Radha Murder Case Took Turning Point In Prakasam District - Sakshi
Sakshi News home page

రాధ హత్య కేసులో షాకింగ్‌ విషయాలు.. సినిమా ట్విస్టులు తలపించే రీతిలో..

Published Sun, May 21 2023 9:31 AM | Last Updated on Sun, May 21 2023 12:21 PM

Radha Assassination Case Has Taken Turning Point In Prakasam - Sakshi

భార్య రాధ, భర్త మోహన్‌రెడ్డి, ఇద్దరు పిల్లలు

కనిగిరి రూరల్‌(ప్రకాశం జిల్లా): వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద వివాహిత దారుణ హత్యకు గురైన కేసు కీలక మలుపు తిరిగింది. కోట రాధ (35)ను ఆమె భర్త మోహన్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రాధకు ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త మోహన్‌రెడ్డి పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కె.రాధకు నల్గొండ జిల్లా కోదాడకు చెందిన కోట మోహన్‌రెడ్డితో 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. రాధ గృహిణి కాగా.. మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే ఉంటున్న రాధ చిన్ననాటి స్నేహితుడు కాశయ్య అలియాస్‌ కాశిరెడ్డి కుటుంబ సభ్యులతో దగ్గరయ్యాడు. ఆ క్రమంలోనే కాశిరెడ్డి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పేరిట రాధ నుంచి సుమారు రూ.16 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అతనికి రాధ తన భర్త మోహన్‌రెడ్డి నుంచి కూడా రూ.35 లక్షల వరకు ఇప్పించింది.

కొంతకాలానికి కాశిరెడ్డి అప్పులపాలై పరారయ్యాడు. అప్పు తీర్చకుండా సుమారు రెండేళ్ల నుంచి కాశిరెడ్డి తిప్పుతుండటంతో భార్యభర్తల మధ్య వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో భార్య రాధపై మోహన్‌రెడ్డికి అనుమానం కలిగింది. ఒకవైపు ఆర్థికపరమైన అంశం, మరోవైపు అనుమానం రెండు మోహన్‌రెడ్డిలో తీవ్ర ద్వేషాన్ని పెంచాయి. దీంతో భార్యను ఎలాగైనా అంత­మొందించేందుకు పథకం రచించినట్టు తెలిసింది. 

ఫోన్లు.. సిమ్‌ కార్డ్‌లు కొని..
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఓ ఫోన్, సిమ్‌కార్డ్‌ కొనుగోలు చేసిన భర్త మోహన్‌రెడ్డి.. ఆ వ్యక్తి పేరు ట్రూ కాలర్‌లో వచ్చేలా నమోదు చేశా డు. ఆ నంబర్‌తో సొంత భార్యతోనే చాటింగ్‌ చేయగా.. మోహన్‌రెడ్డి అనుమానానికి మరింత బలం చేకూరిందని సమాచారం. దీంతో ఎలాగైనా భార్య ను చంపాలని మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న జిల్లెళ్లపాడులో జాతర ఉండటంతో రాధ పుట్టింటికి భర్త మోహన్‌రెడ్డి, పిల్లలు వచ్చారు. భార్యాపిల్లల్ని ఇక్కడే వదిలేసి మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు.

ఆ తర్వాత 13, 14 తేదీల్లో భార్యకు వేరే వ్యక్తి పేరిట మెసేజ్‌ పెట్టాడు. తిరిగి 17న కనిగిరికి ఒంటరిగా వస్తే రూ.2 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో రాధ కనిగిరి వచ్చింది. ఈ క్రమంలో వేరే వ్యక్తి మాదిరిగా ఫోన్‌లో మాట్లాడుతూ.. మెసేజ్, ఫోన్‌ చాటింగ్‌లు కూడా చేశాడు. పామూరు బస్టాండ్‌లో ఎదురుచూస్తున్న రా«ధకు నగదు ఇస్తానని చెప్పిన వ్యక్తి, అతని మనుషులకు బదులు కారులో భర్త కన్పించాడు.
చదవండి: విశాఖలో షాకింగ్‌ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని..

దీంతో ఒక్కసారిగా అవాక్కైన రాధ భర్త మోహన్‌రెడ్డి పిలవడంతో కారులో ఎక్కినట్టు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఇదే కారు పాతకూచిపుడిపల్లి సమీపంలో కొంతసేపు ఆగినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైనట్టు సమాచారం. ఆ తర్వాత కారులో టిడ్కో గృహాల సముదాయం వద్దకు రాధను తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి కొట్టి చంపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కారులోనే ఆమె మృతదేహాన్ని జిల్లెళ్లపాడు క్రాస్‌రోడ్డులో పడేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా  శనివారం ఉదయం భర్త మోహన్‌రెడ్డిని పోలీసులు దాచేపల్లి వద్ద  అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

కొట్టి చంపేశారయ్యా!
నా కూతురుని భయంకరంగా కొట్టి చంపారయ్యా. మా అల్లుడు మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఫోన్‌ చేసి నీకేమైనా క్లూ దొరికిందా మామా అని అడిగాడు. ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారని అడిగితే.. నాకు సమాచారం లేదని చెప్పాను. రాధ చనిపోయిందని అల్లుడికి ఫోన్‌ చేసినప్పుడు తాను వచ్చేదాకా ఆమె ఫోన్‌ తీయవద్దన్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చాడు. హత్య చేసింది వీడని మాకెట్లా తెలుస్తుంది. ఇప్పటివరకు గండ్లోపల్లికి చెందిన వ్యక్తిపై అనుమానం ఉండేది. అతడికి మా అమ్మాయి రూ.18 లక్షలు ఇచ్చింది. అల్లుడు రూ.33 లక్షలు ఇచ్చాడు. పెళ్లప్పుడు 38 ఎకరాల పొలం, 25 సవర్ల బంగారం, రూ.10 లక్షలు కట్నం ఇచ్చాం. నా కూతుర్ని చంపిన వాళ్లకు 
ఉరిశిక్ష పడాలి.
– సుధాకర్‌రెడ్డి, రాధ తండ్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement