమికంగా అంచనా వేసిన దానిలో సుమారు 40 శాతం వరకు నష్టం జరగలేదని తేలుస్తుండగా మిగిలిన పంటలకు సంబంధించి కూడా ప్రాథమిక అంచనాలకు పొంతన లేకుండా నివేదికలు తయారవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదేమి ప్రామాణికం..?
గ్రామంలో ఏదో ఒక కమతాన్ని ఎంపిక చేసుకుని అక్కడ పంట దిగుబడిని అంచనా వేస్తారు. దీన్నే గ్రామంలో సాగైన మొత్తం విస్తీర్ణానికి వర్తింపచేస్తారు. ఈ ప్రామాణికంగానే ఆ గ్రామంలో దిగుబడిపై ఒక అంచనాకొస్తున్నారు. ఖరీఫ్‌లో ఎకరాకు 24 బస్తాల ఉత్పత్తి అవుతుందని అంచనా. 10 నుంచి 12 బస్తాల దిగుబడి వస్తే 50 శాతం పంట దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ, రెవెన్యూశాఖాధికారులు సంయుక్తంగా నిర్ధారణకు వస్తారు. ఎంపిక చేసిన కమతంలో 50 శాతం కంటే ఒక్క శాతం తగ్గినా ఆ గ్రామంలో పంట దెబ్బ తినలేదన్నట్టుగా లెక్కతేల్చి మొత్తం గ్రామాన్నే పంటనష్టపోయిన గ్రామాల జాబితా నుంచి తొలగిస్తారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నరైతులు ప్రభుత్వాధికారుల తీరుతో మరింత కుదేలవుతున్నారు. సాధారణంగా 50 శాతానికి పైబడి దెబ్బతిన్న పంటలకు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ లభించనుంది. ఇప్పుడేమో ప్రాథమిక అంచనాలకు పొంతన లేకుండా తయారవుతున్న పంట నష్టాల అంచనాలతో తమకు అందే అరకొర సాయం కూడా అందకుండా పోతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
సీఎం మాటలు.. నీటి మూటలు మిగిలేది కన్నీరే..
Published Wed, Nov 20 2013 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement