ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : పత్తి రైతులు మద్దతు ధర కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాల ధరలు గణనీయంగా పెరిగాయి. విత్తనాలు వేసినప్పటి నుంచి పత్తి పంట చేతికొచ్చే వరకూ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. దీనికి తోడు ప్రారంభం నుంచి అధిక వర్షాలు పత్తి రైతులకు శాపంగా మారాయి. ఉపాధి హామీ పథకం పనులతో గ్రామాల్లో పత్తి ఏరే కూలీలకు డిమాండ్ పెరిగింది. దీనికితోడు గతేడాది కిలో పత్తికి రూ.5 చెల్లించగా, ప్రస్తుతం రూ.7కు పెంచారు. ఇదిలా ఉంటే.. ఈసారి దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గింది.
ఎకరాలకు సుమారు రూ.15 నుంచి 20 వేల వరకు ఖర్చు చేశారు. గతేడాది ఎకరాకు ఏడు నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. ఈసారి మూడు క్వింటాళ్లకు పడిపోయింది. ధరలేమో క్వింటాల్‌కు ప్రారంభంలో రూ.4300 చెల్లించగా.. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.4,800 వరకు చెల్లిస్తున్నారు. దీంతో చేతికి వచ్చిన పత్తిని మార్కెట్లో అమ్ముకోలేక.. ధర మరింత ఏమైనా పెరుగుతుందా అని పలువురు రైతులు ఇళ్లలోనే నిల్వ చేస్తున్నారు.
ఆసిఫాబాద్ మండలంలోని భీమ్‌పూర్, రహపల్లి, బూర్గుడ, ఈదులవాడ, కొమ్ముగూడ, గొళ్లగూడ, అంకుసాపూర్‌తోపాటు పలు గ్రామాల్లో ఎక్కడ చూసినా రైతుల ఇళ్లలో తెల్లబంగారం కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్లలో స్థలం సరిపోక ప్రమాదాలు సైతం లెక్క చేయకుండా ఇళ్లపైన కూడా నిల్వ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పత్తి పంటను రైతులు ఇళ్లలోనే నిల్వ చేస్తుండడంతో.. జిన్నింగు మిల్లులు వెలవెలబోతున్నాయి. ఒక్కో జిన్నింగు మిల్లులో కేవలం రెండు మూడు రోజులకు సరిపడే పత్తి మాత్రమే నిల్వ ఉంది.
‘మద్దతు’ కోసం ఎదురుచూపు
Published Wed, Jan 29 2014 3:12 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement