Viveka Case : సత్యమేవ జయతే | Sakshi
Sakshi News home page

Viveka Case : సత్యమేవ జయతే

Published Thu, Apr 11 2024 12:47 PM

Let the truth prevails in Viveka case - Sakshi

వివేకా హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి నిజాలను దాస్తున్నారా. అసలు వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారా. నిజాలు బయటకు వస్తే సునీతారెడ్డి దంపతులు కేసులో ఇరుక్కోవడం ఖాయమా. అసలు వివేకా హత్యకేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలేంటి… సునీతారెడ్డి చేస్తున్న అబద్ధపు ప్రచారం ఏంటి?

వివేకా హత్యకేసులో కుమార్తె సునీతారెడ్డి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోంది. ఓ వైపు తన తండ్రి హంతకులను పట్టుకోవాలని చెబుతున్న సునీతా…మరోవైపు కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కుట్రలు చేస్తోంది. ఇప్పటికే విచారణ పూర్తయిన ఈ కేసులో సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పాత్రపై ఎన్నో అనుమానాలున్నాయి. హత్య జరిగినప్పటి నుంచి ఈ దంపతుల తీరు… సాక్ష్యాలను తారుమారు చేయడానికి యత్నించిన వైనంపై ఇప్పటికీ పూర్తి విచారణ జరగలేదు. సీబీఐ అధికారులతో కలిసి సాక్ష్యులను బెదిరించడానికి సునీతారెడ్డి దంపతులు చేసిన ప్రయత్నాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో MP అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు యత్నించిన సునీతారెడ్డి… ఇప్పుడు వారిపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్దికోసమే ఈ కేసును సునీతారెడ్డి వాడుకుంటున్నారనే దానికి ఆమె ప్రకటనలే సజీవసాక్ష్యాలు. గత ఐదేళ్లలో వివేకా హత్య కేసును జాగ్రత్తగా పరిశీలిస్తే… వివేకా హత్యకు సంబంధించి సునీతారెడ్డి దంపతులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.

  • వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచిపెట్టమని పీఏ కృష్ణారెడ్డికి  చెప్పింది సునీత దంపతులు కాదా?
  • షమీమ్‌ను వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకుంటే… ఆయనతో సునీతకు, నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి గొడవలు ఉన్న మాట వాస్తవం కాదా?
  • షమీమ్ కొడుకుకు ఆస్తిలో వాటా వస్తోందనే భయంతోనే తప్పుడు సాక్ష్యం చెప్పాలని PA కృష్ణారెడ్డిని బెదిరించారా?
  • వివేకా చెక్‌ పవర్ తీసేసి ఆయనను ఆర్ధికంగా తీవ్ర ఇబ్బంది పెట్టింది సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కాదా?
  • అవినాష్‌రెడ్డి పేరు చెప్పకపోతే… తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజమా కాదా?
  • వివేకానంద రెడ్డిని నరికానని బాహాటంగా ప్రకటించిన దస్తగిరి బెయిల్‌కు సునీత సహకరించిందా? లేదా?
  • హత్య గురించి సుదీర్ఘ ప్రకటనలు చేస్తున్న వారు వివేకా రెండో పెళ్లి గురించి, ఆస్తుల సెటిల్‌మెంట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
  • వివేకా హత్య తర్వాత ఆస్తులన్నీ హడావిడిగా మీ పేరిట ఎందుకు మార్చుకున్నారు?
  • రాజకీయ ఆకాంక్షతోనే TDPకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారా?

మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని PA కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. పీఏ కృష్ణారెడ్డి హత్య విషయం తెలియగానే ముందుగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఉదయం 6 గంటల 18నిమిషాలకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. కేవలం కొన్ని సెకన్ల పాటు జరిగిన ఈ ఫోన్ సంభాషణలో … వివేకా బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారు అని పీఏ కృష్ణారెడ్డి… వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు వాట్సాప్‌ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్‌ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా.

ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేకా స్వదస్తూరితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్‌ఫోన్‌. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానస్పదంగా ఉంది. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వీరంతా పులివెందుల చేరుకున్న తర్వాతే సెల్‌ఫోన్లోని మెసేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్‌ చేసి వాటిని పోలీసులకు అప్పగించారనే చర్చ ఉంది. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. నిజం తెలిసిన తరువాత కూడా ఎందుకు వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి అబద్ధం చెప్పారు. లేఖను దాచిపెట్టారు అనేది తేలితే కేసు సగం కొలిక్కి వచ్చినట్లే.

వివేకా హత్యకేసులో మరో కీలకమైన అంశం ఆయన రెండో వివాహం. షమీమ్‌ అనే మహిళను 2010లో వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. వివాహం పూర్తిగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగింది. తన పేరును అక్బర్‌గా మార్చుకున్న వివేకా షమీమ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ విషయంపై వివేకా కుమార్తె, అల్లుడు, బావమరిది ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి, ఆయన కుమార్తె సునీతారెడ్డికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ విషయం కారణంగానే దాదాపు 2013 నుంచి సునీతారెడ్డి తండ్రితో మాట్లాడడం లేదని ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడు. వైఎస్‌ వివేకానందరెడ్డి షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయనే వాదన ఉంది.

తన రెండో భార్య ద్వారా జన్మించిన కుమారుడిని వివేకా వారసుడిగా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా రెండో భార్య షమీమ్‌ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. తన కొడుకుకు ఆస్తిలో వాటా ఇస్తానని వివేకా చెప్పినట్లు షమీమ్ తన వాంగ్మలంలో చెప్పారు. తన కొడుకుకు ఆస్తి వస్తుందనే కారణంతో వివేకా మొదటి భార్య కుటుంబం తనపై కక్ష్య గట్టిందని… చాలాసార్లు తనను బెదిరించినట్లు షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పూసగుచ్చినట్లు వివరించారు. ఇక ఎర్రగంగిరెడ్డిని తమ ఇంటికి పంపి… వివేకాతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని బెదిరించినట్లు షమీమ్‌ స్పష్టంగా సీబీఐకి చెప్పింది. వివేకా తన వారసుడిగా షమీమ్‌కు కుమారుడు షెహన్షాను ప్రకటిస్తారనే అనుమానంతోనే… సునీతారెడ్డి దంపతులు వివేకా చెక్‌పవర్ తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వివేకా చనిపోవడానికి ముందు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చాలామంది వాంగ్మూలంలో చెప్పారు.

వివేకా హత్య కేసులో సాక్ష్యులను బెదిరించేందుకు సునీతారెడ్డి దంపతులు తీవ్రంగా యత్నించారు. వివేకానందరెడ్డి వద్ద దశాబ్దాలుగా పనిచేస్తున్న పీఏ కృష్ణారెడ్డిని తప్పుడు సాక్ష్యం చెప్పని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతారెడ్డిలు తీవ్రంగా వేధించారు. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సునీతారెడ్డి పీఏ కృష్ణారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే తాను అబద్ధపు సాక్ష్యం చెప్పదిలేదని కృష్ణారెడ్డి తెగేసి చెప్పడంతో… నర్రెడ్డి సునీతారెడ్డి తన అసలు స్వరూపం బయటపెట్టారు. సీబీఐ అధికారులతో కలిసి కృష్ణారెడ్డిని తీవ్రంగా హింసించారు. తన తండ్రి వద్ద 30ఏళ్లపాటు పనిచేసిన వ్యక్తిపైనే సునీతారెడ్డి ఇంతటి దారుణాలకు పాల్పడ్డారు. లేఖను దాచిపెట్టమని చెప్పింది కూడా కృష్ణారెడ్డికే.

ఎన్నిరకాలుగా హింసించినా కృష్ణారెడ్డి అబద్ధపు సాక్ష్యం చెప్పకపోవడంతో… ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పిఏ కృష్ణారెడ్డి కుమారులను పిలిపించి సీబీఐ అధికారి రాంసింగ్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఇక సునీతారెడ్డి దంపతులు నేరుగా రంగంలోకి దిగి కృష్ణారెడ్డి కుమారుడి వివాహం రద్దు చేయించారు. అంతే కాకుండా అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే మరోసారి అరెస్టు చేయిస్తామని కృష్ణారెడ్డిపై బెదిరింపులకు దిగారు. ఇక అసహనంతో కృష్ణారెడ్డి అబద్ధం చెప్పకపోతే… తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సునీతారెడ్డి మాట జారింది.

ఇంతే కాదు వివేకా హత్య కేసులో సునీతారెడ్డిపై అనుమానం రావడానికి మరో ప్రధాన కారణం… దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించకపోవడం. అప్రూవర్‌గా మారడానికి ముందే దస్తగిరి వేసిన బెయిల్‌ పిటిషన్‌ను సునీతారెడ్డి ఎందుకు వ్యతిరేకించలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో వివేకాను తామే నరికామని… టీవీ చానెల్‌ల ముందు స్టేట్‌మెంట్లు ఇచ్చిన దస్తగిరికి వ్యతిరేకంగా సునీతారెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం… మరో అనుమానం. ఇప్పటికైనా దస్తగిరి బెయిల్ రద్దు చేయమని అడిగే అవకాశం ఉన్నా సునీతారెడ్డి… కనీసం మాట మాట్లాడటం లేదు. తండ్రిని హత్య చేసిన వ్యక్తి రోడ్డుపై తిరుగుతుంటే … సునీతారెడ్డి ఏమీ అనకపోవడం ఆమె ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది.

ఈ కేసులో రాజకీయ కోణాన్ని మాట్లాడుతున్న సునీతారెడ్డి అబద్ధాలను పదే పదే వల్లె వేస్తున్నారు. కడప ఎంపీ టికెట్ కోసమే తన తండ్రి హత్య జరిగిందని చెబుతున్న సునీతారెడ్డి… తాను గతంలో మాట్లాడిన మాటలపై ఇప్పుడు నోరు మెదపడం లేదు. వివేకా హత్య జరగడానికి ముందే… కడప ఎంపీ సీటు ఖరారైందనే విషయం గతంలోనే సునీతారెడ్డి చెప్పారు. ఇప్పుడు మాత్రం వంశవృక్షాన్ని పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ రూపంలో వేస్తూ… అవినాష్‌రెడ్డి కుటుంబంపై చాలా కాలంగా తనలోపల ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి నిందితులకు శిక్షపడటం కన్నా… తన రాజకీయ ప్రత్యర్ధులపై బురదజల్లే ఆలోచనే సునీతారెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోంది.

ఇక తన తండ్రి హత్యకేసుతో పొలిటికల్ మైలేజ్‌ పొందాలనుకుంటున్న సునీతారెడ్డికి… ఆమె సోదరి షర్మిల తోడయ్యారు. కేవలం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక ఎజెండాతో షర్మిల ఏకంగా అవినాష్‌రెడ్డే హంతకుడంటూ తేల్చేశారు. రాజకీయంగా కడపలో తనకు ప్రత్యర్ధి అయిన వ్యక్తి అవినాష్‌రెడ్డిపై షర్మిల చేసిన కామెంట్స్ వెనక ఉన్న ఉద్దేశం… అందరికీ ఇప్పటికే అర్ధమైంది. ఎందుకు చాలా కాలంగా షర్మిల అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేశారో… ఎన్నికల సమయం వచ్చాక మరింత స్పష్టంగా అర్ధమవుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement