Orthopaedic counseling
-
మెడనొప్పి మరీ తీవ్రం...
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. నాకు మెడనొప్పి వస్తోంది. ఇటీవల అది మరీ తీవ్రమైంది. మందులు వాడటం అంటే నాకు కాస్త భయం. నొప్పి తగ్గడానికి జాగ్రత్తలు చెప్పండి. - సుధాకర్, నల్లగొండ మనం నిల్చునే, కూర్చొనే భంగిమలు సరిగా లేకపోవడం వల్లనే మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూస నుంచి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్ ఆర్టరీస్ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్ రక్తప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవచ్చు. దీనివల్ల నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతులు కావడం జరుగుతుంది. మెడ దగ్గర ఉండే వెన్నుపూసల్లో ఏడు పూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అని, రెండో వెన్నుపూసను యాక్సిస్ అని అంటారు. ఆ తర్వాత వెన్నుపూసలను 3, 4, 5, 6, 7 అని నెంబర్లతో పిలుస్తారు. ఇవన్నీ ఒకదానితో మరొకటి జాయింట్ అయినట్లుగా అమరి ఉంటాయి. అందులో ఏర్పడ్డ బోలు ప్రదేశంలో స్పైనల్‌కార్డ్ అంటే వెన్నుపాము ఉంటుంది. మెదడు నుంచి కాళ్లకు, చేతులకు నరాలను తీసుకెళ్తూ ఉంటుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఖాళీ స్థలం ఇంటర్ వర్టిబ్రల్ పారామినా నుంచి ఒక్కొక్కనరం బయటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కోవైపునకు విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ ఒక షాక్ అబ్జార్బర్‌లా పనిచూస్తుంది. డిస్క్కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్ చేయడానికి ఇది దోహదపడుతుంది. నిర్ధారణ మెడనొప్పి వచ్చే వారికి ఎక్స్-రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్-రే బట్టి మెడపూసల్లో ఏవైనా తేడాలు ఉన్నాయా అని తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తారు. సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎమ్మారై స్కాన్ ద్వారా పరీక్షలు నిర్వహించి, దాని సహాయంతో ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉంది తెలుసుకోవచ్చు. ఆ ఒత్తిడి దేని వల్ల వచ్చింది, ఏదైనా ఎముక ఫ్రాక్చర్ అయిందా, నరాల్లో వాపు ఏమైనా ఉందా, గడ్డలు ఉన్నాయా వంటి అంశాలను తెలుసుకోవచ్చు. డిస్క్ ప్రొలాప్స్ (డిస్క్ తాను ఉన్న స్థానం నుంచి తొలగడం) జరిగితే... ఆ సమస్య ఎంత మేర ఉందో గమనించి, దానికి చికిత్స చేస్తారు. జాగ్రత్తలు ఇవి... మెడ నొప్పి వచ్చినప్పుడు వేడినీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టడం లేదా ఐస్ ముక్కను గుడ్డలో చుట్టి కాపడం పెట్టడం వల్ల సాధారణ నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు వాటికి తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే... అలా నొప్పి వస్తుందంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందుకే విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఫిజియోథెరపిస్ట్‌ను కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్ ఎక్సర్సైజ్లు తెలుసుకొని వాటిని క్రమం తప్పకుండా చేయాలి సాధారణ నొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. వాటిని రాస్తూ సున్నితంగా రోజుకు ఐదారుసార్లు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది బరువైన బ్యాగ్‌లను ఒకే భుజానికి తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలపై, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది నడిచేటప్పుడు ఒకేవైపునకు ఒంగడం సరికాదు. -
గుండెపోటును గుర్తించడం ఎలా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. ఈ మధ్యగుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. అంతవరకు ఎటువంటి గుండెజబ్బులూ లేవు. ఇలా ఎందుకు జరిగింది? గుండెపోటును ముందుగా ఎలా గుర్తించగలం? - డి.శ్రీహరి, కాకినాడ మీరు చెప్పినదాన్నిబట్టి మీనాన్నగారికి వచ్చిన దాన్ని సడన్ కార్డియాక్ డెత్, సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుగ్గానే ఉండి... హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడుతూ పడిపోవడం... ఆస్పత్రికి తరలించేలోపే మనకు దక్కకుండా పోవడం వంటివి వీటి లక్షణం. హఠాన్మరణం ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటే... గతంలో ఒకసారి గుండెపోటు బారినపడినవారు, గుండె కండరం బలహీనంగా ఉన్నవారు, రక్తం పంపింగ్ 35 కంటె తక్కువగా ఉన్నవారు, కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర, గుండెలో విద్యుత్ సమస్యలు (బ్రుగాడా, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ వంటివి) ఉన్నవారు, గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు, ఈ సమస్య ఇప్పటికే ఉన్నవారిలో రావచ్చు. ఎటువంటి గుండెజబ్బూ ఉన్నట్లు తెలియని వారిలోనూ రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే ఈ ఘడియల్లో తగిన విధంగా స్పందిస్తే మృత్యుముఖంలోకి వెళ్లినవారిని కూడా తిరిగి బతికించవచ్చు. హఠాన్మరణాన్ని గుర్తుపట్టేదెలా? ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా లేదా? శ్వాస తీసుకుంటున్నారా లేదా? గుండె కొట్టుకుంటోందా లేదా అనేది చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే కార్డియాక్ మసాజ్ (సీపీఆర్) ఇవ్వటం తక్షణావసరం. గుండెపోటు వస్తే అత్యవసరంగా యాంజియోప్లాస్టీ, స్టెంట్ పెట్టడం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయటం, పంపింగ్ లోపం ఉంటే దీర్ఘకాలంలో మళ్లీ హఠాన్మరణ పరిస్థితులు తలెత్తకుండా ఏఐసీడీఈ అనే పరికరాన్ని అమర్చటం వంటి చికిత్సలు అందిస్తారు. సీపీఆర్ అంటే..? ఎవరైనా ఉన్నట్టుండి గుండెపోటుతో విలవిల్లాడుతూ పడిపోతుంటే వెంటనే పడుకోబెట్టడం ముఖ్యం. వెంటనే బాగానే ఉన్నారా? అని ఆరా తీయడం, శ్వాస పీలుస్తున్నారా లేదా? నాడి కొట్టుకుంటోందా లేదా వగైరా విషయాలను గమనించాలి. దానితోబాటు ఛాతీమీద చెవి పెట్టి గుండె కొట్టుకుంటోందో లేదో చూడాలి. ఇవి ఆగిపోతే తక్షణం కార్డియాక్ మసాజ్ చెయ్యటం అవసరం. ఇది కీలక ఘడియల్లో ప్రాణంపోసే గొప్ప ప్రక్రియ. చాలాదేశాల్లో స్వచ్ఛందంగా అందరికీ దీనిలో తర్ఫీదిస్తారు. గుండె ఆగి మరణించిన వ్యక్తికి క్షణాల్లో ఇది ఆరంభించి.. అంబులెన్స్ వచ్చేవరకూ రక్తప్రసారాన్ని నిలబెట్టగలిగితే దాదాపు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్లమే అవుతాం. అందుకే సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండటం అవసరం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. ఇంత చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులా? ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువై చాలా బాధపడుతున్నాను. నేను చాలా రకాల మందులు వాడాను. అయినా సమస్య తగ్గడం లేదు. చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు అస్సలు కదలలేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్‌రావు, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భాగం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఆర్నెల్ల క్రితం నా చీలమండ బెణికింది. అప్పుడు ప్లాస్టర్ కాస్ట్ వేశారు. ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం గడిచాక కూడా నొప్పి ఎందుకు వస్తోంది. - నళిని, రాజమండ్రి మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే తగ్గి కాస్త పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ ఎలాస్టిసిటీని కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు మీ కాలి చీలమండకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయిస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
నెయ్యి... తినాలా, వద్దా?
ఆయుర్వేద కౌన్సెలింగ్ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నెయ్యి శరీరానికి అవసరమా, కాదా? సేవించవచ్చా, సేవించకూడదా? అవసరమైతే ఏ నేతిని వాడాలి? వివరాలు తెలియజేయండి. - ఎ. కామాక్షి, హైదరాబాద్ మనిషి ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే, పోషకవిలువలు ఉన్న ఆహారం, తగురీతిలో వ్యాయామం అత్యంతావశ్యకం. కాలమాన పరిస్థితుల ఎలా ఉన్నా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి హానికరమైన జీవనశైలికి దాసోహం అనడం సరికాదు. నెయ్యి శరీరానికి చాలా అవసరం. నెయ్యికి సంస్కృతంలో ఇతర పర్యాయ పదాలు... ఘృతం, ఆజ్యం, సర్పిః, హవిః, పవిత్ర మొదలగునవి. ఏ జంతువుకి సబంధించిన నేతికైనా సాధారణ గుణధర్మాలు ఈ కింది విధంగా ఉంటాయి. * సప్తధాతువులకు పుష్టిని కలిగిస్తూ, ఓజస్సును వృద్ధి చేస్తుంది. దేహకాంతి, తేజస్సు, లావణ్యాలను పెంపొందిస్తుంది. కంఠస్వరాన్ని మెరుగుపరుస్తుంది. మేధావర్ధకమై ధారణశక్తిని పెంచుతుంది. ఆయుష్కరం. * స్నిగ్ధం (జిడ్డుగా ఉంటంది), గురువు (ఆలస్యంగా జీర్ణమై, దేహాన్ని బరువెక్కిస్తుంది), స్వల్పంగా ‘అభిష్యంది’కరం (స్రోతస్సులకు అవరోధం కలిగిస్తుంది), కఫకరం, వాతపిత్తహరం. శీతవీర్యం (చలవచేస్తుంది), విషహరం, కళ్లకు మంచిది, రుచిగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది (దీపనం). * ఉన్మాదం వంటి మానసిక వికారాలను తగ్గించడంలో ఉపకరిస్తుంది. ఉదరశూల, జ్వరం, కొన్ని చర్మరోగాలను పోగొడుతుంది. కృమిహరం (ఇన్ఫెక్షన్లను హరిస్తుంది). విశేష గుణాలు : గేదెనెయ్యి, వృష్యం (శుక్రవర్ధకం), కామోత్తేజకం, మేకనెయ్యి దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. గొర్రె నెయ్యి ఎముకలకు పుష్టినిస్తుంది, మూత్ర విసర్జక వ్యవస్థలో రాళ్లు పెరగకుండా చూస్తుంది. * ఇక ఆవునెయ్యి (గోఘృతం) అన్నింటిలోనూ శ్రేష్ఠం. వయస్థాపకం (ముసలితనాన్ని దూరం చేస్తుంది). మంచి పరిమళం ఉంటుంది. రసాయనం (శారీరక మానసిక శక్తివర్ధకం). భావప్రకాశ సంహితలోని శ్లోకం : ‘‘గత్యం ఘృతం... బల్యం, పవిత్ర మాయుష్యం, వయస్థాపకం, రసాయనం ॥ సుగంధం రోచనం చారు సర్వాజ్యేషు గుణాధికం॥‘‘ - పురాణఘృతం (ఒక సంవత్సరం దాటిన నెయ్యి): చాలా వ్యాధులను పోగొడుతుంది. ఉదా: మూర్ఛ, అపస్మారక, ఉన్మాద, తిమిర (కంటి చూపు తగ్గడం), చర్మరోగాలు మొదలైనవి. - నవీన ఘృతం (కొత్త నెయ్యి) : నీరసాన్ని, పాండురోగాన్ని (అనీమియా), నేత్రరోగాలను తగ్గిస్తుంది. - బాలురు, వృద్ధులు, ఆకలి తక్కువగా ఉన్నవారు, అజీర్ణం, మలబంధ వికారాలు కలిగి ఉన్నవారు నెయ్యిని చాలా మితంగా సేవించాలి. గమనిక : నెయ్యి వేడి చేస్తుందనడం అపోహ మాత్రమే. వాస్తవానికి అది చలవచేసి అనేక పిత్త దోష వికారాలను తగ్గిస్తుంది. (ఉదాహరణకు రక్తస్రావం, తలతిరగడం, మంట వంటివి). ఆవు నెయ్యిని ‘మితం’గా ప్రతిరోజూ సేవిస్తూ, తదనుగుణంగా ఏదో రీతిలో ప్రతిరోజూ తగినంత వ్యాయామం చేస్తుంటే, ఎంతో ఆరోగ్యప్రదం. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. దాదాపు ఆర్నెల్ల క్రితం క్రికెట్ ఆడుతుండగా కాలు మడతపడి, మోకాలు వాచింది. విపరీతమైన నొప్పి వస్తోంది. రెండు వారాల తర్వాత నొప్పి తగ్గింది. తర్వాత నేను క్రికెట్ ఆడేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. దాంతో మోకాలిలో తీవ్రమైన వాపు, నొప్పి వచ్చాయి. ఈసారి ఎమ్మారై చేయించాం. అందులో ఏసీఎల్ లిగమెంట్ దెబ్బతినట్లుగా తేలింది. మా డాక్టర్‌గారు శస్త్రచికిత్స అవసరం అన్నారు. కానీ మా బాబాయికి కూడా ఇలాంటి సమస్యే వచ్చిందని చెప్పి, ఆయన సర్జరీ అవసరం లేదన్నారు. దాంతో ఇప్పుడు నేను అయోమయంలో పడిపోయాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - మధుసూదన్, అనకాపల్లి ఆటలు ఆడేవారిలోనూ, బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డవారిలో ఏసీఎల్ లిగమెంట్ దెబ్బతినడం అన్నది చాలా సాధారణంగా జరుగుతుంది. గతంలో దీన్ని కనుగొనడం కూడా అంతగా జరగకపోయేది. కాబట్టి శస్త్రచికిత్స ప్రస్తావనే వచ్చేది కాదు. మీ బాబాయి లాంటి పెద్ద వయసు వారు ఎలాగూ పెద్దగా కదలికలు లేని జీవనశైలి గడుపుతారు కాబట్టి వారికి శస్త్రచికిత్స లేకపోయినా పర్వాలేదు. కానీ మీలాంటి యువకుల్లో శారీరక కదలికలు ఎక్కువ కాబట్టి సమస్య మళ్లీ తిరగబెట్టడం, కొన్నేళ్ల తర్వాత ఆర్థరైటిస్ సమస్య రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. యువకుల్లో ఈ పరిణామం చాలా ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి... మీ వయసులో ఉన్నవారికి ఏసీఎల్ లిగమెంట్ను పునర్నిర్మించే శస్త్రచికిత్స (ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ) అవసరం అని నా సలహా. దీని వల్ల మీరు భవిష్యత్తులోనూ ఇంతే చురుగ్గా ఉండటంతో పాటు మీకు వచ్చేందుకు అవకాశం ఉన్న ఆర్థరైటిస్‌ను నివారించినట్లు అవుతుంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మేము ఉన్న ఊరు నుంచి సిటీ కాస్త దూరం. గుండెపోటు వచ్చినప్పుడు పెద్దాసుపత్రులకు వెళ్లేలోపు మాలాంటి వారు ఎలాంటి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. - వి. గురునాథరావు, చౌటుప్పల్ రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్-300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ డిస్ప్రిన్-300 మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయవచ్చు. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం. ఆ మాత్రను నీళ్లలో కలిపి తాగించడం వల్ల... వెంటనే ఒంటిలోకి అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్ అటాక్’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండెదడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు. - డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నిద్రలేవగానే కీళ్లనొప్పి...!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 58 ఏళ్లు. రెండు వారాల నుంచి నేను ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటోంది. కీళ్లనొప్పి, వాపు, బిగుసుకుపోవడం, కాళ్లలో బలహీనత, మొద్దుబారడం జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. బలరామ్, కొత్తగూడెం మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కీళ్లలోని కార్టిలేజ్ అనే మృదులాస్థి అరుగుదలకు గురికావడం, తద్వారా చుట్టూ ఉన్న కణజాలంపై అరుగుదల ప్రభావం పడటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇది 40 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది ఎక్కువ. ఎక్కువగా మోకాలిలో కనిపించే సమస్య అయినప్పటికీ చేతివేళ్లు, వెన్నుపూస, తుంటి ప్రాంతం, కాలివేళ్లలోనూ ఆస్టియో ఆర్థరైటిస్ తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్య సాధారణంగా గతంలో కీళ్లకు ఏదైనా దెబ్బ తగిలి ఉండటం, అధిక బరువు, కాళ్ల ఎదుగుదలలో హెచ్చుతగ్గులు ఉండటం, కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించే పనులు చేయడం వంటివి కారణాలు. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనిపించవచ్చు. మీరు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్ష, మోకాలి నుంచి కొద్దిగా ద్రవాన్ని తీసి పరీక్షించడం, ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. మీకు దగ్గర్లోని వైద్య నిపుణులను సంప్రదించండి. - డా. ప్రవీణ్ మేరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే సమస్య తగ్గుతోంది, కానీ మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. - పురుషోత్తమరావు, మంచిర్యాల చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. * రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. * మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. * వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు : సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కవగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది. చిన్నపిల్లల్లో : తలపై చర్మం జిడ్డుగా, పొరలుగా, ఎర్రటి దద్దుర్లలా కనిపిస్తాయి. దీనినే ‘క్రెడిల్ క్యాప్’ అని అంటారు. ఇది చంకలకు, గజ్జలకు వ్యాపిస్తుంది. వీళ్లలో దురద ఎక్కువగా ఉండకపోవచ్చు. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. * మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను ఉద్యోగం చేస్తుంటాను. చాలాకాలం నుంచి నాకు వేసవి కాలంలో మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ వస్తోంది. ఈ కాలంలోనే మూత్ర విసర్జన సమయంలో మంట, కొద్దికొద్దిగా రావడం, నొప్పి వంటివి వస్తున్నాయి. ప్రతి ఏటా డాక్టర్‌ను ఇలా సంప్రదించడం, మందులు వాడటం పరిపాటిగా మారింది. ఎందుకిలా జరుగుతోంది. దయచేసి కారణాలు వివరించండి. - రాణి, హైదరాబాద్ మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణం ‘ఈ-కొలై’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయట వాతావరణంలోనే ఉంటుంది. ఇది మూత్రవిసర్జన సమయంలో గానీ లేదా సెక్స్ వల్లగాని మూత్రనాళాల్లోకి వెళ్లినప్పుడు కిడ్నీకి సైతం దీనివల్ల అత్యంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇందులో ‘క్లెబ్సియల్లా, ఇంటరోకోకస్ ఫైకలిస్’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేసేవి. యాంటీబయాటిక్స్ లాంటి మందులకు కూడా ఇవి లొంగవు. ఇటీవలి అధ్యయనాల వల్ల 55 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళల్లో 50 శాతం మంది దీని బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు వేసవిలోనే ఎక్కువ కాబట్టి మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేసవిలోనే వస్తుంటాయి. సాధారణంగా మంచినీళ్లు ఎక్కువగా తాగని వారు ఈ కాలంలోనూ అదే ధోరణిని కొనసాగిస్తుంటారు. దాంతో కిడ్నీలకు సరైన మంచినీరు అందక అవి శరీర మలినాలను సరిగా శుద్ధి చేయలేవు. ఫలితంగా ఇన్ఫెక్షన్ పెరుకుపోయి మంట పుట్టడం, నొప్పి రావడంతో పాటు కొద్దికొద్దిగా మూత్రం వస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనికి తోడు శారీరక శ్రమ ఉండటం, పని ఒత్తిడికి లోనై నీళ్లు చాలాసేపు తాగకపోవడం వల్ల మూత్రనాళల్లో ఉన్న మూత్రం అలాగే కొన్ని గంటల పాటు ఉండటంతో బ్యాక్టీరియాకు అవి నివాస కేంద్రాలుగా మారి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంటాయి. మూత్ర సంబంధిత సమస్యలను సాధారణంగా వైద్యులు మందులతోనే తగ్గిస్తుంటారు. మీరు మరోసారి మీ డాక్టర్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. - డా.ఎ.సూరిబాబు -
కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే పక్షవాతం వస్తుందా..?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితం నా కుడికాలికి ఫ్రాక్చర్ అయ్యింది. నా కుటుంబ సభ్యులు నాకు నాటువైద్యం చేయించారు. వాళ్లు నాలుగు నెలల పాటు బ్యాండేజీ వేయించారు. దాంతో ఎలాంటి సమస్యా లేదు. అయితే ఏడాది క్రితం మళ్లీ నా ఎడమకాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్లాను. నాలుగు నెలల క్రితం మళ్లీ అక్కడికి వెళ్లాను. వాళ్లు పూర్తిగా నయమైందని చెబుతున్నారు. కానీ నాకు మోకాలు చాలా బిగుసుపోయినట్లుగా అయిపోయి, విపరీతమైన నొప్పి వస్తోంది. నేను మోకాలు వంచలేకపోతున్నాను. నడవలేకపోతున్నాను. ఈసారి నా చికిత్స ఎందుకు బాగా జరగలేదు. లోపల ఏదైనా ప్రమాదం జరిగిందా? - సుధాకర్, శ్రీకాళహస్తి ఎముకలకు ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. అవి చాలావరకు తమ గాయాలను తామే మాన్పుకుంటాయి. ఎముకలకు ఉండే ఈ లక్షణమే జంతువులకు తోడ్పడుతుంది. అడవిలోని జంతువుల ఎముకలకు గాయాలైనప్పుడు అవి వాటంతట అవే మానుతుంటాయి. ఇక మనుషుల్లో చికిత్స ఎందుకు కావాలంటే... ఎముకలు సరైన పొజిషన్లో ఉండి మానడానికి మీకు వచ్చినట్లే కీళ్ల వద్ద బిగుసుకుపోకూడదని మనం వీలైనంత త్వరగా తమ నార్మల్ దినచర్యలు చేపట్టాలని. నాటువైద్యం జరిగినా, నకిలీవైద్యులు వైద్యం చేసినా ఎముకలు వాటంతట అవే స్వాభావికంగానే నయమయ్యే గుణం వల్ల ఫ్రాక్చర్స్ నార్మల్ అయిపోతుంటాయి. ఇక ఇప్పుడు మీకు అయిన గాయం మానిందా లేదా అని తెలుసుకోడానికి, కీలు బిగుసుకుపోయిన స్థితి మళ్లీ నార్మల్ కావడానికి, మరీ ముఖ్యంగా కీళ్లలో ఏదైనా ఫ్రాక్చర్ అయితే అవి మునుపటిలా తమ నునుపుదనాన్ని మళ్లీ పొందడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మీకు వేసిన బ్యాండేజీ దీర్ఘకాలం పాటు ఉంచడం వల్ల కూడా కీలు బిగుసుకుపోయినట్లుగా అయి ఉండవచ్చు. అది బలహీనపడి ఉండవచ్చు. ఈసారైనా మీరు నాటు వైద్యులను సంప్రదించకుండా వీలైనంత త్వరగా నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, పూర్తిగా శాస్త్రీయపద్ధతుల్లో అన్ని పరీక్షలూ చేయంచి, తగిన చికిత్స తీసుకోండి. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందనే అనిపిస్తోంది. కౌన్సెలింగ్ ఫర్ అడాలసెంట్ గాళ్స్ ప్రాబ్లమ్స్ నా కూతురి వయసు 16 ఏళ్లు. ఆమెకు ముఖమంతా వెంట్రుకలు ఉన్నాయి. అంతేకాదు ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి. ఈ అవాంఛిత రోమాలు, మొటిమల వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఆమె చాలా ఇబ్బంది పడుతోంది. తన గురించి నాకు బెంగగా ఉంది. మాకు సరైన సలహా ఇవ్వండి. - మహేశ్వరి, బెంగళూరు మీరు చెప్పిన అంశాలు మీ అమ్మాయి లాంటి కౌమార ప్రాయంలో ఉన్నవారికి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. మీ అమ్మాయికి పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అన్న అంశాన్ని ముందుగా చూడాలి. తర్వాత ఆమె బరువుపెరుగుతోందా, స్వరంలో మార్పులు వస్తున్నాయా, మాడు మీద జుట్టు రాలుతోందా అన్న అంశాలనూ చూడాలి. ఇవన్నీ వెంటనే జరగాల్సిన పనులు. వీటితో పాటు మీ కుటుంబంలో ఇలాంటి చరిత్ర ఉండా అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆమె ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాల తీవ్రతనూ, అవి వచ్చిన వ్యవధిని బట్టి ఆమె పరిస్థితిని అంచనా వేయవచ్చు. సాధారణంగా టీనేజర్లలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవారిలో సాధారణంగా మొటిమలు వస్తుంటాయి. అయితే చాలా అరుదుగా కనిపించే ఓవరిస్లో నీటి తిత్తులు, అడ్రినల్ గ్రంథుల సమస్యలు కూడా మీరు చెప్పే లక్షణాలను కనబరచవచ్చు. అందుకే మీ అమ్మాయి సమస్య నిర్ధారణ కోసం కొన్ని రక్తపరీక్షలు, స్కానింగ్ పరీక్షలు చేయించాలి. కొన్ని సందర్భాల్లో కేవలం జీవనశైలి మార్పులు, కౌన్సెలింగ్ వంటి చాలా మామూలు అంశాలతోనే పరిస్థితిని చక్కబరచవచ్చు. కొందరిలో వాక్సింగ్, బ్లీచింగ్ వంటి సాధారణ కాస్మటిక్ చికిత్సలే సరిపోతాయి. ఎలక్ట్రోలైసిస్, లేజర్స్ థెరపీతో కూడా అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. ఇక అవసరాన్ని బట్టి హార్మోనల్ చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. కొంతమంది అమ్మాయికి సాధారణ కౌన్సెలింగే సరిపోతోంది. సరైన పరీక్షలతో అవసరమైన చికిత్సతో పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. మూడేళ్ల క్రితం నాకు వివాహం జరిగింది. ప్రస్తుతం నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంతకాలం పాటు మేము పిల్లలు వద్దనుకున్నాం. దానికోసం నేను గత మూడేళ్లుగా కాంట్రసెప్టివ్ పిల్స్‌ను వాడుతున్నాను. అయితే నాకు ఇటీవల తలనొప్పి ఎక్కువగా వస్తోంది. కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నేను ఇటీవల కొన్ని పత్రికల్లో చదివాను. ఈ వార్త చదివినప్పటి నుంచి నాలో ఆందోళన రెట్టింపు అయ్యింది. మా నాన్నగారు కూడా పక్షవాతం కారణంగానే చాలా కాలంగా మంచాన పడ్డారు. దయచేసి దీని గురించి వివరంగా తెలుపగలరు. - మాధవి, వరంగల్ ఎక్కువకాలం కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం అంత మంచిది కాదు. ఒకవేళ వాడాల్సి వచ్చినా పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. ఎక్కువ కాలం ఈ మాత్రలు వాడటం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా పని ఒత్తిడి, కుటుంబపరమైన ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మారుతున్న జీవనశైలి, జంక్ఫుడ్స్, ఒత్తిడి, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కారణాలతో ఎక్కువ మంది మైగ్రేన్, పక్షవాతం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. పక్షవాతం పురుషుల కంటే స్త్రీలలోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటం, రుతుస్రావం, కుటుంబపరమైన ఒత్తిడి, ఉద్యోగాలు చేసే మహిళల్లో పని ఒత్తిడి వంటి కారణాల వల్ల హార్మోన్లలో తేడాలు వస్తుంటాయి. దాంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు సుమారు మూడు సంవత్సరాలుగా కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్నట్లు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నిర్థారించుకోండి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ నాన్నగారికి ఇప్పటికే పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి, విటమిన్ బి12 లోపం వల్ల కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు మధుమేహంగానీ, రక్తపోటు గానీ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. మీ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అధిక బరువు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా నడకగానీ, వ్యాయామంగానీ చేయండి. తాజా ఆకుకూరలు, పండ్లతో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోండి. ఉదయం వేళల్లో కొంత సమయం ఎండలో నడవడానికి ప్రయత్నించండి. సూర్యరశ్మి ద్వారానే డి విటమిన్ లభిస్తుంది. హార్మోన్ల సమతుల్యత కాపాడుకోవడానికి ప్రయత్నించండి.