సిటీ బ్రెయిన్‌కు స్ట్రోక్ ముప్పు..! | brain stroke with drinking and smoking | Sakshi
Sakshi News home page

సిటీ బ్రెయిన్‌కు స్ట్రోక్ ముప్పు..!

Published Thu, Oct 29 2015 9:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సిటీ బ్రెయిన్‌కు స్ట్రోక్ ముప్పు..! - Sakshi

సిటీ బ్రెయిన్‌కు స్ట్రోక్ ముప్పు..!

నగరంలో పెరుగుతున్న కేసులు
మద్యం, ధూమపానం వల్లే ఎక్కువ
వైద్యుల పరిశీలనలో వెల్లడి

 
పనిలో అధిక ఒత్తిడి.. రిలాక్స్ కోసం మద్యం.. ధూమపానం.. వెరసి నగర యువత మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీరిలో కొంత మంది కాళ్లు, చేతులు పడిపోయి (ఇస్కామిక్ స్ట్రోక్) నిర్జీవంగా మారుతుండగా, మరికొంత మంది మెదడులో రక్తనాళాలు చిట్లి (హ్యమరేజ్ స్ట్రోక్) తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోనూ ఇలాంటి కేసులు పెరగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.        - సాక్షి, సిటీబ్యూరో
 
నగర జీవనం చాలా మార్పులకు లోనవుతోంది. ఉరుకుల పరుగుల జీవితం.. కంప్యూటర్లతో కుస్తీలు.. మార్కెటింగ్ టార్గెట్లు.. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం.. వెరసి నగరవాసుల మెదళ్లను చిదిమేస్తున్నాయి. మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కాళ్లు చేతులు, మాట, చూపు, పడిపోయి నిర్జీవంగా మారుతున్నారు. సహజంగా 60 ఏళ్లు దాటిన వారిలో కన్పించే వ్యాధి.. సిటీలో నాలుగు పదుల వయసులోపే అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
 
ఇదీ నిపుణుల లెక్క..

  • దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 150- 285 మంది పక్షవాతం బారిన పడుతున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒక పక్షవాతం కేసు నమోదవుతుండ గా, ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పక్షవాతంతో మరణిస్తున్న దేశాల జాబితాలో మనది రెండో స్థానం.
  •  ఈ వ్యాధి 35 శాతం మందిలో ధూమపానం వల్ల, 26 శాతం మంది మద్యం, 26 శాతం మంది హైపర్ టెన్షన్, 16 శాతం మంది మధుమేహం, 16 శాతం మంది ఊబకాయం వల్ల పక్షవాతానికి గురవుతున్నట్టు యశోద ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో తేలింది.
  •  తొలిసారి స్ట్రోక్‌కు గురైనవారిలో 98 శాతం మంది సకాలంలో ఆస్పత్రిలో చేరి రికవరీ అవుతున్నప్పటికీ.. రెండు శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. బాధితుల్లో 65 శాతం పురుషులు కాగా, 35 శాతం మహిళలు ఉన్నారు.
  •  పక్షవాతం వచ్చిన వారిలో ఒక కాలు, చేయి బలహీనంగా మారుతుంది. తూలుతూ నడవడం, మతిమరుపు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇవి 24 గంటల్లోనే తగ్గిపోతే ‘ట్రాన్సియెంట్ ఇస్కామిక్ ఎటాక్’ అంటారు. చాలా మందిలో గంట వ్యవధిలోనే తగ్గిపోతుంది. కానీ ఈ లక్షణాలు భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించి జాగ్రత్త తీసుకుంటే మంచిది.

 
మద్యం, పొగవల్లే..
నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, ఉద్యోగుల్లో టార్గెట్స్‌తో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. బీపీ పెరగడంతో అది క్రమంగా హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది. అధిక మద్యపానం, లెక్కకు మించి సిగరెట్స్ కాల్చడం కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. అధిక బరువు, షుగర్ వంటి వ్యాధులు కూడా పరోక్షంగా దీనికి కారణమవుతున్నాయి.       
                        - డాక్టర్ జి.రాజశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజిషియన్, యశోద ఆస్పత్రి
 
వ్యాయామం తప్పనిసరి
సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా, మార్నింగ్ వాక్ వంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ఆల్కాహాల్, స్మోకింగ్‌ను వదిలేయాలి. సంప్రదాయ ఆహారంతో కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. బీపీ లెవల్స్ 120/80కి మించకుండా జాగ్రత్త వహించాలి.
                         - డాక్టర్ చెన్న రాజేష్‌రెడ్డి,  న్యూరాలజిస్ట్, అపోలో ఆస్పత్రి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement