cotton stocks
-
ఆ ఊర్లో సాయంత్రమైతే చాలు ఒళ్లంతా దద్దుర్లే!
ఇదేం రకం వ్యాధినో తెలియదు కానీ శరీరమంతా దద్దుర్లు..దురద. ఇలా ఒకరికి కాదు ఇద్దరికి కాదు వందల మందికి ఉంది. పత్తి నిల్వ ఉన్న వారి ఇళ్లలోనే ఇది అధికంగా కనిపిస్తోంది. చిన్నారులు, వృద్ధులు దద్దుర్ల దెబ్బకు రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి. అంతు చిక్కని ఈ వ్యాధికి చికిత్స కోసం కొందరు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కర్నూలు, కౌతాళం రూరల్: మండలంలో గత కొన్ని రోజులుగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరి శరీరం చూసినా దద్దుర్లు కనిపిస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. స్థానిక వైద్యుల దగ్గర చికిత్స చేయించినా తగ్గక పోవడంతో చాలా మంది ఆదోనిలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. పత్తి నిల్వ ఉన్న ఇళ్లలోని వారికే ఎక్కువగా దద్దుర్లు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దురదతో పిల్లలు, వృద్ధులు నిద్రపోవడం లేదని..రాత్రంతా తాము జాగరణ చేయాల్సి వస్తుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ఏ ఒక్క ప్రభుత్వ వైద్యుడు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండల వైద్యాధికారి చిదంబరరావును వివరణ కోరగా పత్తిదూదిలోని పురుగులతో దద్దర్లు వస్తున్నాయని ఇది మండలం వ్యాప్తంగా ఉందని, త్వరలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సాయంత్రమైతే చాలు దద్దుర్లు సాయంత్రం అయిందంటే చాలు శరీరంపై దద్దుర్లు విపరీతంగా కనిపిస్తాయి. పత్తి నిల్వ ఉన్న ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది. పిల్లలు, పెద్దలకు దురద వల్ల శరీరంపై గాయాలు కూడా అవుతున్నాయి. పత్తిని బేళ్లలో తొక్కి ఆదోనికి తీసుకెళ్దామంటే కూలీలు కూడా రావడం లేదు. –దొమ్మిడి వెంకోబ, కౌతాళం -
‘మద్దతు’ కోసం ఎదురుచూపు
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : పత్తి రైతులు మద్దతు ధర కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాల ధరలు గణనీయంగా పెరిగాయి. విత్తనాలు వేసినప్పటి నుంచి పత్తి పంట చేతికొచ్చే వరకూ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. దీనికి తోడు ప్రారంభం నుంచి అధిక వర్షాలు పత్తి రైతులకు శాపంగా మారాయి. ఉపాధి హామీ పథకం పనులతో గ్రామాల్లో పత్తి ఏరే కూలీలకు డిమాండ్ పెరిగింది. దీనికితోడు గతేడాది కిలో పత్తికి రూ.5 చెల్లించగా, ప్రస్తుతం రూ.7కు పెంచారు. ఇదిలా ఉంటే.. ఈసారి దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గింది. ఎకరాలకు సుమారు రూ.15 నుంచి 20 వేల వరకు ఖర్చు చేశారు. గతేడాది ఎకరాకు ఏడు నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. ఈసారి మూడు క్వింటాళ్లకు పడిపోయింది. ధరలేమో క్వింటాల్‌కు ప్రారంభంలో రూ.4300 చెల్లించగా.. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.4,800 వరకు చెల్లిస్తున్నారు. దీంతో చేతికి వచ్చిన పత్తిని మార్కెట్లో అమ్ముకోలేక.. ధర మరింత ఏమైనా పెరుగుతుందా అని పలువురు రైతులు ఇళ్లలోనే నిల్వ చేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని భీమ్‌పూర్, రహపల్లి, బూర్గుడ, ఈదులవాడ, కొమ్ముగూడ, గొళ్లగూడ, అంకుసాపూర్తోపాటు పలు గ్రామాల్లో ఎక్కడ చూసినా రైతుల ఇళ్లలో తెల్లబంగారం కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్లలో స్థలం సరిపోక ప్రమాదాలు సైతం లెక్క చేయకుండా ఇళ్లపైన కూడా నిల్వ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పత్తి పంటను రైతులు ఇళ్లలోనే నిల్వ చేస్తుండడంతో.. జిన్నింగు మిల్లులు వెలవెలబోతున్నాయి. ఒక్కో జిన్నింగు మిల్లులో కేవలం రెండు మూడు రోజులకు సరిపడే పత్తి మాత్రమే నిల్వ ఉంది.