మురుగునీళ్లే ‘మహా’భాగ్యం! | drinking water problems in hyderabad | Sakshi
Sakshi News home page

మురుగునీళ్లే ‘మహా’భాగ్యం!

Published Mon, Apr 25 2016 4:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

మురుగునీళ్లే ‘మహా’భాగ్యం! - Sakshi

మురుగునీళ్లే ‘మహా’భాగ్యం!

హైదరాబాద్ శివారు ప్రాంతాలకు కలుషిత నీరే దిక్కు
 
సాక్షి, హైదరాబాద్:  ‘ఈ నీళ్లను పొరపాటున నోట్లో పోసుకున్నా నోరంతా పొక్కుతోంది.. రోగాలపాలవుతున్నాం..’ చేతిలోని మురికినీళ్ల బాటిల్ చూపిస్తూ ఎన్టీఆర్‌నగర్ బస్తీకి చెందిన ఓ మహిళ ఆవేదన..
నీళ్లను పరీక్షించే వాళ్లే లేరు.. ఈ మురికి నీళ్లకు కూడా ట్యాంకర్‌కు రూ.1,500 తీసుకుంటున్నారు..’ సైదప్పకాలనీలో ఓ సగటు నగరజీవి గోడు..

 ...వీరిద్దరే కాదు మహానగరంలోని అనేక బస్తీల్లో లక్షలాది మంది అభాగ్యులది ఇదే దుస్థితి! ముఖ్యంగా శివారుల్లోని బస్తీలు గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్నాయి. వందలు పోసి ట్యాంకర్ నీళ్లను కొంటున్నా తాగేందుకు ఏమాత్రం పనికి రావడం లేదు. ఆ మురికి నీళ్లను స్నానానికి, బట్టలు ఉతికేందుకు, కాలకృత్యాలకు వాడుకుంటూ.. తాగునీళ్ల కోసం గత్యంతరం లేక మళ్లీ ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నారు. మండు వేసవిలో బోరుబావులు వట్టిపోవడం, జలమండలి నల్లా కనెక్షన్లు లేకపోవడంతో శివారు ప్రాంతాలకు మురుగునీరే దిక్కవుతోంది. ఈ నీటిని వాడుతున్న బస్తీవాసులు చర్మ, గొంతు సంబంధ రోగాలతో సతమతమవుతున్నారు. నగరంలో చివరికి మురుగునీరు కూడా వ్యాపారులకు కాసుల పంట కురిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

నిజాంపేట్‌లోని తుర్కచెరువులో నిల్వ ఉన్న వ్యర్థ జలాలను మోటార్లతో తోడి నిత్యం వందలాది ట్యాంకర్లలో అమ్ముతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ఈ నీటిని ట్యాంకర్‌కు రూ.1,500 చొప్పున సమీప బస్తీలైన ఎన్టీఆర్ నగర్, సైదప్ప కాలనీలతోపాటు పలు అపార్ట్‌మెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని నోట్లో పోసుకుంటే పొక్కులు, స్నానం చేస్తే దద్దుర్లు వస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడే కాదు... పలు శివారు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

మురుగు నీటిని ట్యాంకర్లలో నింపి విక్రయిస్తున్న ముఠాలను కట్టడి చేయడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమౌతోంది. మణికొండ, పుప్పాల్‌గూడ, నిజాంపేట్, కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ, తెల్లాపూర్, అమీన్‌పూర్, మియాపూర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్ల నీళ్ల దందా మాఫియాను తలపిస్తోంది. కూకట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంపేట్‌రోడ్, ఎల్లమ్మబండ చౌరస్తాల్లో బారులు తీరిన ట్యాంకర్లు, బహిరంగంగా మురుగు నీటిని నింపుతున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి.!
 
ఎక్కడిది ఈ మురుగు?
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో శివారు ప్రాంతాల్లో సుమారు 14 లక్షల బోరుబావులు వట్టిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు విధిగా ట్యాంకర్ నీళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక నిజాంపేట్ తుర్కచెరువు వంటి చోట్ల సమీప కాలనీలు, బస్తీల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) లేదు. దీంతో ఓపెన్ నాలాల ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలు ఈ చెరువులను ముంచెత్తుతున్నాయి. ఈ నీటినే తోడుతూ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
 
జేబులు గుల్ల చేస్తున్నారు
ప్రైవేటు ట్యాంకర్ మాఫియా మా జేబులు గుల్ల చేస్తోంది. మురుగు నీటికి సైతం ట్యాంకర్‌కు (5 వేల లీటర్లు) రూ.1,500 నుంచి రూ.2,000  వరకు దండుకుంటున్నారు. ట్యాంకర్ నీళ్ల నాణ్యతను పరీక్షించే నాథుడే లేడు. -శ్రీధర్, మియాపూర్
 
నోట్లో పోసుకుంటే అంతే
బోరుబావులు వట్టిపోవడంతో విధిలేక ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొంటున్నాం. ఈ నీటిని పొరపాటున నోట్లో పోసుకుంటే నోరంతా పొక్కి రోగాల బారిన పడుతున్నాం. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాలి. - వర్ష వర్మ, అమీన్‌పూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement