Alergy
-
వచ్చే..వానజల్లు : మరి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా ఉండాలంటే..!
చక్కని మట్టివాసన, స్వచ్ఛమైన, చల్లటి గాలులు...మొత్తానికి వర్షాకాలం వచ్చేసింది. దీంతో మండే ఎండలనుంచి భారీ ఊరట లభించింది. కానీ వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హాయినిచ్చే చిరుజల్లులే జలుబు, జ్వరం, అలెర్జీలు , ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా మోసుకొస్తాయి. ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలూ ఎక్కువే. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచే, పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దాం రండి.వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఫలితంగా వ్యాధికారక క్రిములు చెలరేగే అవకాశం ఉంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతంది. తేమ గట్‌లో హానికరమైన బ్యాక్టీరియా , శిలీంధ్రాల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఇది గట్ ఫ్లోరాకు అంతరాయం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టుతాయి. కలుషితమైన ఆహారం, నీరుతో రోగాలు ప్రబలుతాయి.సాధ్యమైనంతవరకు ఈ సీజన్లో కాలి చల్లార్చిన నీళ్లను తాగాలి. ఆహారాలను కూడా వేడి వేడిగా తినడం ఉత్తమం. వంట ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.పసుపు : మన నిత్యం ఆహారంలో పసుపును చేర్చుకోవాలి. ఇందులోని కర్కుమిన్ శక్తి వంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి,అలెర్జీ రాకుండా కాపాడుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీమైక్రోబయల్ ఏజెంట్ అంది. ఇది జీర్ణక్రియకు సహాయప డుతుంది. వాపును తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.వెల్లుల్లి: యాంటీబయాటిక్,యాంటీవైరల్ లక్షణాల పవర్‌హౌస్ వెల్లుల్లి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో సాయపడుతుంది.పెరుగు : ప్రోబయోటిక్స్‌తో నిండిన పెరుగు మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆరోగ్య కరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.కాకరకాయ: కాకర యాంటీమైక్రోబయల్లక్షణాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి.రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడతాయి అలాగే ఈ సీజన్లోలభించే బీర,సొర లాంటి తీగ జాతి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.తాజా ఆకుకూరలు : తోటకూర, బచ్చలికూర, పాలకూర తదితర ఆకుకూరలనుఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి,ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.సిట్రస్ పండ్లు: రోగ నిరోధక శక్తిని పెంచే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కీలకమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.తులసి: ఆయుర్వేదంలో తులసి ఔషధ గుణాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాలతో పాటు , తులసి చికాకు కలిగించే అలెర్జీ లక్షణాలతో పోరాడుతుంది. తాజా తులసి ఆకులను నమలవచ్చు. లేదా టీలో నాలుగు తులసి ఆకులు వేసుకున్నా మంచిదే. ముఖ్యంగా చిన్నపిల్లలకు కొద్దిగా అల్లం, తులసి ఆకులతో మరగించిన నీళ్లకు కొద్దిగా తేనె కలిపి తాగిస్తే మంచిది.వీటితో పాటు చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. పిల్లలు, పెద్దవాళ్లు చలినుంచి కాపాడే ఉలెన్ దుస్తులు వాడాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. -
ఆల్కహాల్ అలర్జీ అని పొరబడింది! చివరికి ఏకంగా..
పట్టుమని 20 ఏళ్లు నిండలేదు. ఆ చెడు అలవాటు సరదా అనుకుంది. ప్రెజెంట్ ట్రెండ్ అని స్నేహితులతో తరచుగా బయట పార్టీలు చేసుకుంది. శరీరంపై దద్దర్లు, వాంతులు అవుతున్నా.. జస్ట్ ఎలర్జీయే కదా!.. అని లైట్ తీసుకుంది. చివరికి అదేంటో తెలిసి ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. తనలా మరెవ్వరూ చేయకూడదని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అందుకు తన ఉదంతమే నిదర్శనం అంటూ ఆమె గాథని వివరిస్తోంది ఆ మహిళ. అసలేం జరిగిందంటే..న్యూజిలాండ్‌కి చెందిని పాపీ బెగ్లీకి స్నేహితులతో పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం. ఇలా స్నేహితులతో బయటకి వెళ్లినప్పుడల్లా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఆమె వారితో కలిసి ఆల్కహాల్ సేవిస్తుంది. ఏమైందో ఏమో గత కొంతకాలంగా ఇలా తాగి ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచే శరరం అంతా దద్దర్లు, వాంతులు అవ్వడం మొదలవుతోంది. ఆమె అది ఆల్కహాలిక్ ఎలర్జీ అనుకుంటా అని లైట్ తీసుకుంది. అంతగా పట్టించుకోలేదు. పార్టీలు చేసుకున్న ప్రతీసారి ఆమె పరిస్థితి ఇలానే ఉంది. ఉన్నటుండి ఓ రోజు మరింత బలహీనంగా మారి సీరియస్ అయ్యింది. అప్పుడు డాక్టర్ ఆమె ఫేస్ చేస్తున్న సమస్య ప్రతిదీ నోట్ చేసుకుని స్టడీ చేయడం మొదలు పెట్టాడు. తదుపరి ఆల్ట్రాస్కానింగ్ వంటి వైద్య పరీక్షలు చేసి హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు వైద్యులు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకి ఎగ్జిమా, డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులు విపరీతంగా వస్తాయని చెబతున్నారు. కానీ బెగ్లీ అలర్జీ అనే అనుకుంది. వైద్యుల కూడా చర్మవ్యాధిగానే భావించి మందులు ఇచ్చేవారేగానీ సరియైన పద్ధతిలో నిర్ధారణ చేయలేదు. దీనికి తోడు ఆమె కూడా తన శరీరంలోని లక్షణాలను క్లియర్‌గా వివరించలేదు. అయితే ఆమె వైద్య పరీక్షల్లో తన మెడ కింద కూడా నొప్పిగా ఉందని చెప్పడంతో వారు మరింతగా క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే వారు గడ్డ ఉన్నట్లు గుర్తించి క్యాన్సర్‌గా నిర్థారించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె టీనేజర్. కనీసం 20 ఏళ్లు కూడా నిండలేదు. కానీ అప్పుడే నాలుగు శస్త్ర చికిత్సలు, కీమోథెరఫీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ఆమెకు 20 ఏళ్ల వచ్చాయి. అయితే తనలా ఎవ్వరూ చాలా చిన్న ఏజ్‌లోనే ఆల్కహాల్ వంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెబుతోంది. అంతేగాదు తనకొచ్చిన హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్‌కి సంబంధించినదని, దీన్ని చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉంటేనే వైద్యులు క్యూర్ చేయగలరంటూ ప్రజలకు అవగాహన కల్సిస్తోంది. ఏదైనా అనుభవిస్తేగానీ తెలిసిరాదంటారు. బహుశా ఇదే కాబోలు.ఎప్పుడోకప్పుడో అందరం పోయే వాళ్లమే. అలాంటప్పుడూ ఈ జీవితాన్ని ఇలా చెడుఅలవాట్లతో పాడుచేసుకోకుండా మంచి ఆహ్లాదకరంగా జీవించడానికి ఉపయోగిస్తే తనకి, సమాజానికి ఉపయుక్తంగా ఉంటుంది. (చదవండి: యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్) -
కళ్లు నులుముకోకండి... కష్టాలు తెచ్చుకోకండి! ఘోస్ట్ ఇమేజ్ కనిపిస్తే..!
కళ్లలో కనుపాపగా పిలిచే నల్లగుడ్డు గోళాకారంలో ఉంటుంది. దానిపైన ఓ పారదర్శకపు పొర కారు అద్దంలా (విండ్‌షీల్డ్) ఉంటుంది. ఆ పొర క్రమంగా త్రిభుజాకారపు పట్టకంలా లేదా ఓ పిరమిడ్ ఆకృతి పొందవచ్చు... లేదా పైకి ఉబికినట్లుగా కావచ్చు. కనుపాప ఇలా ‘కోనికల్’గా మారడాన్ని ‘కెరటోకోనస్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇది బాలబాలికల్లో పదేళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో కనిపిస్తుంది. కొందరిలో ముఫ్ఫై ఏళ్ల తర్వాత కూడా కనిపించవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే? కంట్లో ఉండే నల్లగుడ్డు/కంటిపాపపై పొర... ప్రోటీన్లతో నిర్మితమై, సూక్ష్మమైన ఫైబర్ల సహాయంతో నల్లగుడ్డుపై అంటుకుని ఉంటుంది. ఇందుకు తోడ్పడే కణజాలాన్ని ‘కొల్లాజెన్’ అంటారు. ఈ కొల్లాజెన్ బలహీనపడి, కంటిపాపపై పొరను సరిగా అంటుకునేలా చేయనప్పుడు దాని ఆకృతి ‘కోన్’ లా మారుతుంది. మరీ బలహీనపడ్డప్పుడు ఈ పొర అతిగా పలుచబడి, నెర్రెలు బారవచ్చు కూడా. నార్మల్‌గా 500 మైక్రాన్లుండే ఈ పొర 150 నుంచి 100 మైక్రాన్లంత పలచబడుతుంది. దాంతో కొద్దిగా నులుముకున్నా అది నెర్రెలుబారుతుంది. విస్తృతి : భారత్‌లో దీని విస్తృతి చాలా ఎక్కువ. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి 0.13% మాత్రమే. ఉదా: యూఎస్‌లో ఈ కేసులు 0.54% ఉండగా... మనదేశంలో 2.3 శాతం. ఇరాన్లో 2.5% ఉండగా సౌదీ అరేబియాలో 4.79 శాతం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో దీని విస్తృతి ఇంకా ఎక్కువ. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో కేసులు 5 నుంచి 8 రెట్లు ఎక్కువ. లక్షణాలు : ►రెండు కళ్లనూ ప్రభావితం చేస్తుంది. మసగ్గా కనిపించడం ప్రధాన లక్షణం. మసకబారడం రెండు కళ్లలోనూ సమానంగా జరగకపోవచ్చు. ఒక కన్నులోనే ఈ సమస్య రావడం చాలా అరుదు. ►దృశ్యాలు స్పష్టంగా ఉండవు. దీన్ని డిస్టార్టెడ్ విజన్ అంటారు. ఉదా: సరళరేఖలు ఒంగినట్లు కనిపించవచ్చు. ►ఒకే వస్తువు రెండుగా కనిపించవచ్చు. వస్తువు చుట్టూ నీడలా మరో ఇమేజ్ కనిపించవచ్చు. దాన్ని ‘ఘోస్ట్ ఇమేజ్’ అంటారు. ►వెలుతురుని కళ్లు భరించలేకపోవచ్చు ∙అరుదుగా కళ్లు ఎర్రబారడం, వాపురావడం జరగవచ్చు. ►ఈ కేసుల్లో మయోపియా (దగ్గరవి మాత్రమే కనిపించి, దూరం వస్తువులు అస్పష్టంగా ఉండటం) సాధారణం ►ఆస్టిగ్మాటిజం కూడా రావచ్చు. అంటే గ్రాఫ్‌లోని అడ్డుగీతలూ, నిలువుగీతలూ ఒకేసారి కనిపించకపోవచ్చు. ఏవో ఒకవైపు గీతలే కనిపిస్తాయి. గుర్తించడం (డయాగ్నోజ్) ఎలా? ►కొంతమేర కంటికే కనిపిస్తుంది. నిర్ధారణకు డాక్టర్లు కొన్ని కంటి పరీక్షలు చేస్తారు. కార్నియా షేపు మారడాన్ని తెలుసుకునేందుకు ‘కార్నియల్ టొపాగ్రఫీ’, ‘కార్నియల్ టోమోగ్రాఫీ’ (పెంటాక్యామ్) అనే కంప్యూటర్ పరీక్షలతో నిర్ధారణ చేస్తారు. చికిత్స : ►కార్నియా దెబ్బతినకముందే కనుగొంటే చూపును చాలావరకు కాపాడవచ్చు. ►దీన్ని అర్లీ, మాడరేట్, అడ్వాన్స్డ్, సివియర్‌గా విభజిస్తారు. ఈ దశలపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. ►అర్లీ, మాడరేట్ కేసుల్లో కొల్లాజెన్‌ను బలోపేతం చేసే చికిత్సలు చేయాలి. ►ఈ దశలో కంటి అద్దాలు మార్చడం/ కాంటాక్ట్ లెన్స్ (రిజిడ్ గ్యాస్ పర్మియబుల్ కాంటాక్ట్స్)తో చికిత్స ఇవ్వవచ్చు కొంతమందిలో ఇంటాక్ట్స్ రింగులు వాడి... కార్నియాను మునపటిలా ఉండేలా నొక్కుతూ చికిత్స చేస్తారు. ►‘కార్నియల్ కొల్లాజెన్ క్రాస్ లింకింగ్’ అనే చికిత్సతో మరింత ముదరకుండా నివారించవచ్చు. ఇది అధునాతనమైనదీ, సులువైనది, ఖచ్చితమైన చికిత్స కూడా. రోగుల పాలిట వరమనీ చెప్పవచ్చు. ►దీనివల్ల కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చాలా తగ్గాయి. కొంతమందిలో క్రాస్లింకింగ్తో పాటు లేజర్ చికిత్స కూడా చేస్తారు. మరికొంతమందిలో క్రాస్లింకింగ్తో పాటు ఐసీఎల్ అనే లెన్స్‌ను అమర్చుతారు. ►చివరగా... అడ్వాన్స్డ్ దశలోనూ, అలాగే సివియర్ దశల్లో కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (కంటిపాప/నల్లగుడ్డు) మార్పిడి చికిత్స చేయాల్సి రావచ్చు. ఆ శస్త్రచికిత్స తర్వాత కాంటాక్ట్‌లెన్స్ ధరించాల్సి ఉంటుంది. నివారణ: పదేళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వారు మయోపియా, ఆస్టిగ్మాటిజమ్, కళ్లద్దాలు వాడాక కూడా అస్పష్టంగా కనిపించడం, ఒకే వస్తువు చుట్టూ మరో నీడ (ఘోస్ట్ ఇమేజ్), ఖాళీలు కనిపించడం (హ్యాలోస్), ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ ఇమేజ్) ఉన్నవారు కెరటోకోనస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా స్క్రీనింగ్ తప్పక చేయించుకోవాలి. ఒకవేళ ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో ఉన్నట్లు తేలితే... ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది. కంటి అలర్జీ ఉన్నవారు కూడా కెరటోకోనస్ స్క్రీనింగ్ చేయించుకోవడం మేలు. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ... ముప్పు కలిగించే అంశం ఏ మేరకు ముప్పు ఆక్యులార్ అలర్జీ - ముప్పు 1.42 రెట్లు ఎక్కువ కళ్లు నులుముకోవడం- ముప్పు 3 రెట్లు ఎక్కువ ఆస్తమా (అలర్జీ కారణంగా)- ముప్పు 1.9 రెట్లు ఎక్కువఎగ్జిమా (అలర్జీ కారణంగా)- ముప్పు 2.9 రెట్లు ఎక్కువ కుటుంబ చరిత్ర- ముప్పు 6.4 రెట్లు ఎక్కువ తల్లిదండ్రుల్లో ఉంటే ముప్పు 2.8 రెట్లు ఎక్కువ -డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు -
శరీరంలో అలర్జీలు.. నివారణల కోసం అవగాహన అవసరం
ప్రాణమున్న ప్రతిజీవికి ఏదో ఒక అంశం అలర్జీ కలిగించక మానదు. మనిషిలో తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు లేదా మనం వాడే మందుల వల్ల అయినా కావచ్చు... మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి అలర్జీకి దారి తీస్తుంది. అలర్జీపై అలసత్వం కూడదని, కొన్ని అలర్జీలు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం కామన్‌గా ఎదుర్కొనే రకరకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఫుడ్ అలర్జీ: మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఫుడ్ అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్(ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్ నట్స్), గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి. శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపు తిమ్మిర్లు, శ్వాస తీసుకోలేకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతో పాటు రక్త పరీక్షలు(ఐజీఈ యాంటీబాడీస్) కూడా చేయాల్సి ఉంటుంది. డస్ట్ అలర్జీ: సాధారణంగా డస్ట్ అలర్జీ అనేది దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుంది. వీటిని డస్ట్ మైట్స్ అంటారు. ఈ డస్ట్ మైట్స్ మనుషుల నుంచి రాలిన చర్మ మృతకణాలను తింటూ ఇంట్లో దుమ్ము, ధూళికి కారణమవుతాయి. ఇవి శ్వాస తీసుకునే క్రమంలో శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వాపుకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే తేమ పరిస్థితులు ఈ డస్ట్ మైట్స్‌కు ఆవాసాలు. కాబట్టి ఇళ్లలో ఉండే దుప్పట్లు, దిండు కవర్లు, టవల్లు, తివాచీలు, ఇతర సామాన్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డస్ట్ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ గాటు పరీక్ష(స్కిన్ ప్రిక్ టెస్ట్)ను నిర్వహించాల్సి ఉంటుంది. డస్ట్ అలర్జీతో బాధపడేవారు 80 శాతం మంది ఆస్తమా రోగులుగా మారుతున్నారు. అరుదైన సందర్భా లలో డస్ట్ అలర్జీలు అనాఫిలాక్సిస్ షాక్‌కు దారి తీస్తాయి. కంటి అలర్జీ: సాధారణంగా కంటి అలర్జీలు పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల చర్మ కణాలు వంటి వాటి వల్ల సంభవిస్తాయి. వీటివల్ల కళ్లలో దురద, వాపు, మంట, జిగట నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన అలర్జీలు అంటువ్యాధులు కావు. కంటి అలర్జీలకు ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు ఏవీ ఉండవు. పైన పేర్కొన్న కారకాల్లో ఏవి అలర్జీకి కారణం అవుతున్నాయో పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే నివారణ. ఈ నాలుగే కాక కొంతమందిలో తేనేటీగలు, కందిరీగలు (ఇన్సెక్ట్ అలర్జీ), రబ్బరుతో తయారయ్యే వస్తువులు (బెలూన్, చేతి తొడుగులు, కాండమ్స్), కొన్ని రకాల మందులు(డ్రగ్ అలర్జీ), ఫంగస్(మోల్డ్ అలర్జీ) లాంటివి కూడా కనిపిస్తుంటాయి. ఏం చేయాలి? శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. డాక్టర్‌తో మీ ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు తదితర వివరాలను తెలియజేస్తే, దానికి తగిన నిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. ముందుగా ఊపిరితిత్తుల సామర్ధ్య పరీక్ష, ఎక్స్‌రే వంటి పరీక్షలు నిర్వహించి ఆతరువాత మీ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ పరీక్షలు, ప్యాచ్ లేదా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీరు ఏరకమైన అలర్జీలతో బాధపడుతున్నారో నిర్ధారించుకొని తగిన చికిత్సను సిఫార్సు చేస్తారు. అలర్జీలకు సరైన చికిత్సను నిర్ధారణ పరీక్షల ఆధారంగానే కాకుండా బాధితుడి మెడికల్ హిస్టరీ, లక్షణాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని అందిస్తారు. ఈ రుగ్మతకు శాశ్వత పరిష్కారం లేదు. దీన్ని ఏదో ఒక చికిత్సా విధానం ద్వారా అదుపులో మాత్రమే ఉంచుకోవచ్చు. స్కిన్ అలర్జీ: ఈ రకమైన అలర్జీ సంభవించటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, మందులు, అంటువ్యాధులు వంటి పలు కారణాల చేత ఇవి సంభవిస్తాయి. పెంపుడు జంతువులు, రసాయనాలు, సబ్బులు, నూతన వస్త్రాలు, చర్మ పరిరక్షక క్రీమ్‌లు వంటివి చర్మ అలర్జీలకు ప్రధాన కారకాలు. స్కిన్ అలర్జీ అంటే కేవలం చర్మ సంబంధిత అలర్జీ అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే ఈ రకమైన అలర్జీకి ముఖ్య కారణం రోగనిరోధక వ్యవస్థలోని లోపాలే అన్న విషయం వారికి తెలీదు. స్కిన్ అలర్జీతో బాధపడే వారిలో విపరీతమైన దురద, చర్మంపై దద్దుర్లు, పొడి చర్మం, మంట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందిలో ఈ అలర్జీల కారకాలను పరీక్షల ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే సాధారణ రక్త పరీక్ష (తెల్ల రక్త కణాల పరీక్ష) ద్వారా బాధితుడి లక్షణాలను కొద్దిమేరకు గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. మన చర్మం దేనికి ప్రతిస్పందిస్తుందో జాగ్రత్తగా పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే దీనికి నివారణ. చదవండి: కరోనా కాలంలో... కంటి సమస్యలు -
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దుల కారణంగా చెవి ప్రాంతం ఎర్రబడటం, ర్యాష్ రావడం జరుగుతుండవచ్చు. సాధారణంగా చాలావరకు కృత్రిమ ఆభరణాలలో నికెల్ అనే లోహం ఉంటుంది. దీనివల్ల ర్యాషెస్ వస్తాయి. ఇలాంటివి ఆభరణాల కారణంగా కొందరిలో చెవి వద్ద కాస్తంత దురద, చెవి రంధ్రం వద్ద ఎర్రబారడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఈ దశలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అక్కడి గాయం రేగిపోయి, రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇలాంటివారు నికెల్‌తో చేసిన కృత్రిమ ఆభరణాలు, రింగులు, దిద్దులు ధరించడం సరికాదు. వీరు మొమెటజోన్ ఉన్న ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి కాస్త తక్కువ పాళ్లు కార్టికోస్టెరాయిడ్ కలిసి ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్నచోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాయండి. ఇలాంటి క్రీములను సాధారణంగా డర్మటాలజిస్ట్ ల సూచనలతో వాడటమే మంచిది. -
ఆ ఊర్లో సాయంత్రమైతే చాలు ఒళ్లంతా దద్దుర్లే!
ఇదేం రకం వ్యాధినో తెలియదు కానీ శరీరమంతా దద్దుర్లు..దురద. ఇలా ఒకరికి కాదు ఇద్దరికి కాదు వందల మందికి ఉంది. పత్తి నిల్వ ఉన్న వారి ఇళ్లలోనే ఇది అధికంగా కనిపిస్తోంది. చిన్నారులు, వృద్ధులు దద్దుర్ల దెబ్బకు రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి. అంతు చిక్కని ఈ వ్యాధికి చికిత్స కోసం కొందరు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కర్నూలు, కౌతాళం రూరల్: మండలంలో గత కొన్ని రోజులుగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరి శరీరం చూసినా దద్దుర్లు కనిపిస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. స్థానిక వైద్యుల దగ్గర చికిత్స చేయించినా తగ్గక పోవడంతో చాలా మంది ఆదోనిలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. పత్తి నిల్వ ఉన్న ఇళ్లలోని వారికే ఎక్కువగా దద్దుర్లు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దురదతో పిల్లలు, వృద్ధులు నిద్రపోవడం లేదని..రాత్రంతా తాము జాగరణ చేయాల్సి వస్తుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ఏ ఒక్క ప్రభుత్వ వైద్యుడు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండల వైద్యాధికారి చిదంబరరావును వివరణ కోరగా పత్తిదూదిలోని పురుగులతో దద్దర్లు వస్తున్నాయని ఇది మండలం వ్యాప్తంగా ఉందని, త్వరలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సాయంత్రమైతే చాలు దద్దుర్లు సాయంత్రం అయిందంటే చాలు శరీరంపై దద్దుర్లు విపరీతంగా కనిపిస్తాయి. పత్తి నిల్వ ఉన్న ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది. పిల్లలు, పెద్దలకు దురద వల్ల శరీరంపై గాయాలు కూడా అవుతున్నాయి. పత్తిని బేళ్లలో తొక్కి ఆదోనికి తీసుకెళ్దామంటే కూలీలు కూడా రావడం లేదు. –దొమ్మిడి వెంకోబ, కౌతాళం -
ఆ ట్రీట్మెంట్ ఆమె పాలిట శాపమైంది..
స్పెయిన్ : ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఆమె పాలిట శాపంగా మారింది. మృత్యువు తేనెటీగ రూపంలో కాటువేసి ప్రాణాలు తీసింది. తేనెటీగలు కుట్టించడం ద్వారా నొప్పుల నుంచి ఉపసమనం పొందడానికి చేసే’ ఎపిథెరపి’ ఆక్యుపంక్చర్ విధానం ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన స్పెయిన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. స్పెయిన్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ గత రెండేళ్లుగా కండరాళ్ల బిగుతుదనం, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ థెరపీని చేయించుకుంటోంది. అయితే కొద్ది రోజుల ముందు థెరపీలో భాగంగా తేనెటీగతో కుట్టించుకోగా స్పృహ కోల్పోయింది. యాంటీ ఎపీ వెనమ్ ఇచ్చినప్పటికి ప్రయోజనం లేక పోవడంతో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె తేనెటీగ కుట్టడం ద్వారా వచ్చిన అలర్జీ కారణంగా కోమాలోకి వెళ్లిన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల పాటు కోమాలో ఉన్న ఆమె అనంతరం మరణించింది. వెయ్యి సంవత్సరాలకు పైగా వాడుకలో ఉన్న ఈ ప్రాచీన వైద్య విధానం ద్వారా ఇప్పటి వరకు ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారని, నైపుణ్యం లేని వారు చేయడం వల్లే ఇలా జరిగి ఉంటుందని తెలిపారు. ఆక్యుపంక్చర్ విధానంలో సూదుల ద్వారా లేదా తేనెటీగలు కుట్టించడం ద్వారా ఇలా రెండు రకాలుగా చేస్తారు. తేనెటీగల విధానం ద్వారా ప్రమాదం ఉన్నప్పటికీ ప్రమోజనాల దృష్ట్యా అందరూ ఈ తరహా వైద్యం చేయించుకోవటానికే మొగ్గు చూపుతుంటారు. -
దురద, నొప్పికి తేడా ఉందా?
దురద అనేది చర్మానికి సంబంధించిన ఒక రకమైన సమస్య. కొన్ని రకాల వ్యాధులు, పొడి చర్మం, ఎలర్జీ వంటి వాటి వల్ల దురద పుడుతుంది. హిస్టామినన్ అనే రసాయనానికి ఎలర్జీని కలిగించే శక్తి ఉంటుంది. ఆ రసాయనాన్ని విడుదల చేసే విధంగా, కొన్ని పదార్థాలు మన శరీరంపై తమ ప్రభావాన్ని చూపినప్పుడు ఎలర్జీ రావడంతో దురద పుడుతుంది. ఉదాహరణకు దోమలు, కొన్ని రకాల పురుగులు కుట్టినప్పుడు కలిగే దురద ఈ రకానికి చెందినదే. కొన్ని రకాల దురదలు తాత్కాలికంగా మాత్రమే ఉంటే మరికొన్ని రకాల దురదలు ఏళ్ళ తరబడి ఉంటాయి. 19వ శతాబ్దంలో, ఫ్రాన్స్ కు వెళ్లి వచ్చిన అమెరికా సైనికులకు ఒక వ్యాధి కారణంగా మొదలయ్యే దురద కనీసం ఏడేళ్ల పాటు వారిని వేధించేది. దాంతో ఆ దురదకి ఏడేళ్ల దురద, ఫ్రెంచి దురద అని పేరు పెట్టారు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల వల్ల వచ్చే దురదలు కూడా అంత సులభంగా తగ్గవు. అయితే అలాంటి వ్యాధులకు వైద్యుల పర్యవేక్షణలో తప్పనిసరిగా చికిత్స తీసుకోవలసి ఉంటుంది. సాధారణంగా దురద అనేది శరీరంలో ఏదో ఒక ప్రదేశానికో, లేదా కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. దీనికి భిన్నంగా నొప్పి శరీరం అంతటా లేదా శరీరంలోని ఏదో ఒక భాగానికే పరిమితమై ఉండవచ్చు. అయితే దురదలాగా అది కేవలం చర్మానికి మాత్రమే పరిమితమై ఉండదు. దురద అనేది శరీరంపై జరిగే ఒక దాడికి లేదా చర్మవ్యాధికి సంకేతంగా నిలిస్తే, నొప్పి అనేది శరీరానికి వచ్చిన ఒక కష్టానికి సంకేతంగా నిలుస్తుంది.