కురుపులు తగ్గినా బాధించే నొప్పి! | Despite excruciating pain, ulcers! | Sakshi
Sakshi News home page

కురుపులు తగ్గినా బాధించే నొప్పి!

Published Fri, Feb 5 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

Despite excruciating pain, ulcers!

ఆయుర్వేద కౌన్సెలింగ్
 
 పచ్చకామెర్లకు ఆయుర్వేదంలో చికిత్స, నివారణ వివరించండి.
 - పద్మజాలక్ష్మి, సికింద్రాబాద్

 ఈ వ్యాధిని ఆయుర్వేదశాస్త్రకారులు ‘కామలా’ అని వివరించారు. ఆధునికంగా ‘జాండిస్ లేక ఇక్టెరస్’ అంటారు.
 లక్షణాలు: కళ్లు, మూత్రం పసుపుపచ్చగా ఉంటాయి. వ్యాధి ముదురుతున్న కొద్దీ గోళ్లు, చర్మం, ముఖం పసుపుపచ్చగా మారతాయి. ఆకలి సన్నగిల్లడం, అరుచి, మందజ్వరం, వాంతి, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. దీనిని ‘కోష్ఠాశ్రీతకామలా’ అని చెప్పారు. దీనికి తోడు పొట్ట ఉబ్బరించినట్లయితే ‘కుంభకామలా’ అని పేర్కొంటారు. మలం తెలుపునలుపు మిశ్రమవర్ణంలో, అంటే పిండిలా ఉండి, కామలా లక్షణాలు తీవ్రంగా ఉంటే దానిని ‘శాఖాశ్రీతకామలా’ అని చెప్పారు. దీనికి కారణం ‘పిత్తం’ (బైల్) కోష్ఠంలోకి చేరడం. దీన్ని ఆధునికంగా అబ్‌స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. మరో రకం జాండిస్... రక్తకణాలు ఎక్కువగా ధ్వంసం కావడం వల్ల సంభవిస్తుంది. ఈ భేదాల్ని బట్టి చికిత్స మారుతుంది.

కారణాలు: ఆహార పదార్థాలు కలుషితం కావడం.

చికిత్స: ఆయుర్వేదంలో కొన్నిరకాల మూలికలను సూచించినా అవి చికిత్సలో ఒక భాగం మాత్రమే. ఇది కేవలం ఇన్ఫెక్షన్‌ల వల్ల వచ్చే కామల చికిత్సకు మాత్రమే ఉపకరిస్తుంది. భూమ్యామలకి (నేర ఉసిరిక), భృంగరాజ (గుంటగలగర), గుడూచి (తిప్పతీగె), కాలమేఘ (మురుపిండి ) మొదలైన వాటిల్లో ఏదైనా ఒకదాని ఆకుల రసం తీసి వయసును బట్టి పావుచెంచా నుంచి మూడు చెంచాల వరకు తేనెతో కలిపి, రోజుకి రెండుపూటలా ఓ పదిరోజుల పాటు సేవించాలి.

చూర్ణాలు: కటుకరోహిణ, పసుపు, ఉసిరికాయ మొదలైనవి అరగ్రాము నుంచి రెండు గ్రాముల వరకు తేనెతో రోజుకి రెండుసార్లు.
 
మాత్రలు: ఆరోగ్యవర్ధనీవటి ఉదయం 1, రాత్రి 1, నిరోసిల్: ఉదయం1, రాత్రి 1.
పథ్యం:  వ్యాధి ఆరంభమైన ఓ వారం, పదిరోజుల వరకు నూనెపదార్థాలు, మసాలాలు, పులుపు, కారం, ఉప్పు నిషిద్ధం. కేవలం పెరుగు లేదా మజ్జిగ అన్నం మాత్రమే తినాలి.  ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి. అనగా మరిగించి చల్లార్చిన నీరు, మజ్జిగ, బార్లీ, కొబ్బరినీళ్లు, పరిశుభ్రమైన చెరకుసరం, గ్లూకోజ్ మొదలైనవి.  సాఫీగా విరేచనం కావాలి. ‘త్రిఫలాచూర్ణం’ 1 చెంచా రాత్రి వేడినీళ్లలో తాగాలి.
 జాగ్రత్తలు: బయటి పదార్థాలు తినకూడదు, తాగకూడదు, కల్తీ ఆహారాలను గమనిస్తూ, వాటిని విసర్జించాలి. వ్యాధి కారణాల్ని గుర్తుంచుకొని, వాటిని దూరంగా ఉండటం నివారణకూ ముఖ్యం. ఉదా: మద్యం, పొగతాగడం, కాలేయం చేసే పనులను దెబ్బతీసే ఔషధాలు తీసుకోకపోవడం, ఉప్పు, నూనె పదార్థాలు, కొవ్వు అతిగా తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
 
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్
హుమాయూన్‌నగర్, హైదరాబాద్
 
న్యూరాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 45 ఏళ్లు. నాకు పదిరోజుల కింద నడుముకు ఒక పక్క కురుపులు వచ్చాయి. బాగా నొప్పి వచ్చింది. పదిరోజులకు మాడిపోయాయి. అయితే ఇప్పుడు కూడా బాగా నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
 - ఈ.ఎస్., కర్నూలు

 మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో, రోగి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది రావచ్చు. జబ్బు వచ్చినప్పుడు ఎసెక్లోవిర్ అనే ట్యాబ్లెట్లు వాడటంతో కురుపులు తగ్గిపోతాయి. ఇలా వాడని వారిలో కురుపులు వచ్చి మానిపోయాక భరించలేని నొప్పి వస్తుంది. దీనినే వైద్యపరిభాషలో హెర్పెటిక్ న్యూరాల్జియా అంటారు. దీన్ని రెండు, మూడు రకాల మందులతో అదుపు చేయవచ్చు. మీరు డాక్టర్‌కు చూపించుకోండి. వారు మీ వయసును బట్టి, బరువును బట్టి మందులు సూచిస్తారు. వాటిని తీసుకుంటే మీ నొప్పి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.
 
నా వయసు 30 ఏళ్లు. నాకు ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. తలకు కుట్లు పడ్డాయి. మెదడు స్కానింగ్ చేయిస్తే, ఎముక ఫ్రాక్చర్ అయినట్లు రిపోర్ట్ వచ్చింది. మెదడులో రక్తస్రావం కూడా జరిగింది. అప్పటి నుంచి ఏడాదికి ఒకసారి ఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇవి తగ్గే మార్గం లేదా?
 - కిశోర్, ఈ-మెయిల్

 తలకు దెబ్బ తగిలిన వారిలో రక్తస్రావం వల్ల, ఎముక ఫ్రాక్చర్ కావడం వల్ల మెదడులోని కణాలలో మార్పులు చోటుచేసుకుంటాయయి. ఫలితంగా ఆ కణాల నుంచి అవసరాని కంటే ఎక్కువగా విద్యుత్తు ఉత్పత్తి జరిగి ఫిట్స్ వస్తాయి. ఈ సమస్య వచ్చిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి దెబ్బ తగిలినప్పుడు ఫిట్స్ వచ్చి, స్కానింగ్ నార్మల్‌గా ఉంటుంది. అలాంటివారు కొన్ని నెలలపాటు మందులు వాడితే సరిపోతుంది. మీరు డాక్టర్‌కు చూపించుకొని, స్కానింగ్ రిపోర్టును బట్టి మందులు వాడాల్సి ఉంటుంది.
 
డాక్టర్ మురళీధర్ రెడ్డి
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
 
పల్మనాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 40. గతంలో డస్ట్ అలర్జీ ఉండేది. నా ఫ్రెండ్స్ కొందరు వింటర్‌లో వ్యాయామాలు చేస్తుంటే నేను వారితో పాటు ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టాను. కానీ వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - చంద్రశేఖర్, కోదాడ

వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపిస్తుంది  అందుకే దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఇది కనిపిస్తుంటుంది. మనం శ్వాస తీసుకునే సమయంలోనే  బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సమకూర్చుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారు. దాంతో గాలి వెళ్లే మార్గాలు ఒక్కసారిగా ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోని దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి...  పొడి దగ్గు వస్తుండటం  ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం  పిల్లికూతలు వినిపించడం  వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు)  వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం  కారణంగా వ్యాయాయాన్ని ఆపాల్సిన పని లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా-2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత పరిమితం సమయంలో వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు.
 
డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్
కిమ్స్ హాస్పిటల్
సికింద్రాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement