brain stroke day
-
బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!
కాలూ, చేయి చచ్చుపడినపోతే పక్షవాతం అనిపిలిచే సమస్య వస్తే కేవలం మంచానికి పరిమితమైపోవడమనే అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పటికీ కొందరిలో ఉంది. కానీ సమయానికి సరైన చికిత్స అందితే ‘స్ట్రోక్’ అని పిలిచే ఈ సమస్య నుంచి బాగుపడటం సాధ్యమే అని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నెల (అక్టోబరు) 29న వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ‘బ్రెయిన్ స్ట్రోక్’పై అవగాహన కోసం...మెదడును రక్షించుకోవడంలో టైమ్ చాలా కీలకం. స్ట్రోక్ వచ్చాక వైద్యం అందడంలో జరిగే ప్రతి నిమిషం జాప్యానికి కోటీ ఇరవై లక్షల న్యూరాన్లు నశించిపోతుంటాయి. అందుకే ‘‘టైమ్ ఈజ్ బ్రెయిన్’’ అంటారు. అందుకే స్ట్రోక్ గురించి మరింతగా తెలుసుకోవడం అవసరం. స్ట్రోక్‌లో రకాలు... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులో ఒక భాగానికి రక్తం అందక ఆ భాగం దెబ్బతినడాన్ని ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ అంటారు. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడు లోపలి రక్తనాళాలు చిట్లడంతో మెదడులో రక్తస్రావం కావడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ‘హేమరేజిక్ స్ట్రోక్’ అంటారు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టిఐఏ)... పక్షవాతం లక్షణాలు కనిపించాక అవి ఒకటి నుంచి రెండు గంటలలోపు తగ్గిపోయి బాధితుడు కోలుకుంటే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’ అని పిలుస్తారు. అంటే... పెద్ద భూకంపానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల్లా ఒక పెద్ద స్ట్రోక్ రావడానికి ముందు సూచనలుగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడకపోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు. ఎవాల్వింగ్ స్ట్రోక్ : కాళ్లూ చేతులు చచ్చుబడుతూ పూర్తి స్థాయి స్ట్రోక్ క్రమంగా రావడాన్ని ఎవాల్వింగ్ స్ట్రోక్ అంటారు. ఈ టిఐఏ, ఇవాల్వింగ్ స్ట్రోక్‌లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయిస్తే పూర్తిస్థాయి స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. అందుకే పైన పేర్కొన్న ఏదైనా లక్షణం లేదా కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకుని భవిష్యత్తులో పక్షవాతం రాకుండా నివారించుకోవడం సాధ్యమే. స్ట్రోక్‌కు కారణాలు: నిజానికి బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఎవరికైనా రావచ్చుగానీ సాధారణంగా చాలామందిలో హైబీపీ, డయాబెటిస్, పొగతాగడం, అతిగా మద్యం తాగే అలవాటు, సరైన వ్యాయామం లేక΄ోవడం, స్థూలకాయం, ఒత్తిడికి గురికావడం, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉండటం అనే అంశాలు స్ట్రోక్‌కు కారణమవుతాయి. అలాగే గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉండటమూ స్ట్రోక్‌కు కారణాలే.చికిత్స మొదటి నాలుగున్నర గంటల్లోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే అది ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వాళ్లకు టిష్యూ ప్లాస్మెనోజెన్ యాక్టివేటర్ అనే మందును రక్తనాళంలోకి ఇస్తారు. మొదటి ఆరుగంటలలోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే పెద్ద రక్తనాళాలలో అడ్డంకులు (క్లాట్స్) ఏర్పడి స్ట్రోక్ వచ్చినవాళ్లలో స్టెంట్ ద్వారా క్లాట్స్‌ను తొలగించవచ్చు. పై రెండు పద్ధతుల ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చినవారు రక్తం పలుచబడటానికి వాడే మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో మళ్లీ స్ట్రోక్ రావచ్చు. అలాగే హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు వాటిని అదుపులో పెట్టే మందులు వాడాలి. పునరావాస సేవలు (రీహ్యాబిలిటేషన్ సర్వీసెస్): స్ట్రోక్ వచ్చిన మొదటిరోజు నుంచే మొదలుపెట్టి తమ రోజువారీ కార్యక్రమాలను స్వతంత్రంగా చేసుకునేవరకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సరైన రీతిలో నడిచేలా శిక్షణ వైద్యచికిత్సలో ముఖ్యం. స్టోక్ నిర్ధారణ ఇలా... సీటీ స్కాన్ (బ్రెయిన్)తో స్ట్రోక్ వచ్చిందనే నిర్ధారణ తోపాటు... అది ఇస్కిమిక్ స్ట్రోకా లేదా హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ సీటీ స్కాన్ (బ్రెయిన్)లో నిర్ధారణ కాక΄ోతే ఎమ్మారై (బ్రెయిన్), ఎమ్మార్ యాంజియో పరీక్ష చేయించాలి. అలాగే ఈ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో తెలుసుకుని, మళ్లీ రాకుండా చూసుకోడానికి టూడీ ఎకో, గొంతు రక్తనాళాల డాప్లర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించడం, షుగర్ మోతాదులు తెలుసుకోవడం... ఇవన్నీ రొటీన్‌గా చేయించే పరీక్షలు. చిన్న వయసులో స్ట్రోక్ వచ్చినా లేదా మందులు వాడుతున్నప్పటికీ మళ్లీ స్ట్రోక్ వచ్చినా కొన్ని అరుదైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.లక్షణాలుపక్షవాతంలో సాధారణంగా ఒక చేయీ, కాలూ చచ్చుపడిపోవడం మూతి వంకరపోవడం / మాట స్పష్టంగా రాకపోవడం కళ్లు తిరిగి పడిపోవడం శరీరం తూలడం మాట పడిపోవడం ఒకవైపు చూపు తగ్గిపోవడం మింగడం కష్టం కావడం ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులు ఒకటి రెండుగా/ఒకరు ఇద్దరుగా కనిపించడంఅరుదుగా పూర్తిగా స్పృహతప్పి పడిపోవడం జరగవచ్చు. పైన పేర్కొన్నవాటిల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. నివారణే ప్రధానం... జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో, ఆహారంలో మార్పులు లైఫ్ స్టైల్ మార్పులుప్రతిరోజూ వ్యాయామం మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం తిండి, నిద్రలలో వేళలు పాటించడం.ఆహారంలో మార్పులివి ఉప్పు తగ్గించడం తాజా కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో చికిత్స పొందితే స్ట్రోక్ వల్ల మంచానికే పరిమితమైపోతామనే దురభిప్రాయం నుంచి బయటికి రావచ్చు. (చదవండి: పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే..? మనసులో సునామిలా..) -
World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోండి ఇలా..
కర్నూలు (హాస్పిటల్): స్ట్రోక్ అంటే చాలా మంది హార్ట్ ఎటాక్ అనుకుంటారు. కానీ స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు. దీనినే సాధారణ భాషలో పక్షవాతం అంటారు. హార్ట్ ఎటాక్ అంటే అందరికీ అవగాహన వస్తోంది. కానీ బ్రెయిన్ స్ట్రోక్‌పై చాలా మందికి అవగాహన లేదు. కాళ్లు, చేతులు పడిపోతేనో, మూతి వంకరపోయిన తర్వాత మాత్రమే వైద్యుల వద్దకు వెళ్తున్నారు. దీనికి ముందు లక్షణాలు గుర్తించి వెంటనే వైద్యుల వద్దకు వెళితే జరగాల్సిన నష్టాన్ని సాధ్యమైనంతగా నివారించుకోవచ్చు. దీనినే గోల్డెన్ పీరియడ్ అని పిలుస్తారు. బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన అవగాహన దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 44 లక్షలకు పైగా జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో 4 లక్షల జనాభా పెరిగి ఉంటుంది. అంటే మొత్తం జనాభాలో 5శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అంటే 48 లక్షలలో 2.4లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల జిల్లా ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలోనూ ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స ఉంది. ఈ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా వైద్యం అందుతుండటంతో లక్షణాలు కనిపించిన నాలుగున్నర గంటల్లో (గోల్డెన్ పీరియడ్)లో బాధితులు సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స అందుకోవాలి. ఇందుకోసం అవసరమై న ఇంజెక్షన్లు, మందులు వైద్యులు రోగికి అందించి చికిత్స చేస్తారు. ఇలాంటి గోల్డెన్ పీరియడ్‌లో వెళ్లడం వల్ల అవయవాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడవ చ్చు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతి వారం స్ట్రోక్ బాధితుల సంఖ్య ఐదేళ్ల క్రితం 120 దా కా ఉండేది. అది ప్రస్తుతం 160 వరకు చేరుకుంది. స్ట్రోక్‌కు కారణాలు దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడం, మద్యపానం, ధూమపానం అతిగా సేవించడం, స్థూలకాయం కారణంగా ఒంట్లో కొవ్వుస్థాయిలు (కొలె్రస్టాల్) పెరిగిపోవడం, గుండెజబ్బులకు మందులు సరిగ్గా వాడకపోవడం వంటివి స్ట్రోక్‌కు దారి తీస్తాయి. స్ట్రోక్‌తో జరిగే తీవ్రనష్టం మనిషి మెదడుకు వెళ్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడటం కారణంగా మెదడు పనితీరు క్షీణించి స్ట్రోక్ వస్తుంది. 85శాతం మందికి కాళ్లు, చేతులు, చచ్చుపడిపోవడం, కొందరికి మూతి వంకర పోవడం, మాట నత్తిగా రావడం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు కోల్పోవడం వంటివి జరుగుతాయి. 15శాతం మందిలో మాత్రమే మెదడులో నరాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం అవుతుంది. గోల్డెన్ పీరియడ్‌లో వస్తేనే మేలు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే నాలుగున్నర గంటల్లోపు సమీప న్యూరోఫిజీషియన్ ఉన్న ఆసుపత్రికి వెళితే వెంటనే వారు థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఇది వెంటనే నరాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పల్చన చేసి రక్త సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది. నాలుగున్నర గంటలు దాటితే నిమిష నిమిషానికి బ్రెయిన్లో న్యూరాన్స్ తగ్గిపోతాయి. దీనివల్ల మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. నాలుగున్నర గంటలు దాటి ఆలస్యంగా వచ్చినా అడ్వాన్స్‌గా వచ్చిన మెకానికల్ థాంబెక్టమి అనే విధానం ద్వారా మెదడుకు యాంజియో నిర్వహించి గడ్డకట్టిన రక్తాన్ని తొలగించవచ్చు. ఇది ఖర్చుతో, రిస్క్‌తో కూడిన పని. కావున నాలుగున్నర గంటల్లోపు రావడం లేదా అస్సలు స్ట్రోక్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమం. –డాక్టర్ హేమంతకుమార్, న్యూరోఫిజీషియన్, కర్నూలు స్ట్రోక్ లక్షణాలను బట్టి శస్త్రచికిత్స అన్యూరిజం అనేది రక్తనాళాల్లో బలహీనమైన ప్రాంతం. ఇది బయటకు ఉబ్బుతుంది. రక్తనాళాలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం వల్ల హేమరేజిక్ స్ట్రోక్ రావచ్చు. అన్యూరిజం పగిలిపోయినట్లయితే మెదడు దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం అవుతుంది. లక్షణాలను బట్టి సర్జికల్ క్లిప్పింగ్, ఎండోవాసు్కలర్ థెరపి లేదా కాయిలింగ్, ప్రో డైవర్టర్లు, ఆర్టిరియోవెనస్ మాల్ ఫార్మేషన్, డీ కమోప్రెసివి క్రానియోటమి విధానాల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉంటుంది. రోగి వయస్సు, వైద్య పరిస్థితిని బట్టి స్ట్రోక్ నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. –డాక్టర్ వై.వరుణ్‌కుమార్‌రెడ్డి, న్యూరోసర్జన్, కర్నూలు -
సిటీ బ్రెయిన్‌కు స్ట్రోక్ ముప్పు..!
నగరంలో పెరుగుతున్న కేసులు మద్యం, ధూమపానం వల్లే ఎక్కువ వైద్యుల పరిశీలనలో వెల్లడి పనిలో అధిక ఒత్తిడి.. రిలాక్స్ కోసం మద్యం.. ధూమపానం.. వెరసి నగర యువత మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీరిలో కొంత మంది కాళ్లు, చేతులు పడిపోయి (ఇస్కామిక్ స్ట్రోక్) నిర్జీవంగా మారుతుండగా, మరికొంత మంది మెదడులో రక్తనాళాలు చిట్లి (హ్యమరేజ్ స్ట్రోక్) తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోనూ ఇలాంటి కేసులు పెరగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - సాక్షి, సిటీబ్యూరో నగర జీవనం చాలా మార్పులకు లోనవుతోంది. ఉరుకుల పరుగుల జీవితం.. కంప్యూటర్లతో కుస్తీలు.. మార్కెటింగ్ టార్గెట్లు.. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం.. వెరసి నగరవాసుల మెదళ్లను చిదిమేస్తున్నాయి. మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కాళ్లు చేతులు, మాట, చూపు, పడిపోయి నిర్జీవంగా మారుతున్నారు. సహజంగా 60 ఏళ్లు దాటిన వారిలో కన్పించే వ్యాధి.. సిటీలో నాలుగు పదుల వయసులోపే అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదీ నిపుణుల లెక్క.. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 150- 285 మంది పక్షవాతం బారిన పడుతున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒక పక్షవాతం కేసు నమోదవుతుండ గా, ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పక్షవాతంతో మరణిస్తున్న దేశాల జాబితాలో మనది రెండో స్థానం. ఈ వ్యాధి 35 శాతం మందిలో ధూమపానం వల్ల, 26 శాతం మంది మద్యం, 26 శాతం మంది హైపర్ టెన్షన్, 16 శాతం మంది మధుమేహం, 16 శాతం మంది ఊబకాయం వల్ల పక్షవాతానికి గురవుతున్నట్టు యశోద ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో తేలింది. తొలిసారి స్ట్రోక్‌కు గురైనవారిలో 98 శాతం మంది సకాలంలో ఆస్పత్రిలో చేరి రికవరీ అవుతున్నప్పటికీ.. రెండు శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. బాధితుల్లో 65 శాతం పురుషులు కాగా, 35 శాతం మహిళలు ఉన్నారు. పక్షవాతం వచ్చిన వారిలో ఒక కాలు, చేయి బలహీనంగా మారుతుంది. తూలుతూ నడవడం, మతిమరుపు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇవి 24 గంటల్లోనే తగ్గిపోతే ‘ట్రాన్సియెంట్ ఇస్కామిక్ ఎటాక్’ అంటారు. చాలా మందిలో గంట వ్యవధిలోనే తగ్గిపోతుంది. కానీ ఈ లక్షణాలు భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించి జాగ్రత్త తీసుకుంటే మంచిది. మద్యం, పొగవల్లే.. నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, ఉద్యోగుల్లో టార్గెట్స్‌తో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. బీపీ పెరగడంతో అది క్రమంగా హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది. అధిక మద్యపానం, లెక్కకు మించి సిగరెట్స్ కాల్చడం కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. అధిక బరువు, షుగర్ వంటి వ్యాధులు కూడా పరోక్షంగా దీనికి కారణమవుతున్నాయి. - డాక్టర్ జి.రాజశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజిషియన్, యశోద ఆస్పత్రి వ్యాయామం తప్పనిసరి సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా, మార్నింగ్ వాక్ వంటి ఎక్సర్సైజ్లు చేయాలి. ఆల్కాహాల్, స్మోకింగ్‌ను వదిలేయాలి. సంప్రదాయ ఆహారంతో కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. బీపీ లెవల్స్ 120/80కి మించకుండా జాగ్రత్త వహించాలి. - డాక్టర్ చెన్న రాజేష్‌రెడ్డి, న్యూరాలజిస్ట్, అపోలో ఆస్పత్రి