
నగరం మధ్యలో ఇల్లు ఉంటే వచ్చే సౌకర్యాల మాటేమో గానీ.. రాత్రిపగలూ వచ్చే రణగొణ ధ్వనులు మాత్రం భలే చికాకు పెడతాయి. ఈ సమస్య ఇంకెంతో కాలం ఉండదంటున్నారు సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. హెడ్‌ఫోన్స్‌లో అనవసరమైన ధ్వనులను తొలగించేందుకు ఉపయోగించే నాయిస్ క్యాన్సెలేషన్ టెక్నాలజీని కిటికీలకూ అన్వయించడం ద్వారా నగరం నడిబొడ్డున కూడా ధ్వని కాలుష్యం లేకుండా చేయవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫొటోలో కిటికీలోని లోహపు కడ్డీలకు కొన్ని పరికరాల్లాంటివి వేలాడుతున్నాయి చూడండి.. అవే నాయిస్ క్యాన్సెలేషన్ పరికరాలు. బయటి నుంచి వచ్చే శబ్దాలకు అనుగుణంగా ఇవి కూడా కొన్ని శబ్దాలను సృష్టిస్తాయి.
ఈ రెండు రకాల ధ్వనులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో రెండూ క్యాన్సిల్ అయిపోతాయి. ఫలితంగా ఇంట్లో ఉండేవారికి ఎలాంటి ధ్వని కూడా వినిపించదు. ధ్వనికి తగ్గ ప్రతిధ్వనిని సృష్టించేందుకు ఈ పరికరాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. నమూనా యంత్ర వ్యవస్థ ద్వారా తాము రణగొణ ధ్వనులను 50 శాతం వరకూ తగ్గించగలిగామని... నగరాల్లో తరచూ వినిపించే ధ్వనులను ఒక స్పీకర్ ద్వారా వెలువరించి తాము ప్రయోగాలు చేశామని గాన్ వూన్ సెంగ్ అనే శాస్త్రవేత్త వివరించారు.