ఆయుర్వేద కౌన్సెలింగ్
ఆయుర్వేద మార్గంలో గుండె జబ్బుల నివారణ ఎలాగో సూచించగలరు.
- సంకా పవన్‌కుమార్, తెనాలి
ఆయుర్వేద శాస్త్ర ప్రాథమిక సిద్ధాంతాలలో శరీర నిర్మాణం, శరీర క్రియ అత్యంత ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వివిధ అంగప్రత్యంగాలను విశదీకరించడంలో సుశ్రుతాచార్యులు అగ్రగామి. హృదయం ఆకారాన్ని ‘అధోముఖపుండరీకం’ (తామరపువ్వుని తలకిందులుగా చేస్తే కనపడే రూపం)తో పోల్చిచెప్పాడు. సంస్కృత శబ్ద నిరుక్తుల విశిష్టత ప్రకారం ‘హృ’ అంటే పుచ్చుకునేది (రక్తాన్ని) ‘ద’ అంటే ఇచ్చేది (రక్తాసరఫరా), ‘య’ అంటే నిలిపేది (రక్తాగారం). ఆ విధంగా ఆ భాగం క్రియావిశేషం ద్యోతకమవుతోంది. ఆయుర్వేద పరిభాషలో ‘మర్మ’ అంటే అత్యంత కీలకమైన ప్రాంతం అని అర్థం. చరకాచార్యులవారు ‘త్రిమర్మలు’ వివరించారు.
అవి ‘శిరస్సు, హృదయం, వస్తి’ (మూత్రాశయం). ఆ విధంగా గుండెకు ఎంతో ప్రాధాన్యముంది. గుండెకండరం పోషణ కోసం రక్తం కావాలి. అది, గుండె సంకోచించినప్పుడు, మొదటి శాఖ అయిన ‘కరొనరీ’ ధమని ద్వారా చేరవలసిందే. గుండె పొరలు, కవాటాలు, నాడులు, సిరాధమనుల కార్యక్రమం చక్కగా ఉండటానికి ‘రస’ధాతువు ఉపకరిస్తుంది. దీని ద్వారా పోషకాలు, అంబరపీయూషం (ఆక్సిజన్) అందుతాయి. అలాంటి సరధాతువు ‘సారం’ మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. గుండెజబ్బుల నివారణకు ఈ కింద సూచించిన ఆహార, విహారాలు, ఔషధాలు అత్యంత ప్రధానమైనవి.
ఆహారం : సాత్వికాహారమైన శాకాహారం మంచిది.
ఉప్పు, పులుపు, కారాలు చాలా మితంగా తినాలి. తగినంత ద్రవాహారం (కొబ్బరినీళ్లు, చెరకురసం, బార్లీ జావ మొదలైనవి) సేవించాలి. మొలకలు, ఆకుకూరలు, ఇతర కందమూలాలు, తాజాపండ్లు, శుష్కఫలాలు అనునిత్యం తగుప్రమాణంలో తినాలి. అప్పుడే సమీకృత పోషకాలు లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, మజ్జిగలు ‘ఆవు’ నుంచి లభించేవి చాలా బలకరం. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే బయటి పదార్థాల జోలికి వెళ్లకండి.
విహారం : రాత్రి నిద్ర కనీసం ఎనిమిది గంటలుండాలి. వయసు, వృత్తిని బట్టి తగురీతిని వ్యాయామం చేయాలి. పొగతాగడం, మద్యపానాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
మానసిక ఉల్లాసం, ప్రశాంతత, సానుకూల ఆశావహ దృక్పథం చాలా అవసరం. శోక చింతా భయ రాగ ద్వేషాలకు దూరంగా ఉండాలి.
ఔషధాలు : నిత్య దైనందిన కార్యక్రమాలలో భాగంగా సూర్యదర్శనం చేసుకోవాలి. లేత సూర్యకిరణాల వల్ల మనకెంతో ఆరోగ్యమని శాస్త్రం చెప్పింది. రోజూ ఐదు తులసి ఆకులు నమిలి మింగాలి. దీనికి రక్తం గడ్డకట్టకుండా ఉంచే శక్తి ఉంది. క్రిమిహరం, కఫహరం కూడా. సూర్యనమస్కార యోగ క్రియల వల్ల, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
అల్లం, వెల్లుల్లి కషాయం : 5 చెంచాలు రోజు విడిచి రోజు తాగితే కొలెస్త్రాల్, ఇతర కొవ్వులు రక్తాన్ని పాడుచేయవు. బీపీ ఎక్కువ కాకుండా నివారితమవుతుంది.
త్రిఫలా చూర్ణం : ఒక చెంచా ప్రతి రాత్రి నీటితో సేవిస్తే సప్త ధాతువులకు బలం. మహాకోష్ఠం శుద్ధి అవుతుంది. రోజూ విరేచనం సాఫీగా అవుతుంది. అర్జున (తెల్లమద్ది) వృక్షపు కాండం మీది పట్టను (బెరడు) ఎండబెట్టి, చూర్ణం చేసి, ఒక చెంచా చూర్ణాన్ని ఆవుపాలలో మరిగించి, వడగట్టి ప్రతిరోజూ తాగితే గుండె ధమనుల్లో రక్తప్రసరణ బహుచక్కగా ఉండి, గుండె కండరానికి బలం పెంపొంది గుండెజబ్బులు దరిచేరవు. దీన్ని ‘అర్జున క్షీరపాకం’ అంటారు. అత్యవసర పరిస్థితి లేనప్పుడు స్టెంట్స్ వేయించుకున్న వారు దీన్ని ఆరుమాసాలు సేవించి, పరిస్థితిని సమీక్షించుకుంటే చక్కటి మార్పు కనిపిస్తుంది. పుష్కర మూల చూర్ణాన్ని (ఒక చెంచా) నీళ్లతో సేవిస్తే దాదాపు పైన చెప్పిన ఫలితం కనిపిస్తుంది.
ఇతర ఔషధాలు : హృదయార్ణవరస (మాత్రలు) నాగార్జునాభ్రరస (మాత్రలు) ప్రభాకరవటి (మాత్రలు)
గమనిక : ఈ మందుల గురించి ఆయుర్వేద వైద్యుని సంప్రదించాకే వాడాలి.
- డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
గుండెజబ్బుల నివారణకోసం...
Published Sat, Oct 1 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement
Advertisement