Knees Pains
-
అప్పుడు బెణికిన కాలు ఇప్పటికీ నొప్పి... ఎందుకు?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నేనొక అథ్లెట్‌ను. ప్రాక్టీస్‌లో ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వా కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – శ్రీదేవి, ఖమ్మం మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ ఎలాస్టిసిటీని కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పి నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – సాయి ప్రసాద్, ఏలూరు మీ సమస్యను నిశితంగా పరిశీలించినట్లయితే మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి ఆందోళన పడకుండా మీకు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. మోకాళ్లలో కిలూ బ్రికెంట్స్తో నొప్పి తగ్గుతుందా? నా వయసు 54 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. ఇది క్రమంగా పెరుగుతోంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు వాకబు చేస్తే కాస్త ఎక్కువే ఉంది. అంత ఖరీదైన ఇంజెక్షన్స్‌ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. – కె. గోపాల్‌రావు, నిజామాబాద్ మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేస్తాయి. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని ఒకింత తగ్గిస్తాయి. మిగతా కార్టిలేజ్‌ను బలం పుంజుకునేలా చూస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంద కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి. క్యాల్షియమ్ తీసుకున్నా ఎందుకు నాకీ పరిస్థితి? నా వయసు 54 ఏళ్లు. ఏడేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. రుతుక్రమం ఆగిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని ఎక్కడో చదివి, అప్పట్నుంచి క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎక్స్‌రే తీయించి ఆస్టియోపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది. – రాజేశ్వరి, సికింద్రాబాద్ క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్‌ను ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ చేయరు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్‌ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
ఇంత చిన్నవయసులోనే మోకాళ్ల నొప్పి!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నాకు రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తోంది. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా బాధిస్తోంది. చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలా కావడం నాకు ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతంగా సమస్య వస్తుందా? శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందేమోనని భయంగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి. – మహాదేవ్, కోదాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే... మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించే సాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్ల ఈ సమస్య వస్తూంటుంది. అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్వాటింగ్) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది తాత్కాలికమైన సమస్య. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఇలాంటి సందర్భాల్లో నాటు వైద్యాలు వద్దు..! నా వయసు 42 ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితం నా కుడికాలికి ఫ్రాక్చర్ అయ్యింది. నా కుటుంబ సభ్యులు నాకు నాటువైద్యం చేయించారు. వాళ్లు నాలుగు నెలల పాటు బ్యాండేజీ వేసి ఉంచారు. అప్పుడు ఎలాంటి సమస్యా లేదు. అయితే ఏడాది క్రితం మళ్లీ నా ఎడమకాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఈసారి కూడా నేను అక్కడికే వెళ్లాను. నాలుగు నెలల క్రితం మళ్లీ అక్కడికి వెళ్లాను. వాళ్లు పూర్తిగా నయమైందని చెబుతున్నారు. కానీ నాకు మోకాలు చాలా బిగుసుకుపోయినట్లుగా అయిపోయి, విపరీతమైన నొప్పి వస్తోంది. నేను మోకాలు వంచలేకపోతున్నాను. నడవలేకపోతున్నాను. ఈసారి నా చికిత్స ఎందుకు బాగా జరగలేదు? లోపల ఏదైనా ప్రమాదం జరిగిందా? – ప్రసాదమూర్తి, కర్నూలు ఎముకలకు ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. అవి చాలావరకు తమ గాయాలను తామే మాన్పుకుంటాయి. ఎముకలకు ఉండే ఈ లక్షణమే జంతువులకు తోడ్పడుతుంది. అడవిలోని జంతువుల ఎముకలకు గాయాలైనప్పుడు అవి వాటంతట అవే మానుతుంటాయి. ఇక మనుషుల్లో చికిత్స ఎందుకు కావాలంటే... ∙ఎముకలు సరైన పొజిషన్లో ఉండి మానడానికి ∙మీకు వచ్చినట్లే కీళ్ల వద్ద బిగుసుకుపోకూడదని ∙మనం వీలైనంత త్వరగా తమ నార్మల్ దినచర్యలు చేపట్టాలని. నాటు వెద్యులు వైద్యం చేసినా ఎముకలు వాటంతట అవే స్వాభావికంగానే నయమయ్యే గుణం వల్ల ఫ్రాక్చర్స్ నార్మల్ అయిపోతుంటాయి. ఇక ఇప్పుడు మీకు అయిన గాయం మానిందా లేదా అని తెలుసుకోడానికి, కీలు బిగుసుకుపోయిన స్థితి మళ్లీ నార్మల్ కావడానికి, మరీ ముఖ్యంగా కీళ్లలో ఏదైనా ఫ్రాక్చర్ అయితే అవి మునుపటిలా తమ నునుపుదనాన్ని మళ్లీ పొందడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మీకు వేసిన బ్యాండేజీ దీర్ఘకాలం పాటు ఉంచడం వల్ల కూడా కీలు బిగుసుకు పోయినట్లుగా అయి ఉండవచ్చు. అది బలహీనపడి ఉండవచ్చు. ఈసారైనా మీరు నాటువైద్యులను సంప్రదించకుండా వీలైనంత త్వరగా నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, పూర్తిగా శాస్త్రీయపద్ధతుల్లో అన్ని పరీక్షలూ చేయించి, తగిన చికిత్స తీసుకోండి. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందనే అనిపిస్తోంది. ఎత్తు పెంచుతామనే ప్రకటనలను నమ్మకండి నా వయసు 22 ఏళ్లు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు మాత్రమే. ఫ్రెండ్స్ మధ్యన పొట్టిగా కనిపిస్తున్నాను. దాంతో ఎంతో ఆత్మన్యూనతకు గురవుతున్నాను. ఎలాగైనా పొడవు పెరగాలన్నది నా ఉద్దేశం. ఎత్తు పెంచే అడ్వరై్టజ్మెంట్లు చూస్తున్నాను. ఆ ప్రకటనల్లో చూపించే మందులు వాడితే ఎత్తు పెరుగుతానా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.– నిశాంత్, నరసరావుపేట మీ వయసులో ఉన్న వారి ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. ఐదడుగుల నాలుగు అంగుళాలంటే మీరు రీజనబుల్ ఎత్తు పెరిగినట్లే లెక్క. మీకంటే చాలా మంది పొట్టిగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి పొడవుకు సంబంధించిన జన్యువులు వస్తాయి. అయినప్పటికీ ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రుల ఎత్తు కాకుండా తాతముత్తాతల ఎత్తు కూడా పిల్లలకు రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మామూలు ఎత్తులో ఉన్నా తాతముత్తాతల పొట్టిదనం లేదా ఒడ్డూ పొడవూ పిల్లలకు రావచ్చు. ఇక దాంతోపాటు తినే ఆహారంలోని పోషకాలూ పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేసే విషయం వాస్తవమే. అయితే ఎముకల చివర్లలో ఉండే గ్రోత్ ప్లేట్లలో పొడుగు పెరిగే అంశం వాళ్ల పదహారేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వయసులో ఆగిపోతుంది. మీరు నాలుగేళ్ల కిందటే ఆ వయసు దాటిపోయారు కాబట్టి దీని గురించి ఆలోచించకండి.ఎత్తు పెంచుతామంటూ వచ్చే ప్రకటనల్లో కేవలం వాణిజ్యపరమైన ఉత్పాదనలే. వాటితో ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. వాటితో ఎత్తూ పెరగలేరు. ప్రకృతిపరంగా మీరు ఇప్పుడున్న ఎత్తు భారతీయ ప్రమాణాల ప్రకారం ఏమంత తక్కువ కాదు కాబట్టి, ఇప్పుడు మీరు మంచి కెరియర్ గురించి ఆలోచించండి. ఎత్తు పెరగడం గురించి కాదు... వాణిజ్య ప్రకటనలు చూసి మోసపోకండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
గుండెపోటును గుర్తించడం ఎలా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. ఈ మధ్యగుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. అంతవరకు ఎటువంటి గుండెజబ్బులూ లేవు. ఇలా ఎందుకు జరిగింది? గుండెపోటును ముందుగా ఎలా గుర్తించగలం? - డి.శ్రీహరి, కాకినాడ మీరు చెప్పినదాన్నిబట్టి మీనాన్నగారికి వచ్చిన దాన్ని సడన్ కార్డియాక్ డెత్, సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుగ్గానే ఉండి... హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడుతూ పడిపోవడం... ఆస్పత్రికి తరలించేలోపే మనకు దక్కకుండా పోవడం వంటివి వీటి లక్షణం. హఠాన్మరణం ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటే... గతంలో ఒకసారి గుండెపోటు బారినపడినవారు, గుండె కండరం బలహీనంగా ఉన్నవారు, రక్తం పంపింగ్ 35 కంటె తక్కువగా ఉన్నవారు, కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర, గుండెలో విద్యుత్ సమస్యలు (బ్రుగాడా, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ వంటివి) ఉన్నవారు, గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు, ఈ సమస్య ఇప్పటికే ఉన్నవారిలో రావచ్చు. ఎటువంటి గుండెజబ్బూ ఉన్నట్లు తెలియని వారిలోనూ రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే ఈ ఘడియల్లో తగిన విధంగా స్పందిస్తే మృత్యుముఖంలోకి వెళ్లినవారిని కూడా తిరిగి బతికించవచ్చు. హఠాన్మరణాన్ని గుర్తుపట్టేదెలా? ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా లేదా? శ్వాస తీసుకుంటున్నారా లేదా? గుండె కొట్టుకుంటోందా లేదా అనేది చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే కార్డియాక్ మసాజ్ (సీపీఆర్) ఇవ్వటం తక్షణావసరం. గుండెపోటు వస్తే అత్యవసరంగా యాంజియోప్లాస్టీ, స్టెంట్ పెట్టడం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయటం, పంపింగ్ లోపం ఉంటే దీర్ఘకాలంలో మళ్లీ హఠాన్మరణ పరిస్థితులు తలెత్తకుండా ఏఐసీడీఈ అనే పరికరాన్ని అమర్చటం వంటి చికిత్సలు అందిస్తారు. సీపీఆర్ అంటే..? ఎవరైనా ఉన్నట్టుండి గుండెపోటుతో విలవిల్లాడుతూ పడిపోతుంటే వెంటనే పడుకోబెట్టడం ముఖ్యం. వెంటనే బాగానే ఉన్నారా? అని ఆరా తీయడం, శ్వాస పీలుస్తున్నారా లేదా? నాడి కొట్టుకుంటోందా లేదా వగైరా విషయాలను గమనించాలి. దానితోబాటు ఛాతీమీద చెవి పెట్టి గుండె కొట్టుకుంటోందో లేదో చూడాలి. ఇవి ఆగిపోతే తక్షణం కార్డియాక్ మసాజ్ చెయ్యటం అవసరం. ఇది కీలక ఘడియల్లో ప్రాణంపోసే గొప్ప ప్రక్రియ. చాలాదేశాల్లో స్వచ్ఛందంగా అందరికీ దీనిలో తర్ఫీదిస్తారు. గుండె ఆగి మరణించిన వ్యక్తికి క్షణాల్లో ఇది ఆరంభించి.. అంబులెన్స్ వచ్చేవరకూ రక్తప్రసారాన్ని నిలబెట్టగలిగితే దాదాపు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్లమే అవుతాం. అందుకే సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండటం అవసరం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. ఇంత చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులా? ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువై చాలా బాధపడుతున్నాను. నేను చాలా రకాల మందులు వాడాను. అయినా సమస్య తగ్గడం లేదు. చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు అస్సలు కదలలేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్‌రావు, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భాగం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఆర్నెల్ల క్రితం నా చీలమండ బెణికింది. అప్పుడు ప్లాస్టర్ కాస్ట్ వేశారు. ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం గడిచాక కూడా నొప్పి ఎందుకు వస్తోంది. - నళిని, రాజమండ్రి మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే తగ్గి కాస్త పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ ఎలాస్టిసిటీని కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు మీ కాలి చీలమండకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయిస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మ్యాక్స్‌క్యూర్ వైద్యుల ఘనత
* విజయవంతంగా మోకాలి చిప్పల మార్పిడి * సర్జరీ పూర్తికాగానే నడక ప్రారంభించిన పేషెంట్ హైదరాబాద్: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కంప్యూటర్ అసిస్టెడ్ నావి గేషన్ సిస్టంతో శస్త్ర చికిత్స చేసి 3 గంటల వ్యవధిలోనే పేషెంట్ నడిచేలా చేశారు. వనస్థలిపురానికి చెందిన మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సభ్యుడు పి.సుధాకర్‌రావు (74) ఏడాదిన్నర నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం పలువురు వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. మందులు వాడితే నొప్పి తగ్గకపోగా మరింత పెరిగింది. దీంతో ఇటీవల మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలోని ప్రముఖ హిప్ అండ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణకిరణ్‌ను ఆయన సంప్రదించారు. సుధాకర్‌రావుకు సిటీస్కాన్ తీయించగా రెండు మోకాలి చిప్పల మధ్యలోని కార్టిలేజ్ (గుజ్జు) పూర్తిగా అరిగిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యులు ఆయనకు సూచించారు. గత శుక్రవారం ఉదయం కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ సిస్టంతో సుధాకర్‌రావుకు శస్త్రచికిత్స ప్రారంభించారు. చిన్న గాటుతో మోకాలి చిప్పల చుట్టూ ఉన్న కండరాన్ని కత్తిరించకుండా అరిగిపోయిన చిప్పలను తొలగిం చారు. వాటి స్థానంలో కృత్రిమ మోకాలి చిప్పలను విజయవంతంగా అమర్చారు. శస్త్ర చికిత్స చేసిన 3 గంటల వ్యవధిలోనే 74 ఏళ్ల సుధాకర్‌రావు ఎవరి సహాయం లేకుండా బెడ్ మీద నుంచి లేచి నడవడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణకిరణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ సిస్టంతో సర్జరీ చేయడం వల్ల రక్తస్రావం లేకుండా, తక్కువ నొప్పితో చికిత్స చేయవచ్చని తెలిపారు.