అస్సాం రాష్ట్రం.. తేజ్‌పూర్ సమీపంలోని ఓ గ్రామం.తరచుగా వరదలకు గురయ్యే భౌగోళిక పరిస్థితుల మధ్యనివసించే ప్రజలు. అక్కడ పదిహేడేళ్ల కిందట వచ్చిన వరదల్లో ఓ సంఘటన జరిగింది. నిజానికి అదిసంఘటన కాదు. అనుభవం. ఓ పదిహేనేళ్ల బాలికకుఎదురైన చేదు అనుభవం. ఆ అనుభవమే‘డిగ్నిటీ ఇన్ ఫ్లడ్స్’ అనే ఉద్యమానికి నాంది పలికింది.
నది ఒక్కసారిగా దిశ మార్చుకున్నట్లు.. ఇళ్లలోకి చొచ్చుకుని వచ్చింది ప్రవాహం. వీధులు అప్పటికే జలమయ్యాయి. పొలానికి వెళ్లినవాళ్లు, ఇంట్లో ఉన్న వాళ్లు ఒకరికోసం ఒకరు చూసుకునే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్లు మోకాళ్లలోతు నీటిలో నేల ఎక్కడుందో పాదాలతో వెతుక్కుంటూ దగ్గరలో ఉన్న షెల్టర్ హోమ్ దగ్గరకు చేరుకున్నారు. ‘హమ్మయ్య, ప్రాణాలు దక్కాయి’ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. బెంగపడి ఏడుస్తున్న పిల్లలకు ధైర్యం చెబుతున్నారు పెద్దవాళ్లు. ఎవరి పెద్దవాళ్లు ఏ షెల్టర్‌లో ఉన్నారో, ఎవరి పిల్లలు ఏ షెల్టర్‌లో ఉన్నారో తెలియదు. ఓ పదిహేనేళ్ల అమ్మాయి రెండో రోజుకి కూడా ఏడుపు ఆపడం లేదు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
వాళ్ల దగ్గరకు వెళ్లిందా అమ్మాయి. అందరూ మగవాళ్లే, ఒక్క మహిళ కూడా లేదు. తన అవసరాన్ని చెప్పుకోలేక వెనక్కి వచ్చేసింది. తన అవసరాన్ని తల్లికి తప్ప మరెవరికీ చెప్పుకోలేని వయసు ఆమెది. ఆ మర్నాడు పినతల్లి వచ్చి తీసుకెళ్లే వరకు పీరియడ్ బ్లీడింగ్‌తో అవస్థలు పడిందా అమ్మాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేటప్పుడు ఇలాంటి ఉపద్రవం ముంచుకు వస్తుందని ఊహించలేదామె. షెల్టర్ హోమ్‌కి వచ్చిన మర్నాడే పీరియడ్ మొదలైంది. షెల్టర్ హోమ్‌లో స్త్రీలకు అవసరమైన ఎటువంటి సౌకర్యాలూ లేవు. నాటి దయనీయమైన సంఘటన ఆ అమ్మాయిని సోషల్ యాక్టివిస్టుగా మార్చింది. ఆమే.. మయూరి భట్టాచార్జీ
‘డిగ్నిటీ ఇన్ ఫ్లడ్స్’
మయూరి ఇప్పుడు ఊరూరా తిరిగి స్కూలు పిల్లలను, గ్రామీణ మహిళలను చైతన్య పరుస్తున్నారు. మెన్‌స్ట్రువల్ హైజీన్ పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నారు. ‘ఇది మాట్లాడడానికి బిడియపడాల్సిన నిషిద్ధమైన విషయమేమీ కాదు, ధైర్యంగా మాట్లాడవచ్చు’ అని చెబుతున్నారు. వరదల సమయంలో సహాయక బృందాలు ఆహారం, కట్టుకోవడానికి దుస్తులు, మందులు పంపిణీ చేస్తుంటారు. అయితే అలాంటి సమయాల్లో స్త్రీ, పురుషుల ఉమ్మడి అవసరాలే కాదు.
ప్రత్యేకించి మహిళల అవసరాలు కూడా ఉంటాయని వాళ్లకు తెలియదు. వాళ్లకే కాదు, ప్రభుత్వంలో నిర్ణయాలు చేసే వాళ్లకీ తెలియదు. అందుకే ఆడవాళ్ల అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని షెల్డర్ హోమ్స్‌లో శుభ్రమైన బాత్‌రూమ్‌లు, పాడ్స్, సబ్బులు కూడా ఉంచాలని కూడా ఆమె అస్సాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ‘డిగ్నిటీ ఇన్ ఫ్లడ్స్’ పేరుతో మయూరి మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు.
వనితల వినతులు
మయూరి భట్టాచార్జీ తనకు ఎదురైన నాటి దుర్భరస్థితి నుంచి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. సమాజంలో నెలకొని ఉన్న సామాజిక రుగ్మతను తొలగించాలి, మహిళలకు ఎదురవుతున్న గర్భాశయ సంబంధిత అనారోగ్యాలను నివారించాలని నిర్ణయించుకున్నారు. మెన్‌స్ట్రువల్ ఎడ్యుకేటర్, ట్రైనర్‌గా ఇప్పుడామె స్కూళ్లకు వెళ్లి టీనేజ్‌లోకి వచ్చిన పిల్లలకు గర్భాశయం బొమ్మ గీసి, రుతుక్రమం అనేది దేహధర్మాల్లో ఒక భాగమనే విషయాన్ని వివరిస్తున్నారు. వరద ముప్పును పసిగట్టిన వెంటనే మగవాళ్లలాగ ఉన్న ఫళాన పరుగులు తీయవద్దని, ఇంటి నుంచి పీరియడ్ కిట్ పట్టుకెళ్లమని, పీరియడ్ కిట్ లేకపోతే కనీసం శుభ్రమైన వస్త్రాన్నయినా పట్టుకెళ్లమని చెబుతున్నారు.
కొంచె పెద్ద వయసు వాళ్లకయితే ‘‘మీరు ఈ అవసరాన్ని దాటి వచ్చిన వాళ్లే అయినా సరే... కిట్ పట్టుకెళ్లడం మర్చిపోవద్దు. వరద ముప్పును గ్రహించిన తర్వాత ఇంటికి వెళ్లి రావడానికి కూడా వీలుండదు. అలాంటి వాళ్లకు మీరు పట్టుకెళ్లిన కిట్ ఉపయోగపడుతుంది’’ అని వాళ్లకు ముందు జాగ్రత్త చెబుతున్నారు. అలాగే ప్రభుత్వాలు చేయాల్సిన పనిని గుర్తు చేస్తూ అధికారులకు వినతి పత్రాలను సమర్పించడానికి స్థానిక గ్రామీణ మహిళలను కలుపుకుంటున్నారు మయూరి. ఈ క్రమంలోనే ఉమెన్ ఫ్రెండ్లీ ఫ్లడ్ షెల్టర్స్‌ను నిర్మించాల్సిందిగా ‘డిగ్నిటీ ఇన్ ఫ్లడ్’ కాంపెయిన్ నిర్వహించి ముప్పై వేలకు పైగా సంతకాలు సేకరించారామె. సంతకాలు చేసిన ఆ విజ్ఞప్తి పత్రంలో.. షెల్టర్ హోమ్స్‌లో శానిటరీ పాడ్స్, శుభ్రమైన వస్త్రాలు, సబ్బులు సిద్ధంగా ఉంచాలని అస్సాం మహిళలు కోరారు.
మయూరి భట్టాచార్జీ ఆధ్వర్యంలో వారంతా నిన్న (మే 28) ‘వరల్డ్ మెన్‌స్ట్రువల్ డే’ సందర్భంగా అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మరో ముఖ్యమైన విషయాన్ని సోషల్ వెల్ఫేర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వరదలు లేని సందర్భంలో షెల్టర్ హోమ్స్ ఖాళీగా ఉంటాయి. అప్పుడవి అసాంఘిక శక్తుల అడ్డాగా మారుతున్నాయి. మహిళల మీద అత్యాచారాలకు వేదికలవుతున్నాయి. కాబట్టి అధికారులు గట్టి నిఘా పెట్టాలని కోరారు. గతంలో ఇచ్చిన నివేదికలకు స్పందించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు షెల్టర్‌హోమ్స్‌ని పర్యవేక్షించి అవసరమైన మార్పుల గురించి చర్చించాయి కూడా. రాష్ట్రంలోని షెల్టర్ హోమ్స్ అన్నీ ఉమెన్ ఫ్రెండ్లీగా మారే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అంటున్నారు మయూరి భట్టాచార్జీ.
– మంజీర
బిడియం వీడాలి
ప్రపంచం ఆధునికతలో దూసుకుపోతోంది. కానీ మన సమాజం అపోహలను వదిలించుకోవడంలోనే ఇంకా కొట్టుమిట్టాడుతోంది. గ్రామాలే కాదు, పట్టణాలు కూడా ఇందుకు మినహాయింపుగా ఏమీ లేవు. పీరియడ్ అనేది సహజమైన దేహధర్మం అని సమాజం గుర్తించాలి, దాని గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని నొక్కి పెట్టాల్సిన అవసరం లేదని గ్రహించాలి, మరొకరికి వివరించి చెప్పగలిగినంతగా చైతన్యం కావాలి. అలాంటి చైతన్యం రానంత వరకు అత్యవసరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా తన అవసరాన్ని చెప్పడానికి గొంతు పెగలదు. బిడియం లేకుండా మాట్లాడగలిగినప్పుడు ఇలాంటి అవసరం గురించి వాళ్లే మాట్లాడుకోగలుగుతారు. నాలాగ ఒకరు వచ్చి వాళ్ల తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉండదు.
– మయూరీ భట్టాచార్జీ
(స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్
ఫోరమ్‌లోని ప్రసంగ భాగం)
రుతుక్రమ పరిశుభ్రతలపై ఆస్కీ చైతన్య సదస్సులు
యునిసెఫ్ లెక్కల ప్రకారం మనదేశంలోని యుక్తవయసులో ఉన్న బాలికలు నెలకు కనీసం ఒకటి – రెండు రోజులు స్కూలుకు పోవడం లేదు. ఇందుకు కారణం ఆయా స్కూళ్లలో విద్యార్థినులకు సరైన టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడమే. నెలసరి సమయంలో ప్యాడ్ మార్చుకోవడానికి వీల్లేకపోవడంతో ఆ రోజుల్లో స్కూలు మానేస్తున్నారు. అమ్మాయిలకు, మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడం, ఆ విషయాలను మాట్లాడడానికి ఎదురవుతున్న బిడియాన్ని తొలగించడం కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాయి. యునిసెఫ్, ఆస్కీ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)ల సహకారంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్వచ్‌భారత్, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాలు కూడా పాఠశాలల్లో పరిశుభ్రత, రుతు పరిశుభ్రతల కల్పన కోసం రూపొందినవే.
గత ఏడాది ‘వాష్ యునైటెడ్’ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 154 స్కూళ్లలో, పాతిక వేల మంది బాలికలకు రుతుక్రమంపై అవగాహన కల్పించినట్లు ‘ఆస్కీ’ ప్రతినిధి డాక్టర్ మాలినీ రెడ్డి చెప్పారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అనేక కంపెనీలు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న, సంక్షేమ హాస్టళ్లలో ఉండే ఇరవై లక్షల మందికి బాలికలకు ఉచితంగా సానిటరీ పాడ్స్ అందచేసినట్లు తెలిపారు. వరల్డ్ మెన్‌స్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రుతుక్రమ అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలను మాలిని వివరించారు. ‘ఎలాంటి హద్దులు లేవు– మహిళలు, బాలికల సాధికారత చక్కటి రుతు సంబంధ పరిశుభ్రతనివ్వడం ద్వారానే’ అనేది ఈ ఏడాది మెన్‌స్ట్రువల్ హైజీన్ డే థీమ్. ఈ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని చైతన్యవంతమైన అమ్మాయిలు ‘మేమిప్పుడు షాప్‌కెళ్లి ప్యాడ్స్ కొనుక్కోవడానికి బిడియపడడం లేదు. నేరుగా అడిగి కొనుక్కోగలుగుతున్నాం’ అంటున్నారని డాక్టర్ మాలిని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment