
ప్రపంచంలోని ప్రతి ముగ్గురు బాలికా వధువులలో ఒకరు మన దేశంలోని చిన్నారే! అంతేకాదు, మనదేశంలో జరుగుతున్న ప్రతి నాలుగు పెళ్లిళ్లలో ఒకరు 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వధువే! ఇలా చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లి చేసెయ్యడం వల్ల వారు అనేక శారీరక, మానసిక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ‘యునిసెఫ్’ సంస్థ తాజాగా హెచ్చరికను జారీ చేసింది. తలపై అక్షింతలు వేసి చేతులు దులుపుకుంటే ఆడపిల్ల బాధ్యత తీరిపోవచ్చేమో కానీ, ఆ తర్వాత ఆమె అనుభవించే ఆరోగ్య సమస్యల్నుంచి.. పెళ్లిరోజు మనం వేసిన అక్షింతలు ఆమెను రక్షించలే వని గమనించాలి.
18 లోపు పెళ్లయితే!
►అనేకసార్లు గర్భం దాల్చడం వల్ల పొత్తికడుపు బలహీనం అవుతుంది.
►జననాంగ శుభ్రత లోపిస్తే గర్భాశయ కంఠద్వారం (సెర్విక్స్) నుంచి లైంగిక వ్యాధులు, హెచ్.పి.వి. (హ్యూమన్ పాపిల్లోమా వైరస్), సెర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
►అసంఖ్యాక కలయికల కారణంగా జననాంగనాళం వాచి, భరించలేనంత నొప్పిని కలిగించవచ్చు.
►వయసుకు సరిపడని లైంగిక కృత్యాల కారణంగా మైనరు బాలికలు మానసిక ఆరోగ్యాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది.
కనీస జాగ్రత్తలు
►రుతుస్రావ సమయంలో ప్రతి ఆరు గంటలకొకసారి ప్యాడ్స్ మారుస్తుండాలి.
►వస్త్రాన్ని వాడుతుంటే కనుక, ఒకసారి వాడిన వస్త్రాన్ని మళ్లీ మళ్లీ వాడకూడదు. వస్త్రంలో వృద్ధి చెందే బాక్టీరియా జననాంగంలో ఇన్ఫెక్షన్‌కు దారి తీయవచ్చు.
►రుతుస్రావంలోను, మిగతా సమయాల్లోనూ జననావయవాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.
►అవసరం అయినప్పుడల్లా వాష్‌రూమ్‌కి వెళ్లి వస్తుండాలి. గంటలకొద్దీ మూత్రాన్ని బిగబట్టి ఉంచకూడదు. అలా ఉంచితే అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు మూలం కావచ్చు.
►తరచు బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటుండాలి.