నెయ్యి... తినాలా, వద్దా? | Ayurvedic counseling | Sakshi
Sakshi News home page

నెయ్యి... తినాలా, వద్దా?

Published Thu, May 12 2016 10:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

నెయ్యి... తినాలా, వద్దా?

నెయ్యి... తినాలా, వద్దా?

ఆయుర్వేద కౌన్సెలింగ్
ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నెయ్యి శరీరానికి అవసరమా, కాదా? సేవించవచ్చా, సేవించకూడదా? అవసరమైతే ఏ నేతిని వాడాలి? వివరాలు తెలియజేయండి.
 - ఎ. కామాక్షి, హైదరాబాద్
 
మనిషి ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే, పోషకవిలువలు ఉన్న ఆహారం, తగురీతిలో వ్యాయామం అత్యంతావశ్యకం. కాలమాన పరిస్థితుల ఎలా ఉన్నా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి హానికరమైన జీవనశైలికి దాసోహం అనడం సరికాదు. నెయ్యి శరీరానికి చాలా అవసరం. నెయ్యికి సంస్కృతంలో ఇతర పర్యాయ పదాలు... ఘృతం, ఆజ్యం, సర్పిః, హవిః, పవిత్ర మొదలగునవి. ఏ జంతువుకి సబంధించిన నేతికైనా సాధారణ గుణధర్మాలు ఈ కింది విధంగా ఉంటాయి.

* సప్తధాతువులకు పుష్టిని కలిగిస్తూ, ఓజస్సును వృద్ధి చేస్తుంది. దేహకాంతి, తేజస్సు, లావణ్యాలను పెంపొందిస్తుంది. కంఠస్వరాన్ని మెరుగుపరుస్తుంది. మేధావర్ధకమై ధారణశక్తిని పెంచుతుంది. ఆయుష్కరం.
* స్నిగ్ధం (జిడ్డుగా ఉంటంది), గురువు (ఆలస్యంగా జీర్ణమై, దేహాన్ని బరువెక్కిస్తుంది), స్వల్పంగా ‘అభిష్యంది’కరం (స్రోతస్సులకు అవరోధం కలిగిస్తుంది), కఫకరం, వాతపిత్తహరం. శీతవీర్యం (చలవచేస్తుంది), విషహరం, కళ్లకు మంచిది, రుచిగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది (దీపనం).
* ఉన్మాదం వంటి మానసిక వికారాలను తగ్గించడంలో ఉపకరిస్తుంది. ఉదరశూల, జ్వరం, కొన్ని చర్మరోగాలను పోగొడుతుంది. కృమిహరం (ఇన్ఫెక్షన్లను హరిస్తుంది).
విశేష గుణాలు : గేదెనెయ్యి, వృష్యం (శుక్రవర్ధకం), కామోత్తేజకం, మేకనెయ్యి దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. గొర్రె నెయ్యి ఎముకలకు పుష్టినిస్తుంది, మూత్ర విసర్జక  వ్యవస్థలో రాళ్లు పెరగకుండా చూస్తుంది.
* ఇక ఆవునెయ్యి (గోఘృతం) అన్నింటిలోనూ శ్రేష్ఠం. వయస్థాపకం (ముసలితనాన్ని దూరం చేస్తుంది). మంచి పరిమళం ఉంటుంది. రసాయనం (శారీరక మానసిక శక్తివర్ధకం).

భావప్రకాశ సంహితలోని శ్లోకం :
‘‘గత్యం ఘృతం... బల్యం, పవిత్ర మాయుష్యం, వయస్థాపకం, రసాయనం ॥
సుగంధం రోచనం చారు సర్వాజ్యేషు గుణాధికం॥‘‘
 - పురాణఘృతం (ఒక సంవత్సరం దాటిన నెయ్యి): చాలా వ్యాధులను పోగొడుతుంది. ఉదా: మూర్ఛ, అపస్మారక, ఉన్మాద, తిమిర (కంటి చూపు తగ్గడం), చర్మరోగాలు మొదలైనవి.
 - నవీన ఘృతం (కొత్త నెయ్యి) : నీరసాన్ని, పాండురోగాన్ని (అనీమియా), నేత్రరోగాలను తగ్గిస్తుంది.
 - బాలురు, వృద్ధులు, ఆకలి తక్కువగా ఉన్నవారు, అజీర్ణం, మలబంధ వికారాలు కలిగి ఉన్నవారు నెయ్యిని చాలా మితంగా సేవించాలి.
గమనిక : నెయ్యి వేడి చేస్తుందనడం అపోహ మాత్రమే. వాస్తవానికి అది చలవచేసి అనేక పిత్త దోష వికారాలను తగ్గిస్తుంది. (ఉదాహరణకు రక్తస్రావం, తలతిరగడం, మంట వంటివి). ఆవు నెయ్యిని ‘మితం’గా ప్రతిరోజూ సేవిస్తూ, తదనుగుణంగా ఏదో రీతిలో ప్రతిరోజూ తగినంత వ్యాయామం చేస్తుంటే, ఎంతో ఆరోగ్యప్రదం.
- డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 26 ఏళ్లు. దాదాపు ఆర్నెల్ల క్రితం క్రికెట్ ఆడుతుండగా కాలు  మడతపడి, మోకాలు వాచింది. విపరీతమైన నొప్పి వస్తోంది. రెండు వారాల తర్వాత నొప్పి తగ్గింది. తర్వాత నేను క్రికెట్ ఆడేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. దాంతో మోకాలిలో తీవ్రమైన వాపు, నొప్పి వచ్చాయి. ఈసారి ఎమ్మారై చేయించాం. అందులో ఏసీఎల్ లిగమెంట్  దెబ్బతినట్లుగా తేలింది. మా డాక్టర్‌గారు శస్త్రచికిత్స అవసరం అన్నారు. కానీ మా బాబాయికి కూడా ఇలాంటి సమస్యే వచ్చిందని చెప్పి, ఆయన సర్జరీ అవసరం లేదన్నారు. దాంతో ఇప్పుడు నేను అయోమయంలో పడిపోయాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి.
- మధుసూదన్, అనకాపల్లి

 
ఆటలు ఆడేవారిలోనూ, బైక్ యాక్సిడెంట్‌లో గాయపడ్డవారిలో ఏసీఎల్ లిగమెంట్ దెబ్బతినడం అన్నది చాలా సాధారణంగా జరుగుతుంది. గతంలో దీన్ని కనుగొనడం కూడా అంతగా జరగకపోయేది. కాబట్టి శస్త్రచికిత్స ప్రస్తావనే వచ్చేది కాదు. మీ బాబాయి లాంటి పెద్ద వయసు వారు ఎలాగూ పెద్దగా కదలికలు లేని జీవనశైలి గడుపుతారు కాబట్టి వారికి శస్త్రచికిత్స లేకపోయినా పర్వాలేదు. కానీ మీలాంటి యువకుల్లో శారీరక కదలికలు ఎక్కువ కాబట్టి సమస్య మళ్లీ తిరగబెట్టడం, కొన్నేళ్ల తర్వాత ఆర్థరైటిస్ సమస్య రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. యువకుల్లో ఈ పరిణామం చాలా ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి... మీ వయసులో ఉన్నవారికి ఏసీఎల్ లిగమెంట్‌ను పునర్నిర్మించే శస్త్రచికిత్స (ఏసీఎల్ లిగమెంట్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీ) అవసరం అని నా సలహా. దీని వల్ల మీరు భవిష్యత్తులోనూ ఇంతే చురుగ్గా ఉండటంతో పాటు మీకు వచ్చేందుకు అవకాశం ఉన్న ఆర్థరైటిస్‌ను నివారించినట్లు అవుతుంది.
- డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్

 
కార్డియాలజీ కౌన్సెలింగ్
మేము ఉన్న ఊరు నుంచి సిటీ కాస్త దూరం. గుండెపోటు వచ్చినప్పుడు పెద్దాసుపత్రులకు వెళ్లేలోపు మాలాంటి వారు ఎలాంటి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి.
 - వి. గురునాథరావు, చౌటుప్పల్

 
రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్-300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ డిస్ప్రిన్-300 మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయవచ్చు. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది.

ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం. ఆ మాత్రను నీళ్లలో కలిపి  తాగించడం వల్ల... వెంటనే ఒంటిలోకి అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.
 
గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్ అటాక్’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండెదడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు.
- డాక్టర్ అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement