కోవర్టు నెపంతో మహిళా మావోయిస్టు హత్య
తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఘటన
చర్ల మండలంలో మృతదేహాన్ని వదిలేసిన మావోలు
కమాండర్ స్థాయికి ఎదిగిన రాధ స్వస్థలం యాదాద్రి జిల్లా
సాక్షిప్రతినిధి, వరంగల్/ యాదాద్రి/ చర్ల/కాప్రా: ఏడేళ్ల క్రితం అదృశ్యమై..మావోయిస్టు పార్టీలో చేరి కీలకంగా ఎదిగిన బంటి (పల్లెపాటి) రాధ అలియాస్ నీల్సో శవమై ప్రత్యక్షమైంది. చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) సభ్యురాలి నుంచి దండకారణ్యంలో చేరి నాయకత్వ రక్షణదళ కమాండర్‌గా ఎదిగిన ఆమె.. చివరకు దళం సహచరుల చేతిలోనే హత మైంది.
విద్యార్థి నుంచి దళనేతగా సాగిన ఏడేళ్ల ప్రస్థానం విషాదాంతంగా ముగిసింది. ఉద్యమంలో కొనసాగుతూనే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులకు ‘కోవర్టు’గా మారిందన్న సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ నాయకత్వం.. ప్రజాకోర్టు నిర్వహించి రాధ అలియాస్ నీల్సోను చర్ల సమీపంలో హతమార్చి ఏవోబీ కార్యదర్శి గణేష్ పేరిట బుధవారం వీడియో, ప్రకటన విడుదల చేసింది.
రాధ కేసు..రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ
బంటి బాలయ్య– పోచమ్మ (బాలమ్మ)ల స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్ పరిధిలోని కాప్రాలో నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు సూర్యం, కూతురు రాధలు ఉండగా.. బంటి రాధ అలియాస్ నీల్సో 2017లో ఇంటర్ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తూ అదృశ్యమైంది. రాజాపేటకు చెందిన జిట్టా సుదర్శన్‌రెడ్డి పీపుల్‌వార్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసే సమయంలో రాధ విప్లవ గీతాలు ఆకర్షితురాలయ్యారు.
అప్పట్లో ఆమె అదృశ్యం సంచలనంగా మారగా.. మొదట హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు 2022, జనవరి 2న విశాఖపట్నం జిల్లా పెద్దబయలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును అక్కడి పోలీసులు ఎటూ తేల్చలేదు. కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కేసును రీ ఓపెన్ చేసింది. మావోయిస్టులు ఆమెను బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారన్న అభియోగంపై మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, కాకరాల మాధవి అలియాస్ అరుణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదే క్రమంలో 2022, జూన్ 23 హైదరాబాద్‌లోని చిలకానగర్, ఫిర్జాదిగూడ, మెదక్ జిల్లా చేగుంట, వరంగల్ నగరంలలో ఎన్‌ఐఏ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్)తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాదులు డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పా, దుబాసి స్వప్నలను అరెస్టు చేసి ఎన్‌ఐఏ రాధ ఆచూకీ కోసం విచారించింది. వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డు, ప్రకాశ్‌రెడ్డి పేటలలోనూ సోదాలు నిర్వహించింది.
నేడు కాప్రాలో అంత్యక్రియలు
పోలీసులు రాధ మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా చేయించాక, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, రాధ మెడకు ప్లాస్టిక్ తాడు కట్టి చెట్టుకు లాగడం ద్వారా ప్రాణం తీసినట్టు తెలుస్తోంది. గురువారం రాధ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.
హేయమైన చర్య : ఎస్పీ రోహిత్ రాజు
మావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న దళిత యువతి రాధ అలియాస్ నీల్సోను అతి కిరాతకంగా చంపడం హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సామాజిక న్యాయమంటూ మాటలు చెప్పే మావోయిస్టులు ఇతరులను వదిలేసి కేవలం దళితురాలైన రాధను ఎందుకు చంపారో సమాధానం చెప్పాలన్నారు.
కీలకంగా ఎదిగి...సహచరుల చేతిలో హతమై
ఓ వైపు పోలీసులు, మరోవైపు ఎన్‌ఐఏ బంటి రాధ కోసం ఆరా తీస్తుండగా.. ఆమె మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఎదిగింది. విశాఖపట్నం వెళ్లి 2017 డిసెంబర్‌లో అదృశ్యమైన ఆమె.. ఆంధ్ర –ఒడిశా బార్డర్ (ఏవోబీ) మావోయిస్టు కమిటీకి కీలకంగా మారింది. ఏడాదిలోనే పార్టీ నాయకత్వ కమిటీకి రక్షణ దళ కమాండర్‌గా ఎదిగింది. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (కోవిడ్ సమయంలో చనిపోయారు)తో పాటు పలువురు నేతలకు రక్షణ కల్పించే ఫ్లటూన్‌కు కీలకమైంది.
సుమారు ఏడేళ్లపాటు బంటి రాధ అలియాస్ నీల్సో ప్రస్థానం మావోయిస్టు పార్టీలో కొనసాగింది. మూడు నెలల కిందటే అనుమానం వచ్చిన మావోయిస్టు పార్టీ నాయకత్వం ఆమెను ‘కోవర్టు’గా భావించి కీలక బాధ్యతల నుంచి తప్పించి నిఘా పెట్టింది. తన సోదరుడు సూర్యం ద్వారా పోలీసులకు సహకరిస్తుందని భావించిన పార్టీ నాయకత్వం, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన రాధ అలియాస్ నీల్సోను అంతమొందించినట్టు ప్రకటించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను చంపి ఈ హత్య తామే చేసినట్లు మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరిట లేఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని పోలీసులు మళ్లీ అలర్ట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment