చక్కని మట్టివాసన, స్వచ్ఛమైన, చల్లటి గాలులు...మొత్తానికి వర్షాకాలం వచ్చేసింది. దీంతో మండే ఎండలనుంచి భారీ ఊరట లభించింది. కానీ వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హాయినిచ్చే చిరుజల్లులే జలుబు, జ్వరం, అలెర్జీలు , ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా మోసుకొస్తాయి. ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలూ ఎక్కువే. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచే, పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దాం రండి.
వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఫలితంగా వ్యాధికారక క్రిములు చెలరేగే అవకాశం ఉంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతంది.
తేమ గట్‌లో హానికరమైన బ్యాక్టీరియా , శిలీంధ్రాల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఇది గట్ ఫ్లోరాకు అంతరాయం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టుతాయి. కలుషితమైన ఆహారం, నీరుతో రోగాలు ప్రబలుతాయి.
సాధ్యమైనంతవరకు ఈ సీజన్‌లో కాలి చల్లార్చిన నీళ్లను తాగాలి. ఆహారాలను కూడా వేడి వేడిగా తినడం ఉత్తమం. వంట ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.
పసుపు : మన నిత్యం ఆహారంలో పసుపును చేర్చుకోవాలి. ఇందులోని కర్కుమిన్ శక్తి వంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి,అలెర్జీ రాకుండా కాపాడుతుంది.
అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీమైక్రోబయల్ ఏజెంట్ అంది. ఇది జీర్ణక్రియకు సహాయప డుతుంది. వాపును తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి: యాంటీబయాటిక్,యాంటీవైరల్ లక్షణాల పవర్‌హౌస్ వెల్లుల్లి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, జలుబు, దగ్గు, ఇతర ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో సాయపడుతుంది.
పెరుగు : ప్రోబయోటిక్స్‌తో నిండిన పెరుగు మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆరోగ్య కరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
కాకరకాయ: కాకర యాంటీమైక్రోబయల్లక్షణాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి.రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడతాయి అలాగే ఈ సీజన్‌లోలభించే బీర,సొర లాంటి తీగ జాతి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
తాజా ఆకుకూరలు : తోటకూర, బచ్చలికూర, పాలకూర తదితర ఆకుకూరలనుఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి,ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
సిట్రస్ పండ్లు: రోగ నిరోధక శక్తిని పెంచే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కీలకమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తులసి: ఆయుర్వేదంలో తులసి ఔషధ గుణాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాలతో పాటు , తులసి చికాకు కలిగించే అలెర్జీ లక్షణాలతో పోరాడుతుంది. తాజా తులసి ఆకులను నమలవచ్చు. లేదా టీలో నాలుగు తులసి ఆకులు వేసుకున్నా మంచిదే. ముఖ్యంగా చిన్నపిల్లలకు కొద్దిగా అల్లం, తులసి ఆకులతో మరగించిన నీళ్లకు కొద్దిగా తేనె కలిపి తాగిస్తే మంచిది.
వీటితో పాటు చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. పిల్లలు, పెద్దవాళ్లు చలినుంచి కాపాడే ఉలెన్ దుస్తులు వాడాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment