అంతా బాబు జట్టే.. పచ్చ కుట్రే.. | Sunitas comments against the verdict | Sakshi
Sakshi News home page

అంతా బాబు జట్టే.. పచ్చ కుట్రే..

Published Wed, Apr 24 2024 5:29 AM | Last Updated on Wed, Apr 24 2024 5:29 AM

Sunitas comments against the verdict - Sakshi

వివేకా హత్య కేసును రాజకీయ లబ్ధికి వాడుకునే పన్నాగం

చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే దుష్ప్రచారం

పచ్చ డ్రామాలో పాత్రధారులే సునీత, షర్మిల, సౌభాగ్యమ్మ

వివేకా హత్యపై మాట్లాడొద్దన్న న్యాయస్థానం తీర్పుతో బెంబేలు

తీర్పును వ్యతిరేకిస్తూ సునీత వ్యాఖ్యలు

 తాజాగా తీర్పును సవాల్‌ చేస్తూ టీడీపీ నేత బీటెక్‌ రవి పిటిషన్‌

సునీత మాటలనే పిటిషన్‌లో చెప్పిన రవి

వివేకా శత్రువులు, హంతకులతో జట్టు కట్టిన సునీత దంపతులు

సాక్షి, అమరావతి: ‘పచ్చ’ ముఠా ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, పవన్‌ కళ్యాణ్, లోకేశ్, పురందేశ్వరి, బీటెక్‌ రవి అంతా ఒకే తానులో ముక్కలని తేటతెల్లమైంది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే తప్ప, అసలు హంతకులకు శిక్ష పడటం కాదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది.

వివేకాను రాజకీయంగా, ఆ తర్వాత భౌతికంగానూ తొలగించుకొన్న వారితో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అంటకాగుతున్నారన్న విభ్రాంతికర వాస్తవం మరోసారి సాక్ష్కాత్కరించింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున, ఈ కేసుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నందున ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదన్న పులివెందుల న్యాయస్థానం తీర్పును అందరూ శిరసా­వహిస్తారని భావించారు.

కానీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి ఆ తీర్పును హైకోర్టులో సవాల్‌ చేయడం పచ్చ కుట్రను బయటపెట్టంది. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న వివేకానందరెడ్డిని తానే ఓడించానని చంద్రబాబు నమ్మిన బంటు సీఎం రమేష్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివేకాను అంతమొందించే కుట్రకు ఎంత ముందుగా భూమికను సిద్ధం చేశారో అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వివేకా హత్యను రాజకీయంగా వాడుకోవడా­నికి చంద్రబాబు చాలా ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేశారు. దస్తగిరి, సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల.. ఇలా పలువురు పాత్రధారులు తెరపైకి వస్తూ వారికి ఇచ్చిన డైలాగులు చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తరువాత మరింతగా విషం చిమ్మేందుకు తెగించారు. ఓటర్లను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడాలని, సామరస్య­పూర్వక రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జరగా­లని వైఎస్సార్‌సీపీ భావించింది.

పలు న్యాయస్థానా­ల్లో విచారణ సాగుతున్న ఈ హత్యపై ఎవరూ మా­ట్లా­డటం సరైన విధానం కాదని కూడా అభిప్రాయ­పడింది. ఇదే అంశాన్ని విన్నవిస్తూ చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, లోకేశ్, పవన్, పురందేశ్వరి, బీటెక్‌ రవిని ప్రతివాదులుగా చేరుస్తూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. వైఎస్‌ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరింది. ఈ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలతో న్యాయస్థానం ఏకీభవించింది. వైఎస్‌ వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని ఈ నెల 16న తీర్పునిచ్చింది.

మంచి ఉద్దేశంతో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అడ్డగోలు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమైన చంద్రబాబు అండ్‌ కోకు మింగుడు పడలేదు. దీంతో పక్కా పన్నాగంతో మొదట సునీతతో ఈ తీర్పుపై అభ్యంతరం తెలిపారు. ఆమె హైకోర్టులో ఈ తీర్పును సవాల్‌ చేస్తారని అందరూ భావించారు. కానీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి హైకోర్టులో సవాల్‌ చేశారు. తీర్పుపై సునీత వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. తద్వారా అంతా చంద్రబాబు తానులో ముక్కలేనని స్పష్టం చేశారు.

చంద్రబాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజా­క్షే­త్రం­లో నేరుగా ఎదుర్కొనే సత్తా లేక కుట్ర రాజ­కీ­యాలు చేస్తున్నానని చంద్రబాబు మరోసారి పరో­క్షంగా చెప్పారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రచారంలోకి తీసుకు­వ­చ్చి­న కట్టుకథను ప్రజలు ఆ ఎన్నికల్లో తిప్పికొట్టా­రు.

ఎన్నికల తరువాత చంద్రబాబు రూ­టు మార్చా­రు. తాము చేసిన నిరాధార ఆరోపణ­లనే వైఎస్‌ వివేకా కుటుంబ సభ్యులతో చెప్పించే సరికొత్త డ్రామాకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతతో మూడేళ్లకుపైగా డ్రామా నడిపించారు. ఆ తరువాత బాబు స్క్రిప్ట్‌ ప్రకారమే షర్మిల­ను రాష్ట్ర రాజకీయ తెరపైకి తెచ్చారు. సునీత చేస్తు­న్న నిరాధార ఆరోపణలనే షర్మిల కూడా  వినిపిస్తు­న్నారు.

ఇటీవల వివేకా సతీమణి సౌభాగ్య­మ్మనూ తె­ర­పైకి తెచ్చారు. వివేకా వర్ధంతి కార్యక్ర­మంలో సౌ­భాగ్యమ్మ, సునీత, షర్మిలతోపాటు టీడీ­పీ ప్రభు­త్వం­లో మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్‌ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వారందరి ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. తాజా­గా పులివెందుల కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సునీ­త, బీటెక్‌ రవి ఒకేలా చంద్రబాబు పాటనే పాడారు.

వివేకా శత్రువులు, హంతకులతోనే జట్టు కట్టిన సునీత దంపతులు
వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదంగా,  సందేహాస్పదంగా ఉంది. వివేకాను 2017లో రాజకీయంగా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీగా ఓడించిన బీటెక్‌ రవి తదితరులతో వారు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.

2017లో వైఎస్సార్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినప్పటికీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి బీటెక్‌ రవిని గెలిపించారు.

వివేకాను కుట్రతో ఓడించిన ఇదే బ్యాచ్‌తో సౌభాగ్యమ్మ, సునీత దంపతులు నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉండటం వివాదాస్ప­దంగా మారింది.  సునీత ఇటీవల మీడియా సమావేశంలోనూ చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్‌ రవి, మహాసేన రాజేశ్‌ తదితరులకు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. మరోవైపు వివేకాను కిరాతకంగా నరికి హత్య చేశానన్న దస్తగిరితోనూ సఖ్యతతో ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది.

హత్య జరిగిన రోజునా సందేహాస్పదంగా..
వైఎస్‌ వివేకా హత్య అనంతరం ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019 మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్‌ చేశారు.

అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు.

ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. లేఖను వారు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement