కళ్లలో కనుపాపగా పిలిచే నల్లగుడ్డు గోళాకారంలో ఉంటుంది. దానిపైన ఓ పారదర్శకపు పొర కారు అద్దంలా (విండ్‌షీల్డ్) ఉంటుంది. ఆ పొర క్రమంగా త్రిభుజాకారపు పట్టకంలా లేదా ఓ పిరమిడ్ ఆకృతి పొందవచ్చు... లేదా పైకి ఉబికినట్లుగా కావచ్చు. కనుపాప ఇలా ‘కోనికల్’గా మారడాన్ని ‘కెరటోకోనస్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇది బాలబాలికల్లో పదేళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో కనిపిస్తుంది. కొందరిలో ముఫ్ఫై ఏళ్ల తర్వాత కూడా కనిపించవచ్చు.
ఎందుకిలా జరుగుతుందంటే?
కంట్లో ఉండే నల్లగుడ్డు/కంటిపాపపై పొర... ప్రోటీన్లతో నిర్మితమై, సూక్ష్మమైన ఫైబర్‌ల సహాయంతో నల్లగుడ్డుపై అంటుకుని ఉంటుంది. ఇందుకు తోడ్పడే కణజాలాన్ని ‘కొల్లాజెన్’ అంటారు. ఈ కొల్లాజెన్ బలహీనపడి, కంటిపాపపై పొరను సరిగా అంటుకునేలా చేయనప్పుడు దాని ఆకృతి ‘కోన్’ లా మారుతుంది. మరీ బలహీనపడ్డప్పుడు ఈ పొర అతిగా పలుచబడి, నెర్రెలు బారవచ్చు కూడా. నార్మల్‌గా 500 మైక్రాన్లుండే ఈ పొర 150 నుంచి 100 మైక్రాన్లంత పలచబడుతుంది. దాంతో కొద్దిగా నులుముకున్నా అది నెర్రెలుబారుతుంది.
విస్తృతి : భారత్‌లో దీని విస్తృతి చాలా ఎక్కువ. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి 0.13% మాత్రమే. ఉదా: యూఎస్‌లో ఈ కేసులు 0.54% ఉండగా... మనదేశంలో 2.3 శాతం. ఇరాన్‌లో 2.5% ఉండగా సౌదీ అరేబియాలో 4.79 శాతం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో దీని విస్తృతి ఇంకా ఎక్కువ. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో కేసులు 5 నుంచి 8 రెట్లు ఎక్కువ.
లక్షణాలు :
►రెండు కళ్లనూ ప్రభావితం చేస్తుంది. మసగ్గా కనిపించడం ప్రధాన లక్షణం. మసకబారడం రెండు కళ్లలోనూ సమానంగా జరగకపోవచ్చు. ఒక కన్నులోనే ఈ సమస్య రావడం చాలా అరుదు.
►దృశ్యాలు స్పష్టంగా ఉండవు. దీన్ని డిస్టార్టెడ్ విజన్ అంటారు. ఉదా: సరళరేఖలు ఒంగినట్లు కనిపించవచ్చు.
►ఒకే వస్తువు రెండుగా కనిపించవచ్చు. వస్తువు చుట్టూ నీడలా మరో ఇమేజ్ కనిపించవచ్చు. దాన్ని ‘ఘోస్ట్ ఇమేజ్’ అంటారు.
►వెలుతురుని కళ్లు భరించలేకపోవచ్చు ∙అరుదుగా కళ్లు ఎర్రబారడం, వాపురావడం జరగవచ్చు.
►ఈ కేసుల్లో మయోపియా (దగ్గరవి మాత్రమే కనిపించి, దూరం వస్తువులు అస్పష్టంగా ఉండటం) సాధారణం
►ఆస్టిగ్మాటిజం కూడా రావచ్చు. అంటే గ్రాఫ్‌లోని అడ్డుగీతలూ, నిలువుగీతలూ ఒకేసారి కనిపించకపోవచ్చు. ఏవో ఒకవైపు గీతలే కనిపిస్తాయి.
గుర్తించడం (డయాగ్నోజ్) ఎలా?
►కొంతమేర కంటికే కనిపిస్తుంది. నిర్ధారణకు డాక్టర్లు కొన్ని కంటి పరీక్షలు చేస్తారు. కార్నియా షేపు మారడాన్ని తెలుసుకునేందుకు ‘కార్నియల్ టొపాగ్రఫీ’, ‘కార్నియల్ టోమోగ్రాఫీ’ (పెంటాక్యామ్) అనే కంప్యూటర్ పరీక్షలతో నిర్ధారణ చేస్తారు.
చికిత్స :
►కార్నియా దెబ్బతినకముందే కనుగొంటే చూపును చాలావరకు కాపాడవచ్చు.
►దీన్ని అర్లీ, మాడరేట్, అడ్వాన్స్‌డ్, సివియర్‌గా విభజిస్తారు. ఈ దశలపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది.
►అర్లీ, మాడరేట్ కేసుల్లో కొల్లాజెన్‌ను బలోపేతం చేసే చికిత్సలు చేయాలి.
►ఈ దశలో కంటి అద్దాలు మార్చడం/ కాంటాక్ట్ లెన్స్ (రిజిడ్ గ్యాస్ పర్మియబుల్ కాంటాక్ట్స్)తో చికిత్స ఇవ్వవచ్చు కొంతమందిలో ఇంటాక్ట్స్ రింగులు వాడి... కార్నియాను మునపటిలా ఉండేలా నొక్కుతూ చికిత్స చేస్తారు.
►‘కార్నియల్ కొల్లాజెన్ క్రాస్ లింకింగ్’ అనే చికిత్సతో మరింత ముదరకుండా నివారించవచ్చు. ఇది అధునాతనమైనదీ, సులువైనది, ఖచ్చితమైన చికిత్స కూడా. రోగుల పాలిట వరమనీ చెప్పవచ్చు.
►దీనివల్ల కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చాలా తగ్గాయి. కొంతమందిలో క్రాస్‌లింకింగ్‌తో పాటు లేజర్ చికిత్స కూడా చేస్తారు. మరికొంతమందిలో క్రాస్‌లింకింగ్‌తో పాటు ఐసీఎల్ అనే లెన్స్‌ను అమర్చుతారు.
►చివరగా... అడ్వాన్స్‌డ్ దశలోనూ, అలాగే సివియర్ దశల్లో కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (కంటిపాప/నల్లగుడ్డు) మార్పిడి చికిత్స చేయాల్సి రావచ్చు. ఆ శస్త్రచికిత్స తర్వాత కాంటాక్ట్‌లెన్స్ ధరించాల్సి ఉంటుంది.
నివారణ:
పదేళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వారు మయోపియా, ఆస్టిగ్మాటిజమ్, కళ్లద్దాలు వాడాక కూడా అస్పష్టంగా కనిపించడం, ఒకే వస్తువు చుట్టూ మరో నీడ (ఘోస్ట్ ఇమేజ్), ఖాళీలు కనిపించడం (హ్యాలోస్), ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ ఇమేజ్) ఉన్నవారు కెరటోకోనస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.
ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా స్క్రీనింగ్ తప్పక చేయించుకోవాలి.
ఒకవేళ ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో ఉన్నట్లు తేలితే... ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది.
కంటి అలర్జీ ఉన్నవారు కూడా కెరటోకోనస్ స్క్రీనింగ్ చేయించుకోవడం మేలు.
ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...
ముప్పు కలిగించే అంశం ఏ మేరకు ముప్పు
ఆక్యులార్ అలర్జీ - ముప్పు 1.42 రెట్లు ఎక్కువ
కళ్లు నులుముకోవడం- ముప్పు 3 రెట్లు ఎక్కువ
ఆస్తమా (అలర్జీ కారణంగా)- ముప్పు 1.9 రెట్లు ఎక్కువఎగ్జిమా (అలర్జీ కారణంగా)- ముప్పు 2.9 రెట్లు ఎక్కువ
కుటుంబ చరిత్ర- ముప్పు 6.4 రెట్లు ఎక్కువ
తల్లిదండ్రుల్లో ఉంటే ముప్పు 2.8 రెట్లు ఎక్కువ
-డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment