ఎయిడ్స్ పీడ బయటపడ్డ తొలినాళ్లలో తీవ్రమైన అనారోగ్యం, దారుణంగా క్షీణించి కదిలే కంకాళాల్లా ఉండే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. దాంతో ఎయిడ్స్ జబ్బు అంతరించి పోయిందేమో అనే అపోహ ప్రజల్లో ఏర్పడింది. అయితే, వాస్తవం మాత్రం పూర్తిగా అందుకు విరుద్ధం. ఇటీవలి కోవిడ్ రోజుల తర్వాత నుంచి హెచ్‌ఐవి వ్యాప్తి మళ్లీ పెరిగింది. దాంతో... నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగానైనా మరోమారి ఈ అంశంపై చర్చ జరగాల్సిన నేపథ్యంలో ఈ కథనం.
తాజా లెక్కల ప్రకారం 2023 డిసెంబరు నాటికి 25 లక్షల మంది హెచ్‌ఐవి రోగులతో ప్రపంచంలోనే భారతదేశం రెండవ స్థానంలో వుంది. భారతీయ జనాభాలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కేవలం ఆరు శాతమే అయినా... దేశంలోని హెచ్‌ఐవి బాధితుల్లో మాత్రం 20% మంది తెలుగువారే. అంటే... మన దేశంలోని ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు తెలుగు వ్యక్తి కావడం విషాదం.
వ్యాప్తికి కారణాలు...
ఎయిడ్స్, హెచ్‌ఐవీ మూడు విధాలుగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అవి... .
లైంగిక చర్యతో పురుషుల వీర్యం, స్త్రీ జననేంద్రియ స్రావాలు కలవడం
రక్తంలో రక్తం కలవడం అంటే ఎయిడ్స్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారి రక్తం ఆరోగ్యకరమైన వారి రక్తంతో కలవడం .
బాధితురాలైన మహిళ నుంచి బిడ్డకు.
నివారణ...
చాలా వైరస్ జబ్బుల్లాగే చాలాకాలం పాటు దీనికీ నిర్దిష్టమైన చికిత్స లేదు. అయితే ఇప్పుడు చికిత్స అందుబాటులో ఉంది. కానీ అసలు ఎయిడ్స్‌కు గురై మందులతో జబ్బును అదుపులో ఉంచుకోవడం కంటే నివారణ చాలా మేలు. ఇది మూడు రకాలుగా వ్యాపిస్తుందని తెలుసు కాబట్టి ఆ మూడు అంశాలకు సంబంధించిన నివారణ మార్గాలు అవలంబిస్తే దీన్నుంచి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న వ్యాప్తి కారణాలను బట్టి తీసుకోవాల్సిన నివారణ చర్యలివి...
లైంగిక చర్యతో వ్యాప్తి చెందుతుంది కాబట్టి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. పార్ట్‌నర్‌తో నమ్మకంగా వ్యవహరించాలి. సెక్స్‌లో పురుషులు తప్పనిసరిగా కండోమ్ వాడకం వాడాలి. మహిళలకు కొన్ని దేశాలలో ఫిమేల్ కండోమ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మద్యం మత్తులో కండోమ్ లేకుండా నిర్లక్ష్యంగా లైంగిక
చర్యకు పాల్పడే ప్రమాదం ఉన్నందున మద్యానికి దూరంగా ఉండటం చాలా అవసరం.
రక్తంతో రక్తం కలవడం వల్ల ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందన్న అంశాన్ని గుర్తుంచుకుని ఒక నీడిల్ ఒకరికే పరిమితం చేయాలి. ఇక మాదక ద్రవ్యాలు వాడేవారు మత్తులో ఒకరు వాడిన సిరంజ్‌లే మరొకరు వాడితే... ఎయిడ్స్ వ్యాప్తిచెందుతుందన్న అంశాన్ని గుర్తుపెట్టుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
ఇక తల్లి నుంచి బిడ్డకు అనేది సాధారణంగా భర్త కారణంగా భార్యకూ... ఆమెకు జబ్బు విషయం తెలియక... తీరా గర్భవతి అయ్యాక... తన తప్పేమీ లేకుండానే బిడ్డకు సంక్రమింప జేయడంతో అమాయకపు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇలా ఈ వ్యాధి బారిన పడ్డ తల్లుల నుంచి చిన్నారులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా (ప్రొఫిలాక్సిస్ చికిత్సగా) నివరపైన్ అనే నోటి ద్వారా ఇచ్చే మందు లేదా ఇంజెక్షన్‌ను తల్లికి ఇస్తారు. అలాగే బిడ్డ పుట్టాక అవసరాన్ని బట్టి ఆ చిన్నారికీ ఈ మందునిస్తారు.
సాధారణ వ్యాప్తి మార్గాలకు ఇవీ నివారణలు. దీనికి తోడు అత్యంత వివక్షకు గురయ్యే ట్రాన్స్ జెండర్, గే, సెక్స్ వర్కర్లకు ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా, వారిలో చైతన్యం పెరిగేలా హెచ్‌ఐవి నివారణ కార్యక్రమాలను రూపొందించాలి.
చికిత్స...
చికిత్సకు ముందుగా అసలు ఎయిడ్స్ అంటే ఏమిటి, హెచ్‌ఐవీ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్‌ను హెచ్‌ఐవీగా... అంటే ఆ సంక్షిప్త అక్షరాలను విడమరిస్తే ‘హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్’గా చెబుతారు. హెచ్‌ఐవీ వైరస్ సోకాక... మానవుల్లో సహజంగా ఉండే వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) నశిస్తుంది. దాంతో చాలా మామూలు జబ్బు బారిన పడ్డా...అది ఎప్పటికీ నయం కాకుండా, దానివల్లనే మరణించే ప్రమాదం ఉంటుంది.
ఈ జబ్బును కలిగించే వైరస్‌ను హెచ్‌ఐవీ అంటారు. ఇక హెచ్‌ఐవీ సోకగానే వ్యాధి బయటకు కనిపించదు. క్రమంగా వ్యాధి నిరోధక కణాలన్నీ నశిస్తూ ΄ోవడం వల్ల... ఒక దశ తర్వాత ఏ చిన్న ఇన్ఫెక్షన్ సోకినా అది నయం కాని స్థితి వస్తుంది. ఆ కండిషన్‌నే ఎయిడ్స్ అంటారు.
హెచ్‌ఐవి / ఎయిడ్స్ జబ్బు జీవితకాలపు వ్యాధి. ఒకసారి జబ్బు బారిన పడ్డవాళ్ల జీవితమంతా ఇక మందులు వాడాల్సే ఉంటుంది. పైగా అవి ఖరీదైనవి. యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అని పిలిచే ఆ మందులను వాడుతూ, హెచ్‌ఐవీని అదుపులో పెట్టుకుంటూ ఉండటమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స.
హెచ్‌ఐవి – ఎయిడ్స్ జబ్బుకి పెద్ద ఎత్తున మందులు అందుబాటులోకి రావడం, ప్రభుత్వ వైద్యశాలలలో వీటిని ఉచితంగా అందజేయడంవల్ల ప్రస్తుతం చాలామంది వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దాదాపు సాధారణ మానవుల పూర్తికాల ఆయుర్దాయంతోనే వీళ్లూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
డా. యనమదల మురళీకృష్ణ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు
(చదవండి: కోడిపుంజులాంటి హోటల్..! )
Comments
Please login to add a commentAdd a comment