వైద్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
వైద్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
Published Wed, Oct 19 2016 10:37 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
- కలెక్టర్ స్పందించకపోతే ఏం చేయాలి
–సమస్యను ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తా
–కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించకుండా వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఆరోపించారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల వార్డును ఆమె సందర్శించారు. తాను గతంలో ఇచ్చిన రూ.23లక్షల ఎంపీ ల్యాడ్స్‌తో కొనుగోలు చేసి వెంటిలేటర్లను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె ప్రాంతీయ కార్డియోథొరాసిక్ సర్జికల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ విభాగంలో ఏర్పాటైన అత్యాధునిక వసతులు, సౌకర్యాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్డియోథొరాసిక్ విభాగంలో కార్పొరేట్ స్థాయి వసతులు, సౌకర్యాలు ఉన్నాయని, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరత, మందుల కొరత వేధిస్తోందన్నారు. ఈ కారణంగా ఇక్కడి వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఎన్‌టిఆర్ వైద్యసేవ నిధులు రూ.10కోట్లకు పైగానే ఉన్నా మందులు కొనేందుకు జిల్లా కలెక్టర్ త్వరగా స్పందించడం లేదని, అందుకే ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రధానికి ఆహ్వానం..
కర్నూలు మెడికల్ కాలేజి డైమండ్‌జూబ్లీ ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానిస్తామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే కర్నూలు పెద్దాస్పత్రిలో ఉత్తమమైన సేవలు అందుతున్నాయని కొనియాడారు. ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులు బాగా పనిచేస్తున్నారని, పారిశుద్ధ్యం సైతం బాగానే ఉందన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో రోగులు మందులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుకను వైద్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఎంవోలు వై. శ్రీనివాసులు, వై. ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మహేశ్వరి మృతి..
కార్డియోథొరాసిక్ విభాగంలో సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే గత ఆదివారం ఆపరేషన్ థియేటర్‌లోనే తన మేనకోడలు మహేశ్వరి మృతి చెందిందని టి. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం ఆసుపత్రికి వచ్చిన ఎంపీని కలిసి విన్నవించారు. బ్రాహ్మణకొట్కూరుకు చెందిన క్రిష్ణుడు కుమార్తె అయిన బి. మహేశ్వరికి రెండేళ్ల క్రితం భర్త వదిలేశాడని, ఆమెకు ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారని తెలిపారు. ఆమెకు గుండెలో రంధ్రాలు ఉండటంతో ఈ నెల 13వ తేదిన ఆసుపత్రిలో చేర్చామని, 16వ తేదీన గుండె ఆపరేషన్ చేశారన్నారు. కానీ ఆమె ఆపరేషన్ థియేటర్‌లోనే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విభాగంలో అవసరమైన సిబ్బంది లేరని, హైదరాబాద్ నుంచి పిలిపించి ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు. వెంటనే సిబ్బందిని నియమించి రోగులకు మేలు చేయాలని ఆయన ఎంపీ బుట్టా రేణుకను కోరారు.
కాంట్రాక్టు కార్మికులకు కొత్త వేతనాలివ్వాలి
ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటి గార్డులకు, పెస్ట్ కంట్రోల్, పారామెడికల్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.151 ప్రకారం కొత్త వేతనాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ బుట్టా రేణుకకు ఏఐటీయుసి నాయకులు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప, జిల్లా కార్యదర్శి పి. ప్రభాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు బి. వెంకటేష్, పి. రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
Advertisement