చల్లటి నీళ్లు కావాలా నాయనా.? కొన'కుండ' ఉండలేరు మరి! | This is POT time, Have a cool drink | Sakshi
Sakshi News home page

చల్లటి నీళ్లు కావాలా నాయనా.? కొన'కుండ' ఉండలేరు మరి!

Published Sat, Apr 8 2023 2:18 AM | Last Updated on Sat, Apr 8 2023 12:36 PM

కురబలకోట మండలం అంగళ్లులో మట్టి కుండలు  - Sakshi

కురబలకోట మండలం అంగళ్లులో మట్టి కుండలు

కురబలకోట : మట్టి కుండలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. అల్యూమినియం, స్టీలు, ఇతర పాత్రల ప్రవేశంతో వీటికి ఆదరణ తగ్గింది. ఆధునిక (మెటల్‌) వంట పాత్రల వాడకం ద్వారా రోగాలు కూడా మనిషిని చుట్టుముట్టాయి. దీంతో మళ్లీ జనం ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వంటకు, తాగునీళ్లకు కుండలను ఆదరిస్తున్నారు. మట్టివి తిరిగి జన జీవన స్రవంతిలో కన్పిస్తున్నాయి.

తీరెను తాపం, కలిగించెన్ ఉపశమనం

వేసవిలో మట్టి కుండల్లో నీళ్లు తాగడం హాయి హాయిగా.. కూల్‌ కూల్‌గా అన్పిస్తుంది. వేసవి తాపాన్ని తీరుస్తాయి. దీంతో ఈ నీళ్లు మనస్సుకు హాయిని, శరీరానికి ఉపశమనాన్ని కల్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఎండల సీజన్‌. ఒక పక్క ఉక్క పోత, మరో వైపు మండుటెండలు. ఇలాంటి పరిస్థితుల్లో మట్టి కుండ అనగానే ఎవ్వరికై నా చల్లని నీళ్లు గుర్తుకు వస్తాయి. చలివేంద్రాలు అంటే కూడా మట్టి కుండలే కన్పిస్తాయి. ఈ కుండల్లో నీళ్లు తాగితే వేసవి తాపం తీరుతుంది. ఆల్కలీన్‌ లక్షణాలు నీటిలోని పీహెచ్‌ స్థాయుల్ని సమతుల్యం చేస్తాయని చెబుతారు.

ఆరోగ్యానికి ఎంతో మంచిది

కుండ నీళ్ల వల్ల వక్రియ మెరుగపడి పొట్టకు ఇబ్బంది లేకుండా చేస్తాయన్న పేరుంది. అంతేగాకుండా ఖనిజాలు, లవణాలు కూడా అందుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మట్టి కుండల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సదుం, మదనపల్లె దగ్గర సీటీఎం, ఈడిగపల్లె, కాండ్లమడుగు, కుమ్మరపల్లె తదితర ప్రాంతాల్లో వీటిని అమ్ముతున్నారు. రోడ్ల పక్కన స్టాల్స్‌లో వీటిని విక్రయిస్తున్నారు. ఉక్క పోత ఎక్కువగా ఉండడం ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మట్టి కుండ అంటనే చల్లదనానికి మారుపేరు. దీంతో చలివేంద్రాలలో ఎక్కడ చూసినా మట్టి కుండలే కన్పిస్తాయి.

మట్టి కుండలకు పెట్టింది పేరు

మట్టి కుండలు, బొమ్మలు అంటేనే ఎవ్వరికై నా తొలుత గుర్తుకు వచ్చేది కురబలకోట మండలంలోని అంగళ్లు, కంటేవారిపల్లె, ఆ తర్వాత పలమనేరులోని ఘంటావూరు. వీటికి ఇవి ప్రసిద్ధి. ఇక్కడ సీఎఫ్‌సీ సెంటర్లు, ఆధునిక మిషన్లు ఉండడంతో వీటి తయారీలో హస్త కళాకారులు ఆరితేరారు. కుండలు, కడవలు రూ.120 నుంచి రూ. 300 చొప్పున అమ్ముతున్నారు. మగ్గులు రూ.150 నుంచి రూ.250, వాటర్‌ బాటిళ్లు రూ.150 నుంచి రూ.200, పెరుగు, మజ్జిగ కుండలు రూ.50 నుంచి రూ.70 చొప్పున విక్రయిస్తున్నట్లు హస్తకళాకారులు వెల్లడించారు.

వివిధ రాష్ట్రాలకు సరఫరా

కుండల తయారీ వెనుక కుమ్మరుల కృషి ప్రశంసనీయం. వేసవి వస్తే వీటికి తరగని డిమాండ్‌ ఉంటుంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫారా అవుతున్నాయి. వీటిలో నీళ్లు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. మూడు నెలలు వేసవి సీజన్‌ ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రూ.2 కోట్ల దాకా ఈ కుండల అమ్మకం ద్వారా లావాదేవీలు జరుగుతాయి.

– కష్ణమూర్తి, టెర్రకోట హస్తకళాకారుల సలహాదారు

ఫ్రిజ్‌లున్నా వీటిపైనే మక్కువ

నగర, పట్టణ వాసులు సై తం ఫ్రిజ్‌లు ఉన్నా మట్టి కుండల వైపే చూస్తున్నా రు. వీటిలో నీళ్లు సహజంగా చల్లబడతాయి. ఆరోగ్యానికి శ్రేయస్కరమని ని పుణులు చెబుతారు. మనిషి నాగరిగత నేర్చుకు న్న తర్వాత మొదటి వంట చేసింది మట్టి పాత్రల్లోనే అని చెబుతారు. ఇవి ఇళ్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరో వైపు పర్యావరణ ప్రేమికు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

– శ్రీనివాసులు, హస్తకళాకారుల సంఘ నాయకులు, కురబలకోట మండలం

కుండ నీరు శ్రేయస్కరం

కుండ, కడవల్లోని నీరు ఎంతో మంచిది. ఇప్పటికీ పేదవాడి ప్రిడ్జ్‌గా పిలుస్తారు. సాధారణంగా మనిషి శరీరం ఆమ్లస్వభావం కల్గి ఉంటుంది. మట్టి ఆల్కలీన్‌. కుండనీళ్లు తాగినప్పుడు శరీర ఆమ్ల స్వభావంతో చర్య జరుపుతుంది. సరైన పీహెచ్‌కు దోహదపడుతుంది. భూమి వివిధ ఖనిజ లవణాల సహజ గని. దీని నుంచి వచ్చిన మట్టితో చేసే కుండలు, సామగ్రి ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది. – బి.పద్మనాభరెడ్డి,

పవర్‌ వాటర్‌ టెక్‌ నిర్వాహకులు, గుంతవారిపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement