హెచ్‌ఐవీ భూతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. మందు లేని ఈ మాయరోగానికి నిండు జీవితాలు బలైపోతున్నాయి. అవగాహనా లోపం, నిర్లక్ష్యం మూలంగా కొందరు వ్యక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండంతో వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి. హెచ్‌ఐవీపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే ఉద్ధేశంతో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు.
హెచ్‌ఐవీని ఇలా గుర్తించొచ్చు
►హెచ్‌ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)ను గుర్తించడానికి ఏఆర్‌టీ సెంటర్‌లో కొంబెడ్స్, ట్రై లైన్, ట్రై స్పాట్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో పాజిటివ్ వచ్చినట్లయితే హెచ్‌ఐవీగా నిర్ధారిస్తారు.
►దీర్ఘకాల వీరోచనాలు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పి ఎక్కు వరోజులు ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలి
►నెల రోజుల్లో శరీర బరువులో 10 శాతం తగ్గినా, నెల రోజులకు మించి జ్వరం, విరేచనాలు బాధించినా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలి
►సీడీ- 4 టెస్ట్‌లో తెల్ల రక్తకణాల సంఖ్య 350 కంటే తక్కువగా ఉంటే వారికి జీవిత కాలం పాటు ప్రతి నెల ఉచితంగా ఏఆర్‌టీ సెంటర్‌లో మందులు అందిస్తారు.
ఏబీసీ సూత్రం పాటించాలి
ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏబీసీ సూత్రాన్ని పాటించాలి. ఎ-ఎబ్‌స్టెన్సెస్(వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం), బి-బీ ఫెయిత్ ఫుల్ టూ లైఫ్ పార్టనర్(వివాహ జీవితంలో భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి). సీ- కాన్సిస్టెంట్ కరెక్ట్ యూజ్ ఆఫ్ కండోమ్( సరైన విధంగా ఎల్లప్పుడూ కండోమ్ వాడటం). ఈ మూడు సూత్రాలపై స్వచ్చంద సంస్థల సహాకారంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
అప్రమత్తతే ముఖ్యం
హెచ్‌ఐవీ వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది. ముఖ్యంగా విశృంఖల శృంగారం.. ఒకరికంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాలతో ఎక్కువగా ఎయిడ్స్ బారిన పడుతున్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఉన్న వారి రక్తం ఇతరులకు ఎక్కించడం వల్ల, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజీల వల్ల ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఎయిడ్స్ రోగులు వినియోగించిన బ్లేడ్లు వాడడం వల్ల కూడా సంక్రమిస్తుంది. హెచ్‌ఐవీ సోకితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. ఆరోగ్యం క్షీణించినప్పుడు.. సీ డీ 4 పరీక్షలో కణాల సంఖ్య 200 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎయిడ్స్‌గా పరిగణిస్తారు. సెలూన్లలో కొత్త బ్లేడ్ వాడేలా చూసుకోవాలి. శారీరక సంబంధాల నియంత్రణ, ఇతర స్వీయ జాగ్రత్తలతో ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. సమాజాభివృద్ధికి నిరోధకంగా నిలుస్తున్న ఇటువంటి రుగ్మతలపై ప్రజానీకంలో విస్తృత అవగాహన కల్పించటంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. 2002లో 2.25 శాతం ఉన్న హెచ్‌ఐవీ వ్యాప్తి 2020 నాటికి 0.22 శాతంకు తగ్గింది. జిల్లాలో ప్రస్తుతం 21,332 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, మచిలీపట్నం, గుడివాడలో ఎక్కువగా హెచ్‌ఐవీ కేసులు బయటపడుతున్నాయి. ఈ ప్రాంతాలపై ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
పాజిటివ్ రేటు తగ్గించేలా..
పాజిటివ్ రేటు తగ్గించే క్రమంలో బాధితులను సకాలంలో గుర్తించేలా హెచ్‌ఐవీ పరీక్షలను వేగవంతం చేశారు. జిల్లాలో 18 హెచ్‌ఐవీ నిర్ధారణ కేంద్రాలు, 164 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజానీకానికి 2020–21లో 1,04,482 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 1,170 మందికి హెచ్‌ఐవీ నిర్థారణ అయింది. 2021–22లో అక్టోబర్ వరకు 70,100 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 797 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు తేలింది. గర్భిణులకు 2020–21లో 82,086 మందికి పరీక్షలు చేయగా, ఇందులో మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లుగా వెల్లడైంది. 2021–22లో అక్టోబర్ నెల వరకు 42,360 మందికి పరీక్షలు చేయగా, 53 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది.
జీవన ప్రమాణం పెరిగేలా...
∙ఎయిడ్స్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో మెరుగైన చికిత్స కోసమని హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం విజయవాడలోనే ‘వైరల్ లోడ్ ల్యాబ్’ అందుబాటులోకి వచ్చింది. రోగి ప్రాణాపాయం నుంచి తప్పించేలా(థర్డ్ లెవెల్ డ్రగ్) అవసరమైన మందులు సకాలంలో అందిస్తున్నారు. జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, విజయవాడలోని పాత, కొత్త ఆసుపత్రుల్లో ఏఆర్‌టీ కేంద్రాలు అందుబాటులోఉన్నాయి. వీటికి అనుబంధంగా జిల్లాలో 6 ఏఆర్‌టీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు, మాదక ద్రవ్యాలను సూదుల ద్వారా ఎక్కించుకునే వారి ద్వారానే ఎక్కువగా హెచ్‌ఐవీ విస్తరిస్తున్నందున వీరికి అవగాహన కల్పించేందుకు జిల్లాలో 13 స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment