రైళ్లలో కొందరు టీసీల చేతివాటం
వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికులకు బెర్త్‌ల విక్రయాలు
ప్రయాణికుల డిమాండ్ ఉన్న రైళ్లలో వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: ఏసీ బెర్త్‌కు రూ.1000..నాన్ ఏసీ బెర్త్‌కు రూ.500. ఇవి టికెట్ చార్జీలు కాదు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్తులు కావాలంటే టికెట్ కలెక్టర్లకు (టీసీలకు) సమర్పించుకోవలసిన ఆమ్యామ్యాలు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రైళ్లు, కొన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరహా బేరాలు జోరుగా సాగుతున్నాయి. టీసీలే స్వయంగా డబ్బులు తీసుకొని బెర్తులు కట్టబెట్టడంతో వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న వారు నిశ్చింతంగా ప్రయాణం చేస్తున్నారు. నిజానికి టికెట్ నిర్ధారణ అయితే తప్ప ట్రైన్‌లో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. ప్రతి ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రయాణికుల జాబితా విడుదల అవుతుంది. ఆ జాబితాలో ఉన్న వాళ్లు మాత్రమే రిజర్వేషన్ లభించిన ప్రయాణికులు. కానీ ప్రతి ట్రైన్‌కు వందల సంఖ్యలో వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికులు ఉంటారు.
చార్ట్ (జాబితా) సిద్ధమైన తరువాత వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు తమ టికెట్‌లను రద్దు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి టికెట్ డబ్బులు వారి ఖాతాలోకి ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతాయి. కానీ కొందరు ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్‌లపైనే ప్రయాణం చేస్తారు. ఏదో ఒకవిధంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో టికెట్‌లను రద్దు చేసుకోకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో ఈ తాకిడి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులపైనే కొందరు టీసీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నాన్ ఏసీ స్లీపర్ బోగీల్లో బెర్తులకు రూ.500, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో బెర్తులకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
శబరి రైళ్లకు డిమాండ్ ఫుల్...
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు తరలివెళ్తున్నారు. కొంతమంది సాధారణ భక్తులు సైతం దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజు రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్రత్యేక రైళ్లకు సైతం డిమాండ్ బాగా ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లాలన్నా, ఫ్లైట్‌లో వెళ్లాలన్నా పెద్దమొత్తంలో వెచ్చించవలసి ఉంటుంది. చార్జీల భారం దృష్ట్యా ఏదోఒకవిధంగా రైళ్లలో వెళ్లడమే మంచిదని భావించే వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికుల అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలోని వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాలకు చెందిన నలుగురు స్నేహితులు నవంబర్ 27వ తేదీన 12 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17230)లో సికింద్రాబాద్ నుంచి శబరికి బయలుదేరారు. వాళ్ల ప్రయాణానికి ఇంచుమించు నెల రోజుల క్రితమే సెకండ్ ఏసీ రిజర్వేషన్ కోసం టికెట్‌లు కొనుగోలు చేశారు. కానీ ప్రయాణ తేదీ నాటికి కూడా టికెట్‌లు నిర్ధారణ కాలేదు. రిజర్వేషన్ లభించలేదు. చార్ట్ (ప్రయాణికుల జాబితా) సిద్ధమైన తరువాత కూడా ఆ ప్రయాణికులు వెయిటింగ్ జాబితా (5 నుంచి 8 వరకు)లోనే ఉండిపోయారు.
అయినప్పటికీ టికెట్‌లను రద్దు చేసుకోకుండా అదే ట్రైన్‌లో బయలుదేరారు. రైలు ప్రారంభమైన కొద్దిసేపటికి వెళ్లి టీసీని సంప్రదించారు. ‘మొదట్లో ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోయినప్పటికీ ట్రైన్ తిరుపతికి చేరుకున్న తరువాత ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1000 చొప్పున మొత్తం రూ.4000 తీసుకొని నాలుగు బెర్తులు కేటాయించాడు. సెకండ్ ఏసీలోనే ఆ సదుపాయం లభించడంతో ప్రయాణం నిశ్చింతగా సాగింది.’ అని ఆ ప్రయాణికులు చెప్పారు. తమతో పాటు మరి కొందరికి కూడా రూ.1000 చొప్పున తీసుకొని ఏసీ బోగీల్లో, రూ.500 చొప్పున తీసుకొని స్లీపర్‌లో బెర్తులు ఇచి్చనట్లు వారు చెప్పారు.
ఎలా సాధ్యం...
⇒ రిజర్వేషన్లు నిర్ధారణ అయిన ప్రయాణికులు ఆకస్మికంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకో వ చ్చు. అలాంటి వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ట్రైన్‌లో విధులు నిర్వహించే టికెట్ ఎగ్జామినర్, టికెట్ కలెక్టర్, తదితర సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికుల వివరాలను తమ వద్ద ఉండే హ్యాండ్ హెల్డ్ మిషన్‌లలో నమోదు చేయాలి.
⇒ ఈ క్రమంలోనే కొందరు టీసీలు ఇలాంటి ప్రయాణికుల వివరాలను నమోదు చేయడంలోనే తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు.
⇒ సదరు ప్రయాణికుల పేరు వద్ద ‘కాన్సిల్’ అని కాకుండా ‘జాయిన్’ అని నమోదు చేసి ఆ బెర్తులను వెయిటింగ్ లిస్ట్ వాళ్లకు కేటాయిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ టికెట్‌లపైన ఇది సాధ్యం కాదు. రిజర్వేషన్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన
వెయిటింగ్ లిస్ట్ టికెట్‌లపైనే టీసీలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment