అయ్యో...ఇదేమి కష్టం
అయ్యో...ఇదేమి కష్టం
Published Wed, May 17 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
- నడవలేని రోగులకు చక్రాల బళ్లేవీ...
- లంచం ఇస్తేనే కదిలేది లేదంటే అంతే
- జీజీహెచ్‌లో నరకం చవిచూస్తున్న రోగులు
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకంటూ రోగులు హడలిపోతున్నారు. ఏ రోగమొచ్చినా పెద్ద దిక్కుగా నిలవాల్సిన పెద్దాసుపత్రి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. వైద్యం మాట ఎలా ఉన్నా చక్రాల బండి కూడా కనీస అవసరాలు తీర్చలేకపోతోంది. వీల్ చైర్‌లు లేవంటూ రోగులకు నరకం చూపిస్తున్నారు. చేయి తడిపిన వారికే కుర్చీ అంటూ బేరాలకు దిగుతుండడంతో ఏమి చేయాలో తెలియక రోగి సహాయకులు దిక్కులు చూస్తున్నారు.
కాకినాడ వైద్యం: ప్రమాదాలబారిన పడిన వాళ్లని ... శస్త్ర చికిత్సకు గురైన వారిని, నడవలేని రోగులను తరలించేందుకు ఆసుపత్రిలో వీల్‌చైర్ ఎంతో అవసరం. జిల్లాకు దిక్సూచిగా ఉన్న జీజీహెచ్‌లో కుర్చీల కొరత ... అరకొరగా ఉన్న సిబ్బందిని సాకుగా చూపించి ప్రాణాపాయ స్థితిలో జీజీహెచ్‌కు వస్తున్న రోగులను కొంతమంది నరకం చూపిస్తున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో నడవలేని రోగులను రోగ నిర్థారణ పరీక్షల కోసం ఇతరత్రా అవసరాల కోసం ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు తోపుడు కుర్చీలపై తీసుకెళ్లాలి. తప్పనిసరై తీసుకువెళ్లాలంటే అడిగినంత లంచం ఇవ్వాల్సిందే. లేదంటే రోగిని అలాగే వదిలేసి వెళ్లిపోయిన ఘటనలుండడంతో రోగుల సహాయకులు, బంధువులు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఏళ్ల తరబడిగా సిబ్బంది నియామకం చేపట్టపోవడంతో ఈ దుస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.
కాకినాడ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్సలు పొందేందుకు నిత్యం మూడు వేల మంది రోగులు వచ్చీ,పోతుంటారు. జీజీహెచ్‌లో అధికారికంగా 1065 పడకలుండగా అనధికారికంగా 1,800 మంది దాకా ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. మెడికల్, సర్జికల్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరోలజీ, గైనిక్, టీబీ, ఎమర్జన్సీ విభాగంలోని ఎమ్మెల్సీ, నాన్ ఎమ్మెల్సీ వంటి 25 విభాగాల్లో రోగులకు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్‌పేషెంట్ రోగులకు రోగ నిర్థారణ పరీక్షల కోసం రోజుకి 300 మందికి, ఓపీల్లోని సుమారు 200 మంది రోగులకు పరీక్షలకు సిఫారసు చేస్తూంటారు. వీరిలో అనారోగ్యంతో ఉండీ నడవలేని పరిస్థితిలో ఉన్న రోగులను సంబంధిత పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు 70 మంది మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్‌వో), 30 మంది ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో)లు జీజీహెచ్‌లో పని చేస్తున్నారు. మరో 50 మంది దాకా సిబ్బందిని ప్రభుత్వం భర్తీ చేస్తే రోగులకు సకాలంలో సేవలందే అవకాశం ఉంటుంది. రోగులను తీసుకెళ్లేందుకు 96 తోపుడు ఇనుప కుర్చీలు, 110 స్ట్రెక్చర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రోగులకు పూర్తి స్థాయిలో సేవలందక రోగులు గగ్గోలు పెడుతున్నారు. వార్డుల నుంచి రోగ నిర్థారణ పరీక్షల కేంద్రాలకు తీసుకెళ్లడంలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు తీవ్ర జాప్యం చేయడంతోపాటు రూ. 50లు ఇస్తేనే గానీ కుర్చీల్లో తీసుకెళ్లడం కుదరదని కరాఖండీగా చెప్పేయడంతో రోగులుతో వచ్చిన సహాయకులే ఆ పని చేస్తున్నారు. అడిగినంత డబ్బులివ్వకపోతే కుర్చీలు ఖాళీగా లేవంటూ ఇక్కట్లకు గురిచేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులివ్వకపోతే నరకమే...
. తోపుడు కుర్చీలో వార్డు నుంచి ల్యాబ్‌కి తీసుకెళ్లినందుకు రూ.50 అడుగుతున్నారు. డబ్బులివ్వకపోతే తీసుకెళ్లడం కుదరదు, లేకపోతే మీరే తీసుకెళ్లండంటూ రోగిని అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు.
పి,నారాయణమ్మ, రోగి బంధువు, జగన్నాథపురం.
డబ్బులడిగితే చర్యలు
సిబ్బంది ఎవరైనా రోగులను డబ్బులడిగినా, తోపుడు కుర్చీపై తీసుకెళ్లడంలో తీవ్ర జాప్యం చేసినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలి. ఈ విషయమై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
టీఎస్‌ఆర్ మూర్తి,సీఎస్‌ఆర్‌ఎంవో, ప్రభుతాసుపత్రి, కాకినాడ.
Advertisement
Advertisement