కాలూ, చేయి చచ్చుపడినపోతే పక్షవాతం అనిపిలిచే సమస్య వస్తే కేవలం మంచానికి పరిమితమైపోవడమనే అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పటికీ కొందరిలో ఉంది. కానీ సమయానికి సరైన చికిత్స అందితే ‘స్ట్రోక్’ అని పిలిచే ఈ సమస్య నుంచి బాగుపడటం సాధ్యమే అని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నెల (అక్టోబరు) 29న వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ‘బ్రెయిన్ స్ట్రోక్’పై అవగాహన కోసం...
మెదడును రక్షించుకోవడంలో టైమ్ చాలా కీలకం. స్ట్రోక్ వచ్చాక వైద్యం అందడంలో జరిగే ప్రతి నిమిషం జాప్యానికి కోటీ ఇరవై లక్షల న్యూరాన్లు నశించిపోతుంటాయి. అందుకే ‘‘టైమ్ ఈజ్ బ్రెయిన్’’ అంటారు. అందుకే స్ట్రోక్ గురించి మరింతగా తెలుసుకోవడం అవసరం.
స్ట్రోక్‌లో రకాలు...
1) ఇస్కిమిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులో ఒక భాగానికి రక్తం అందక ఆ భాగం దెబ్బతినడాన్ని ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ అంటారు.
2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడు లోపలి రక్తనాళాలు చిట్లడంతో మెదడులో రక్తస్రావం కావడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ‘హేమరేజిక్ స్ట్రోక్’ అంటారు.
ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టిఐఏ)...
పక్షవాతం లక్షణాలు కనిపించాక అవి ఒకటి నుంచి రెండు గంటలలోపు తగ్గిపోయి బాధితుడు కోలుకుంటే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’ అని పిలుస్తారు. అంటే... పెద్ద భూకంపానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల్లా ఒక పెద్ద స్ట్రోక్ రావడానికి ముందు సూచనలుగా ఇలాంటివి వస్తుంటాయి.
ఒకవేళ చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడకపోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు.
ఎవాల్వింగ్ స్ట్రోక్ : కాళ్లూ చేతులు చచ్చుబడుతూ పూర్తి స్థాయి స్ట్రోక్ క్రమంగా రావడాన్ని ఎవాల్వింగ్ స్ట్రోక్ అంటారు.
ఈ టిఐఏ, ఇవాల్వింగ్ స్ట్రోక్‌లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయిస్తే పూర్తిస్థాయి స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. అందుకే పైన పేర్కొన్న ఏదైనా లక్షణం లేదా కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకుని భవిష్యత్తులో పక్షవాతం రాకుండా నివారించుకోవడం సాధ్యమే.
స్ట్రోక్‌కు కారణాలు: నిజానికి బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఎవరికైనా రావచ్చుగానీ సాధారణంగా చాలామందిలో హైబీపీ, డయాబెటిస్, పొగతాగడం, అతిగా మద్యం తాగే అలవాటు, సరైన వ్యాయామం లేక΄ోవడం, స్థూలకాయం, ఒత్తిడికి గురికావడం, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉండటం అనే అంశాలు స్ట్రోక్‌కు కారణమవుతాయి. అలాగే గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉండటమూ స్ట్రోక్‌కు కారణాలే.
చికిత్స
మొదటి నాలుగున్నర గంటల్లోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే అది ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వాళ్లకు టిష్యూ ప్లాస్మెనోజెన్ యాక్టివేటర్ అనే మందును రక్తనాళంలోకి ఇస్తారు.
మొదటి ఆరుగంటలలోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే పెద్ద రక్తనాళాలలో అడ్డంకులు (క్లాట్స్) ఏర్పడి స్ట్రోక్ వచ్చినవాళ్లలో స్టెంట్ ద్వారా క్లాట్స్‌ను తొలగించవచ్చు. పై రెండు పద్ధతుల ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చినవారు రక్తం పలుచబడటానికి వాడే మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో మళ్లీ స్ట్రోక్ రావచ్చు. అలాగే హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు వాటిని అదుపులో పెట్టే మందులు వాడాలి.
పునరావాస సేవలు (రీహ్యాబిలిటేషన్ సర్వీసెస్): స్ట్రోక్ వచ్చిన మొదటిరోజు నుంచే మొదలుపెట్టి తమ రోజువారీ కార్యక్రమాలను స్వతంత్రంగా చేసుకునేవరకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సరైన రీతిలో నడిచేలా శిక్షణ వైద్యచికిత్సలో ముఖ్యం.
స్టోక్ నిర్ధారణ ఇలా...
సీటీ స్కాన్ (బ్రెయిన్)తో స్ట్రోక్ వచ్చిందనే నిర్ధారణ తోపాటు... అది ఇస్కిమిక్ స్ట్రోకా లేదా హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ సీటీ స్కాన్ (బ్రెయిన్)లో నిర్ధారణ కాక΄ోతే ఎమ్మారై (బ్రెయిన్), ఎమ్మార్ యాంజియో పరీక్ష చేయించాలి. అలాగే ఈ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో తెలుసుకుని, మళ్లీ రాకుండా చూసుకోడానికి టూడీ ఎకో, గొంతు రక్తనాళాల డాప్లర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించడం, షుగర్ మోతాదులు తెలుసుకోవడం... ఇవన్నీ రొటీన్‌గా చేయించే పరీక్షలు. చిన్న వయసులో స్ట్రోక్ వచ్చినా లేదా మందులు వాడుతున్నప్పటికీ మళ్లీ స్ట్రోక్ వచ్చినా కొన్ని అరుదైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
లక్షణాలు
పక్షవాతంలో సాధారణంగా ఒక చేయీ, కాలూ చచ్చుపడిపోవడం
మూతి వంకరపోవడం / మాట స్పష్టంగా రాకపోవడం
కళ్లు తిరిగి పడిపోవడం
శరీరం తూలడం
మాట పడిపోవడం
ఒకవైపు చూపు తగ్గిపోవడం
మింగడం కష్టం కావడం
ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులు ఒకటి రెండుగా/ఒకరు ఇద్దరుగా కనిపించడం
అరుదుగా పూర్తిగా స్పృహతప్పి పడిపోవడం జరగవచ్చు.
పైన పేర్కొన్నవాటిల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు.
నివారణే ప్రధానం...
జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో, ఆహారంలో మార్పులు
లైఫ్ స్టైల్ మార్పులు
ప్రతిరోజూ వ్యాయామం
మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం
తిండి, నిద్రలలో వేళలు పాటించడం.
ఆహారంలో మార్పులివి
ఉప్పు తగ్గించడం
తాజా కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో చికిత్స పొందితే స్ట్రోక్ వల్ల మంచానికే పరిమితమైపోతామనే దురభిప్రాయం నుంచి బయటికి రావచ్చు.
(చదవండి: పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే..? మనసులో సునామిలా..)
Comments
Please login to add a commentAdd a comment