rub
-
ఛీ.. ఛీ ..ఇదేం అలవాటు.. నిద్రిస్తున్న మహిళల పాదాలు తాకుతూ..
అమెరికాలో నెవాడోలో వికృతమైన స్వభావం కలిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిద్రిస్తున్న మహిళల ఇంట్లోకి చొరబడి వారి పాదాలను నిమరే అలవాటుకు ఓ వ్యక్తి బానిసయ్యాడు. ఈ వికృత చేష్టలకు విసిగిపోయిన మహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని పసిగట్టారు. నిందితున్ని ఆంథోనీ గొంజాలెస్(26)గా గుర్తించి అరెస్టు చేశారు. జులై 1న నిందితుడు ఇద్దరు మహిళలు ఉండే ఫ్లాట్‌లోకి దొంగచాటుగా వెళ్లాడు. నిద్రిస్తున్న మహిళ పాదాలు నిమిరాడు. ఒక్కసారిగా మహిళలు లేచి ప్రతిదాడి చేసేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే వరుస. జులై 1 నుంచి జులై 3 మధ్య వారిపై ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు కూడా ఆ ప్రాంతంలోని మహిళలందరిపై ఈ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన మహిళలందరూ కలిసి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం ఆరా తీశారు. అయితే.. వేలి ముద్రల ఆధారంగా ఆగష్టు 1న అతన్ని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితున్ని ఆంథోని గొంజాలెస్గా గుర్తించారు. ఇతడు ఇంతకుముందే ఇలాంటి ఘటనల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మహిళల బూట్లు దొంగిలించిన ఘటనల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో లైంగిక స్వయంతృప్తి చెందుతున్నాడనే ఫిర్యాదులు కూడా ఇతనిపై వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: Riots In New York: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
కళ్లు నులుముకోకండి... కష్టాలు తెచ్చుకోకండి! ఘోస్ట్ ఇమేజ్ కనిపిస్తే..!
కళ్లలో కనుపాపగా పిలిచే నల్లగుడ్డు గోళాకారంలో ఉంటుంది. దానిపైన ఓ పారదర్శకపు పొర కారు అద్దంలా (విండ్‌షీల్డ్) ఉంటుంది. ఆ పొర క్రమంగా త్రిభుజాకారపు పట్టకంలా లేదా ఓ పిరమిడ్ ఆకృతి పొందవచ్చు... లేదా పైకి ఉబికినట్లుగా కావచ్చు. కనుపాప ఇలా ‘కోనికల్’గా మారడాన్ని ‘కెరటోకోనస్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇది బాలబాలికల్లో పదేళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో కనిపిస్తుంది. కొందరిలో ముఫ్ఫై ఏళ్ల తర్వాత కూడా కనిపించవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే? కంట్లో ఉండే నల్లగుడ్డు/కంటిపాపపై పొర... ప్రోటీన్లతో నిర్మితమై, సూక్ష్మమైన ఫైబర్ల సహాయంతో నల్లగుడ్డుపై అంటుకుని ఉంటుంది. ఇందుకు తోడ్పడే కణజాలాన్ని ‘కొల్లాజెన్’ అంటారు. ఈ కొల్లాజెన్ బలహీనపడి, కంటిపాపపై పొరను సరిగా అంటుకునేలా చేయనప్పుడు దాని ఆకృతి ‘కోన్’ లా మారుతుంది. మరీ బలహీనపడ్డప్పుడు ఈ పొర అతిగా పలుచబడి, నెర్రెలు బారవచ్చు కూడా. నార్మల్‌గా 500 మైక్రాన్లుండే ఈ పొర 150 నుంచి 100 మైక్రాన్లంత పలచబడుతుంది. దాంతో కొద్దిగా నులుముకున్నా అది నెర్రెలుబారుతుంది. విస్తృతి : భారత్‌లో దీని విస్తృతి చాలా ఎక్కువ. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి 0.13% మాత్రమే. ఉదా: యూఎస్‌లో ఈ కేసులు 0.54% ఉండగా... మనదేశంలో 2.3 శాతం. ఇరాన్లో 2.5% ఉండగా సౌదీ అరేబియాలో 4.79 శాతం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో దీని విస్తృతి ఇంకా ఎక్కువ. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో కేసులు 5 నుంచి 8 రెట్లు ఎక్కువ. లక్షణాలు : ►రెండు కళ్లనూ ప్రభావితం చేస్తుంది. మసగ్గా కనిపించడం ప్రధాన లక్షణం. మసకబారడం రెండు కళ్లలోనూ సమానంగా జరగకపోవచ్చు. ఒక కన్నులోనే ఈ సమస్య రావడం చాలా అరుదు. ►దృశ్యాలు స్పష్టంగా ఉండవు. దీన్ని డిస్టార్టెడ్ విజన్ అంటారు. ఉదా: సరళరేఖలు ఒంగినట్లు కనిపించవచ్చు. ►ఒకే వస్తువు రెండుగా కనిపించవచ్చు. వస్తువు చుట్టూ నీడలా మరో ఇమేజ్ కనిపించవచ్చు. దాన్ని ‘ఘోస్ట్ ఇమేజ్’ అంటారు. ►వెలుతురుని కళ్లు భరించలేకపోవచ్చు ∙అరుదుగా కళ్లు ఎర్రబారడం, వాపురావడం జరగవచ్చు. ►ఈ కేసుల్లో మయోపియా (దగ్గరవి మాత్రమే కనిపించి, దూరం వస్తువులు అస్పష్టంగా ఉండటం) సాధారణం ►ఆస్టిగ్మాటిజం కూడా రావచ్చు. అంటే గ్రాఫ్‌లోని అడ్డుగీతలూ, నిలువుగీతలూ ఒకేసారి కనిపించకపోవచ్చు. ఏవో ఒకవైపు గీతలే కనిపిస్తాయి. గుర్తించడం (డయాగ్నోజ్) ఎలా? ►కొంతమేర కంటికే కనిపిస్తుంది. నిర్ధారణకు డాక్టర్లు కొన్ని కంటి పరీక్షలు చేస్తారు. కార్నియా షేపు మారడాన్ని తెలుసుకునేందుకు ‘కార్నియల్ టొపాగ్రఫీ’, ‘కార్నియల్ టోమోగ్రాఫీ’ (పెంటాక్యామ్) అనే కంప్యూటర్ పరీక్షలతో నిర్ధారణ చేస్తారు. చికిత్స : ►కార్నియా దెబ్బతినకముందే కనుగొంటే చూపును చాలావరకు కాపాడవచ్చు. ►దీన్ని అర్లీ, మాడరేట్, అడ్వాన్స్డ్, సివియర్‌గా విభజిస్తారు. ఈ దశలపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. ►అర్లీ, మాడరేట్ కేసుల్లో కొల్లాజెన్‌ను బలోపేతం చేసే చికిత్సలు చేయాలి. ►ఈ దశలో కంటి అద్దాలు మార్చడం/ కాంటాక్ట్ లెన్స్ (రిజిడ్ గ్యాస్ పర్మియబుల్ కాంటాక్ట్స్)తో చికిత్స ఇవ్వవచ్చు కొంతమందిలో ఇంటాక్ట్స్ రింగులు వాడి... కార్నియాను మునపటిలా ఉండేలా నొక్కుతూ చికిత్స చేస్తారు. ►‘కార్నియల్ కొల్లాజెన్ క్రాస్ లింకింగ్’ అనే చికిత్సతో మరింత ముదరకుండా నివారించవచ్చు. ఇది అధునాతనమైనదీ, సులువైనది, ఖచ్చితమైన చికిత్స కూడా. రోగుల పాలిట వరమనీ చెప్పవచ్చు. ►దీనివల్ల కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చాలా తగ్గాయి. కొంతమందిలో క్రాస్లింకింగ్తో పాటు లేజర్ చికిత్స కూడా చేస్తారు. మరికొంతమందిలో క్రాస్లింకింగ్తో పాటు ఐసీఎల్ అనే లెన్స్‌ను అమర్చుతారు. ►చివరగా... అడ్వాన్స్డ్ దశలోనూ, అలాగే సివియర్ దశల్లో కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (కంటిపాప/నల్లగుడ్డు) మార్పిడి చికిత్స చేయాల్సి రావచ్చు. ఆ శస్త్రచికిత్స తర్వాత కాంటాక్ట్‌లెన్స్ ధరించాల్సి ఉంటుంది. నివారణ: పదేళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వారు మయోపియా, ఆస్టిగ్మాటిజమ్, కళ్లద్దాలు వాడాక కూడా అస్పష్టంగా కనిపించడం, ఒకే వస్తువు చుట్టూ మరో నీడ (ఘోస్ట్ ఇమేజ్), ఖాళీలు కనిపించడం (హ్యాలోస్), ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ ఇమేజ్) ఉన్నవారు కెరటోకోనస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా స్క్రీనింగ్ తప్పక చేయించుకోవాలి. ఒకవేళ ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో ఉన్నట్లు తేలితే... ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది. కంటి అలర్జీ ఉన్నవారు కూడా కెరటోకోనస్ స్క్రీనింగ్ చేయించుకోవడం మేలు. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ... ముప్పు కలిగించే అంశం ఏ మేరకు ముప్పు ఆక్యులార్ అలర్జీ - ముప్పు 1.42 రెట్లు ఎక్కువ కళ్లు నులుముకోవడం- ముప్పు 3 రెట్లు ఎక్కువ ఆస్తమా (అలర్జీ కారణంగా)- ముప్పు 1.9 రెట్లు ఎక్కువఎగ్జిమా (అలర్జీ కారణంగా)- ముప్పు 2.9 రెట్లు ఎక్కువ కుటుంబ చరిత్ర- ముప్పు 6.4 రెట్లు ఎక్కువ తల్లిదండ్రుల్లో ఉంటే ముప్పు 2.8 రెట్లు ఎక్కువ -డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు -
హైదరాబాద్ సిటీలో సాఫీ జర్నీకి సై
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణాల కోసం ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ) ద్వారా పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ ఆయా ప్రాంతాల్లో రైలు ఓవర్ బ్రిడ్జీలు (ఆర్ఓబీలు), రైలు అండర్ బ్రిడ్జీలు (ఆర్‌యూబీలు) కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న డజనుకుపైగా ఆర్ఓబీలు, ఆర్యూబీలతోపాటు కొత్తగా మరో మూడు ఆర్‌యూబీలు, ఆరు ఆర్ఓబీలు నిర్మించాలని భావిస్తోంది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కుల్ని తగ్గించేందుకు సదరు ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం ట్రాఫిక్ సర్వే పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ చిక్కుల్లేకుండా.. నగరంలో ట్రాఫిక్ చిక్కుల్లేని ప్రయాణాల కోసమే రూ.25వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వం ఎస్సార్డీపీ ద్వారా ఫ్లై ఓవర్లు, తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఆ పనులన్నీ పూర్తయ్యేలోగా ప్రధాన మార్గాల్లో ఎదురవుతున్న చిక్కుల్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలుగా మంత్రి కేటీఆర్ ఆలోచనతో లింక్, స్లిప్ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వాటితో మంచి ప్రయోజనం కలగడంతో శివారు స్థానికసంస్థల పరిధిలో సైతం లింక్, స్లిప్రోడ్లకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. మరోవైపు రైల్వే మార్గాలున్న ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మిస్తే చిక్కులు తగ్గుతాయని భావించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఆర్ఓబీలు, ఆర్‌యూబీలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని విస్తరించాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట్ వంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విస్తరించాలని సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ సూచించారు. ఇటీవల రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా, ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా జీహెచ్ఎంసీ, రైల్వే అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాటితోపాటు ఇరుగ్గా ఉన్న ఆర్ఓబీలు, ఆర్‌యూబీలను విస్తరించాలని కోరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు వీటిని త్వరితగతిన చేపట్టేందుకు అవసరమైన చర్యల్లో తలమునకలయ్యారు. (క్లిక్: చార్మినార్ వద్ద బయట పడ్డ భూగర్భ మెట్లు) -
ఆరు గంటల్లో ఆర్యూబీ రెడీ
సనత్‌నగర్: సరిగ్గా ఆరంటే ఆరు గంటల్లో ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణం పూర్తి చేసి రైల్వే అధికారులు రికార్డు సృష్టించారు. బేగంపేట ఓల్డ్‌కస్టమ్స్ బస్తీ నుంచి అమీర్‌పేట లీలానగర్‌కు కలిపేలా ఈ ఆర్యూబీ నిర్మాణం జరిపారు. దీంతో ఏన్నో ఏళ్లుగా పట్టాలు దాటుతూ నానా కష్టాలు పడుతున్న ఆయా ప్రాంతాల ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి 11.30 గంటలకు చివరి ఎంఎంటీఎస్ రైలు వెళ్లాక ఆర్యూబీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న రైల్వే అధికారులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా పట్టాల తొలగింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తరువాత జేసీబీల సహాయంతో కట్టను తవ్వారు. దాదాపు 400 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ క్రేన్ సహాయంతో భారీ బ్లాక్‌లను లిఫ్ట్ చేసి నిర్దిష్టమైన ప్రాంతంలో ఉంచారు. అలా తొమ్మిది బ్లాక్‌లను ఒక దాని వెంట ఒకటి ఏర్పాటుచేసుకుంటూ రావడంతో వాటి మధ్య మార్గం ఏర్పడింది. బ్లాక్‌ల అమరిక ప్రక్రియ పూర్తయిన వెంటనే యధావిధిగా కట్టను నిర్మించి పట్టాలను పునరుద్ధరించారు. ఆరు గంటల సమయంలో ఎక్కడా ఏ ఒక్క నిమిషం కూడా జాప్యం చేయకుండా సమన్వయంతో పనులను పూర్తి చేయగలిగారు. ఆర్బీయూ నిర్మాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే నిర్మాణ పనులకు కొద్ది దూరంలోనే పోలీసులు వారిని నిలుపుదల చేశారు. నెరవేరిన దశాబ్దాల కల.. ఎట్టకేలకు ఓల్డ్‌కస్టమ్స్‌బస్తీ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. పట్టాలపై నుంచి లీలానగర్ వైపు వచ్చే క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, రైల్వే రక్షక దళ సిబ్బంది కంట పడి జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందోనని ఆందోళనతో వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ ఆర్యూబీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు జీహెచ్ఎంసీ నుంచి రూ.2.18 కోట్లను విడుదల చేయించి ఆ నిధులను రైల్వే శాఖకు అందజేశారు. రైల్వే శాఖ అనుమతికి జాప్యం నెలకొనడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతి కూడా తీసుకువచ్చారు. అలా ప్రాజెక్టు పూర్తి చేసుకోవడంతో పట్టాలపై నుంచి వెళ్ళే అవసరం లేకుండా ఎంచక్కా ఆర్యూబీ మార్గంలో తమ రాకపోకలు సాగించవచ్చని ఓల్డ్‌కస్టమ్స్‌బస్తీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు రంజాన్ కానుకగా అక్కడి ముస్లిం సోదరులు పేర్కొనడం గమనార్హం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో రైల్వే అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల అధికారులు తమవంతు భాగస్వామ్యం వహించారు. -
ప్రారంభానికి ముందే ఆర్‌యూబీకి లీకులు
కొద్దిపాటి వర్షానికే లోపల నీరు నిల్వ అరండల్‌పేట : నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నిర్మించిన కంకరగుంట ఆర్యూబీ నాణ్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే పైకప్పు శ్లాబు నుంచి నీరు ఆర్యూబీ లోపలకు చేరుకుంది. లోపల నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. శ్లాబు లీకుల్లో నుంచి వస్తున్న నీరు వాహనచోదకులపై పడుతోంది. కంకరగుంట ఆర్యూబీ నిర్మాణానికి సుమారు రూ.13 కోట్ల వరకు వెచ్చించారు. ఏటీ అగ్రహారం, జూట్‌మిల్ వైపు అనుసంధాన పనులు నిర్వహించేందుకు అదనంగా కోటి రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆర్యూబీ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. వర్షం వస్తే లోపల నీరు నిల్వ ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. అయితే ఇంజినీరింగ్ అధికారులు చేపట్టిన పనులు కేవలం మాటలకే పరిమితమయ్యాయన్నది నిరూపితమైంది. అసలు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో వైపు కంకరగుంట ఆర్యూబీని అధికారికంగా ఈనెల 15న అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆర్యూబీని పరీక్షించేందుకు వాహనాల రాకపోకలకు అనుమతించారు. అయితే లోపల నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు భూగర్భంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. నీటిని తోడేందుకు మోటార్లు వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఆర్యూబీ ప్రారంభానికి ముందే ఇలా కావడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి లోపాలను సవరించాలని ఇంజినీరింగ్ అధికారులను కోరుతున్నారు.