గుండెపోటును గుర్తించడం ఎలా? | How to recognize a heart attack? | Sakshi
Sakshi News home page

గుండెపోటును గుర్తించడం ఎలా?

Published Thu, Jun 30 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

గుండెపోటును గుర్తించడం ఎలా?

గుండెపోటును గుర్తించడం ఎలా?

కార్డియాలజీ కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. ఈ మధ్యగుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. అంతవరకు ఎటువంటి గుండెజబ్బులూ లేవు. ఇలా ఎందుకు జరిగింది? గుండెపోటును ముందుగా ఎలా గుర్తించగలం?
 - డి.శ్రీహరి, కాకినాడ

 
మీరు చెప్పినదాన్నిబట్టి మీనాన్నగారికి వచ్చిన దాన్ని సడన్ కార్డియాక్ డెత్, సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుగ్గానే ఉండి... హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడుతూ పడిపోవడం... ఆస్పత్రికి తరలించేలోపే మనకు దక్కకుండా పోవడం వంటివి వీటి లక్షణం.

హఠాన్మరణం ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటే...
గతంలో ఒకసారి గుండెపోటు బారినపడినవారు, గుండె కండరం బలహీనంగా ఉన్నవారు, రక్తం పంపింగ్ 35 కంటె తక్కువగా ఉన్నవారు, కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర, గుండెలో విద్యుత్ సమస్యలు (బ్రుగాడా, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ వంటివి) ఉన్నవారు, గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు, ఈ సమస్య ఇప్పటికే ఉన్నవారిలో రావచ్చు. ఎటువంటి గుండెజబ్బూ ఉన్నట్లు తెలియని వారిలోనూ రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే ఈ ఘడియల్లో తగిన విధంగా స్పందిస్తే మృత్యుముఖంలోకి వెళ్లినవారిని కూడా తిరిగి బతికించవచ్చు.
 
హఠాన్మరణాన్ని గుర్తుపట్టేదెలా?
ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా లేదా? శ్వాస తీసుకుంటున్నారా లేదా? గుండె కొట్టుకుంటోందా లేదా అనేది చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే కార్డియాక్ మసాజ్ (సీపీఆర్) ఇవ్వటం తక్షణావసరం. గుండెపోటు వస్తే అత్యవసరంగా యాంజియోప్లాస్టీ, స్టెంట్ పెట్టడం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయటం, పంపింగ్ లోపం ఉంటే దీర్ఘకాలంలో మళ్లీ హఠాన్మరణ పరిస్థితులు తలెత్తకుండా ఏఐసీడీఈ అనే పరికరాన్ని అమర్చటం వంటి చికిత్సలు అందిస్తారు.
 
సీపీఆర్ అంటే..?
ఎవరైనా ఉన్నట్టుండి గుండెపోటుతో విలవిల్లాడుతూ పడిపోతుంటే వెంటనే పడుకోబెట్టడం ముఖ్యం. వెంటనే బాగానే ఉన్నారా? అని ఆరా తీయడం, శ్వాస పీలుస్తున్నారా లేదా? నాడి కొట్టుకుంటోందా లేదా వగైరా విషయాలను గమనించాలి. దానితోబాటు ఛాతీమీద చెవి పెట్టి గుండె కొట్టుకుంటోందో లేదో చూడాలి. ఇవి ఆగిపోతే తక్షణం కార్డియాక్ మసాజ్ చెయ్యటం అవసరం.

ఇది కీలక ఘడియల్లో ప్రాణంపోసే గొప్ప ప్రక్రియ. చాలాదేశాల్లో స్వచ్ఛందంగా అందరికీ దీనిలో తర్ఫీదిస్తారు. గుండె ఆగి మరణించిన వ్యక్తికి క్షణాల్లో ఇది ఆరంభించి.. అంబులెన్స్ వచ్చేవరకూ రక్తప్రసారాన్ని నిలబెట్టగలిగితే దాదాపు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్లమే అవుతాం. అందుకే సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండటం అవసరం.
- డాక్టర్  హేమంత్ కౌకుంట్ల
కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.


ఇంత చిన్న వయ‌సులోనే మోకాళ్ల నొప్పులా?

ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువై చాలా బాధపడుతున్నాను. నేను చాలా రకాల మందులు వాడాను. అయినా సమస్య తగ్గడం లేదు. చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు అస్సలు కదలలేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - మోహన్‌రావు, కరీంనగర్

 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భాగం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
 
ఆర్నెల్ల క్రితం నా చీలమండ బెణికింది. అప్పుడు ప్లాస్టర్ కాస్ట్ వేశారు. ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం గడిచాక కూడా నొప్పి ఎందుకు వస్తోంది.
 - నళిని, రాజమండ్రి

 
మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే తగ్గి కాస్త పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ ఎలాస్టిసిటీని కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు మీ కాలి చీలమండకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయిస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
- డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement