బాలిక చేతిపై దద్దుర్లు అయిన దృశ్యం పొట్టపై దద్దుర్లు ఏర్పడి నొప్పి పెడుతుండటంతో ఏడుస్తున్న చిన్నారి
ఇదేం రకం వ్యాధినో తెలియదు కానీ శరీరమంతా దద్దుర్లు..దురద. ఇలా ఒకరికి కాదు ఇద్దరికి కాదు వందల మందికి ఉంది. పత్తి నిల్వ ఉన్న వారి ఇళ్లలోనే ఇది అధికంగా కనిపిస్తోంది. చిన్నారులు, వృద్ధులు దద్దుర్ల దెబ్బకు రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి. అంతు చిక్కని ఈ వ్యాధికి చికిత్స కోసం కొందరు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
కర్నూలు, కౌతాళం రూరల్: మండలంలో గత కొన్ని రోజులుగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరి శరీరం చూసినా దద్దుర్లు కనిపిస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. స్థానిక వైద్యుల దగ్గర చికిత్స చేయించినా తగ్గక పోవడంతో చాలా మంది ఆదోనిలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. పత్తి నిల్వ ఉన్న ఇళ్లలోని వారికే ఎక్కువగా దద్దుర్లు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దురదతో పిల్లలు, వృద్ధులు నిద్రపోవడం లేదని..రాత్రంతా తాము జాగరణ చేయాల్సి వస్తుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ఏ ఒక్క ప్రభుత్వ వైద్యుడు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండల వైద్యాధికారి చిదంబరరావును వివరణ కోరగా పత్తిదూదిలోని పురుగులతో దద్దర్లు వస్తున్నాయని ఇది మండలం వ్యాప్తంగా ఉందని, త్వరలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సాయంత్రమైతే చాలు దద్దుర్లు
సాయంత్రం అయిందంటే చాలు శరీరంపై దద్దుర్లు విపరీతంగా కనిపిస్తాయి. పత్తి నిల్వ ఉన్న ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది. పిల్లలు, పెద్దలకు దురద వల్ల శరీరంపై గాయాలు కూడా అవుతున్నాయి. పత్తిని బేళ్లలో తొక్కి ఆదోనికి తీసుకెళ్దామంటే కూలీలు కూడా రావడం లేదు. –దొమ్మిడి వెంకోబ, కౌతాళం
Comments
Please login to add a commentAdd a comment