ప్రారంభానికి ముందే ఆర్‌యూబీకి లీకులు
కొద్దిపాటి వర్షానికే లోపల నీరు నిల్వ
అరండల్‌పేట : నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నిర్మించిన కంకరగుంట ఆర్‌యూబీ నాణ్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే పైకప్పు శ్లాబు నుంచి నీరు ఆర్‌యూబీ లోపలకు చేరుకుంది. లోపల నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. శ్లాబు లీకుల్లో నుంచి వస్తున్న నీరు వాహనచోదకులపై పడుతోంది. కంకరగుంట ఆర్‌యూబీ నిర్మాణానికి సుమారు రూ.13 కోట్ల వరకు వెచ్చించారు. ఏటీ అగ్రహారం, జూట్‌మిల్ వైపు అనుసంధాన పనులు నిర్వహించేందుకు అదనంగా కోటి రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆర్‌యూబీ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. వర్షం వస్తే లోపల నీరు నిల్వ ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. అయితే ఇంజినీరింగ్ అధికారులు చేపట్టిన పనులు కేవలం మాటలకే పరిమితమయ్యాయన్నది నిరూపితమైంది. అసలు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
మరో వైపు కంకరగుంట ఆర్‌యూబీని అధికారికంగా ఈనెల 15న అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆర్‌యూబీని పరీక్షించేందుకు వాహనాల రాకపోకలకు అనుమతించారు. అయితే లోపల నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు భూగర్భంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. నీటిని తోడేందుకు మోటార్లు వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఆర్‌యూబీ ప్రారంభానికి ముందే ఇలా కావడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి లోపాలను సవరించాలని ఇంజినీరింగ్ అధికారులను కోరుతున్నారు.