సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం చేస్తున్న కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వర్మ్) నియంత్రణకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నడుం బిగించింది. దిగుబడిలో కనీసం 25–40% నష్టం చేయగల ఈ పురుగును గతేడాది కర్ణాటకలో తొలిసారి గుర్తించారు. అయితే ఇది ఏడాది కాలంలోనే దేశంలోని దాదాపు 8 రాష్ట్రాలకు విస్తరించడం.. మొక్కజొన్నతోపాటు 80 ఇతర పంటలకూ ఆశించగల సామర్థ్యం దీనికి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్)లో బుధవారం ఒక సదస్సు జరిగింది. భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య (ఐసీఏఆర్)తోపాటు దేశంలోని అనేక ఇతర వ్యవసాయ పరిశోధన సంస్థలు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. ఈ పురుగు నియంత్రణకు ఏం చర్యలు తీసుకోవాలి? ఈ పురుగు విస్తరణ, ప్రభావం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని తీర్మానించారు.
హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా మీడియాతో మాట్లాడుతూ.. యూఎస్‌ఎయిడ్, సీఐఎంఎంవైటీ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో చేపట్టే ఈ పరిశోధనలతో సమీప భవిష్యత్తులోనే కత్తెర పురుగును నియంత్రించవచ్చునని.. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర మాట్లాడుతూ.. కత్తెర పురుగు సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందని, అందుబాటులో ఉన్న సమాచారంతో రైతులు చేపట్టాల్సిన చర్యలను రాష్ట్రస్థాయి వ్యవసాయ అధికారులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. రాత్రికి రాత్రే వందల కిలోమీటర్ల దూరాలను చేరగల ఈ పురుగుపై ఓ కన్నేసి ఉంచేందుకు, చీడ ఆశించిన ప్రాంతాలపై నివేదికలు తెప్పించుకునేందుకూ ఏర్పాట్లు చేశామన్నారు.
అమెరికాకు పాతకాపే..
కత్తెర పురుగు అమెరికాలో మొక్కజొన్న విస్తృతంగా పండే ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉన్న కీటకమే. కాకపోతే మూడేళ్ల క్రితం దీన్ని తొలిసారి ఆఫ్రికా ఖండం లో గుర్తించారు. అమెరికాలోని కార్న్ బెల్ట్‌లో చలి వాతావరణాలను తట్టుకోలేక ఇవి దక్షిణ ప్రాంతాలకు వెళ్లేవని.. సీజన్‌లో మాత్రం మళ్లీ తిరిగి వచ్చేవని ఇంటర్నేషనల్ మెయిజ్ అండ్ వీట్ ఇంప్రూవ్‌మెంట్ సెంటర్ ప్రతినిధి డాక్టర్ ప్రసన్న తెలిపారు. మొక్కల ఆకులను చాలా వేగంగా తినేయగల, నష్టం చేయగల సామర్థ్యం కత్తెరపురుగు సొంతమని ప్రస్తుతానికి ఇది కేవలం మొక్కజొన్న పంటకే ఆశిస్తున్నా, ఇతర పంటలకూ ఆశించవచ్చునని, ఆసియాలోనూ వేగంగా విస్తరిస్తుండటంతో నియంత్రణ, నిర్వహణలు రెండూ అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కిరణ్ శర్మ పాల్గొన్నారు.
కత్తెర పురుగు కట్టడికి ప్రయత్నాలు షురూ!
Published Thu, May 2 2019 2:14 AM | Last Updated on Thu, May 2 2019 2:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment