ముంపు ప్రాంతాల్లో బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్, శిలీంధ్రాల దాడితో జనం బెంబేలు
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలపై సూక్ష్మజీవులు దండయాత్ర చేస్తున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్, శిలీంధ్రాల దాడితో ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మురుగు నీటిలో ఎక్కువ రోజులు ఉండటం, క్రిమికీటకాలు కుట్టడం వల్ల సూక్ష్మజీవులు శరీరంపై చేరి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ముంపు తగ్గిన నేపథ్యంలో ఇన్‌ఫెక్షన్ల బారినపడిన వందలాది మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఒకవైపు వరదలతో సర్వం కోల్పోయి బాధితులు మానసిక ఒత్తిడిలో ఉంటే.. ఇప్పుడు వారిని ఇన్ఫెక్షన్లు వెంటాడుతున్నాయి. వరద వచ్చి 15 రోజులైనా ఇంకా కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఇళ్లలోని దుస్తులు, సామాన్లను శుభ్రం చేసుకునే క్రమంలో మురుగు నీటిలోనే ఉండటం, క్రిమికీటకాలు ఉండటంతో ఇన్‌ఫెక్షన్‌లు సోకుతున్నాయి. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)
వరద తగ్గిందని ఊరట చెందేలోపే... వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కువ రోజులు నీటిలోనే నానటం, సూక్ష్మజీవులు కుట్టడం వల్ల ఇన్‌ఫెక్షన్ల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.పాచిపోయిన పాదాలతో ఇన్‌ఫెక్షన్‌లు సోకిన వారు ఆస్పత్రులకు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారు చికిత్సకోసం వస్తున్నారు.
అలాంటి వారిలో కొందరికి ఇన్‌ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారిలో కొందరికి ఇన్‌ఫెక్షన్లతో కాళ్లపై పుండ్లు వచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన శానిటరీ వర్కర్‌కు నీటిలో క్రిమి కుట్టడంతో చేతికి ఇన్‌ఫెక్షన్ సోకి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి చేతికి ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉండటంతో చేయి తీసి వేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే వైద్యులు తెలిపారు.
మానసిక ఒత్తిళ్లతో..
వరద ప్రాంతవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు ఇష్టమైన సామాన్లు ఎంతోకాలం కష్టపడి సమకూర్చుకుంటే ఇప్పుడు అవన్నీ వరద పాలయ్యాయి. చాలా వరకూ పనికిరాకుండా పోయాయి. మరికొందరు ఆ ప్రాంతంలో సొంత ఇళ్లను సైతం సమకూర్చుకున్నారు. రుణాలు తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. తాము ఇళ్లు కొన్నది ముంపు ప్రాంతంలోనా! అంటూ కొందరు వేదన పడుతున్నారు.
ఇలా వరద బాధితులందరూ ప్రస్తుతం మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. అలాంటి వారిలో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు ఉంటాయని, వ్యాధులున్న వారు పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అదుపులో ఉండని వ్యాధులతో..
ముంపు ప్రాంతాల్లో వేలాది మంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వాటితో బాధపడుతున్న వారు సైతం ఉన్నారు. వారంతా ఇళ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. దీంతో వాళ్లు రెగ్యులర్‌గా వాడే మందులు నీట మునిగాయి. దీంతో 15 రోజులుగా మందులు వాడకుండా ఉండటంతో మధుమేహం, రక్తపోటు వంటివి అదుపు తప్పాయి. అలాంటి వారికి ఇన్‌ఫెక్షన్లు సోకితే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు అదుపులో లేనివారికి ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గే అవకాశం ఉండదంటున్నారు.
ఇన్‌ఫెక్షన్ల బాధితులే అధికం
వరద ముంపు ప్రాంతాల నుంచి కాళ్లకు ఇన్‌ఫెక్షన్లు సోకిన వారు చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్నారు. ఎక్కువ రోజులు మురుగు నీటిలో నడవడం వల్ల కాళ్లు పాచిపోయి ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయి. మందులు వరద పాలవడం వల్ల మధుమేహులు మందులు సక్రమంగా వాడక, శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి ఉంటాయి. మానసిక ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఇన్‌ఫెక్షన్లు సోకితే ప్రమాదమే. సక్రమంగా మందులు వాడుతూ.. ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment