ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నేనొక అథ్లెట్‌ను. ప్రాక్టీస్‌లో ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వా కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – శ్రీదేవి, ఖమ్మం
మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ ఎలాస్టిసిటీని కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా
చూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంత చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పి
నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – సాయి ప్రసాద్, ఏలూరు
మీ సమస్యను నిశితంగా పరిశీలించినట్లయితే మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి ఆందోళన పడకుండా మీకు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
మోకాళ్లలో కిలూ బ్రికెంట్స్‌తో నొప్పి తగ్గుతుందా?
నా వయసు 54 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. ఇది క్రమంగా పెరుగుతోంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు వాకబు చేస్తే కాస్త ఎక్కువే ఉంది. అంత ఖరీదైన ఇంజెక్షన్స్‌ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి.
– కె. గోపాల్‌రావు, నిజామాబాద్
మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేస్తాయి. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని ఒకింత తగ్గిస్తాయి. మిగతా కార్టిలేజ్‌ను బలం పుంజుకునేలా చూస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంద కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి.
క్యాల్షియమ్ తీసుకున్నా ఎందుకు నాకీ పరిస్థితి?
నా వయసు 54 ఏళ్లు. ఏడేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. రుతుక్రమం ఆగిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని ఎక్కడో చదివి, అప్పట్నుంచి క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎక్స్‌రే తీయించి ఆస్టియోపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది. – రాజేశ్వరి, సికింద్రాబాద్
క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్‌ను ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ చేయరు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్‌ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment