ప్రతీకాత్మక చిత్రం
నా వయస్సు 19. ఎత్తు 5.6 బరువు 42. అయితే నాకూ 5 సంవత్సరాల నుండి రొమ్ము లో కొంత బాగం గట్టిగా ఉంది కదులుతూ ఉంటుంది కూడా. నేను చాలా సన్నగా ఉంటాను నాకూ ఛాతీ కూడా చిన్నగా ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్‌గానే ఉంటుంది కాని, కడుపు నొప్పి ఉంటుంది. తెలిసిన డాక్టర్‌ని అడిగితే పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులకు పోతుంది అన్నారు. కానీ కొన్ని నెలల నుండి నొప్పి ఎక్కువగా ఉంటోంది. మసాజ్ చేయడం వల్ల కొంతకాలం ఉపశమనం లభిస్తోంది. నేను హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నా, అక్కడ ఫుడ్ బాగా ఉండదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. కడుపు నొప్పి కోసం హోమియోపతి మందులు 3 నెలలు వాడాను. నా సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఏమయినా ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా?? సమస్య ఏంటో దానికి కారణం చికిత్స తెలియచేయాలని మనవి.
– శ్రీ విద్య, కరీంనగర్
నువ్వు నీ ఎత్తుకి తగ్గ బరువు లేవు, సన్నగా ఉన్నావు. నీకు రొమ్ములో కదులుతూ ఉండే గడ్డ ఉన్నట్లుంది. అది ఫైబ్రోఅడినోమా గడ్డ కావచ్చు. ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి రొమ్ము స్కానింగ్ చేయించుకుంటే అది సాధారణ గడ్డా కాదా అని తెలుస్తుంది. అది మామూలు చిన్న ఫైబ్రోఅడినోమా గడ్డ అయితే... దానిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ల మోతాదును బట్టి, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి గర్భాశయ కండరాలు ముడుచుకుంటూ... గర్భాశయ పొరని బ్లీడింగ్ రూపంలో బయటకు పంపిస్తుంది.
ఈ సమయంలో కొందరిలో కడుపునొప్పి, నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో నొప్పి తీవ్రత కొద్దిగా ఉంటుంది. ఇంకొందరిలో ఏమీ ఇబ్బంది ఉండదు. ఇలా హార్మోన్స్ విడుదలలో మార్పుల వల్ల వచ్చే నొప్పి వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ సమయంలో నొప్పి నివారణ మాత్రలు రెండు మూడు రోజులు వేసుకోవచ్చు. కాని కొందరిలో గర్భాశయంలో కంతులు, ఫైబ్రాయిడ్స్, ఇన్‌ఫెక్షన్లు, ఆడినోమయోమా, వాపు, ఎండోమెట్రియోసిస్, అండాశయాలలో కంతులు, సిస్ట్‌లు వంటి అనేక సమస్యల వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నెలనెలా నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని పైన చెప్పిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేవా అని నిర్ధారించుకుని దానినిబట్టి సమస్య ఏమిటో తెలుసుకుని చికిత్స తీసుకోవడం మంచిది.
హాయ్ మేడం.. నాకు 25 ఏళ్లు. గవర్నమెంట్ ఆఫీసర్‌ని. నాకు 4 నెలల కింద లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ ఆపరేషన్ అయింది. దాంతో మొత్తం ఎడమవైపు ఓవరీనే తీసేశారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు.పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టడంలో ఏదైనా సమస్య ఉంటుందా? లేక పిల్లలు పుడతారా లేదా అని భయంగా ఉంది. మా తల్లి తండ్రులు బాధ పడుతున్నారు. ప్లీజ్ చెప్పండి.
– ఇ– మెయిల్
సాధారణంగా గర్భాశయానికి రెండువైపులా ఒక్కొక్క అండాశయం (ఓవరీ) అతుక్కుని ఉంటాయి. అంటే మొత్తంగా రెండు అండాశయాలు ఉంటాయి. ఒక నెల ఒక వైపు అండాశయం నుంచి, మరలా నెల ఇంకొక వైపు అండాశయం నుండి అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో కలయికలో ఉండటం వల్ల మగవారి నుంచి శుక్రకణాలు యోని నుంచి గర్భాశయంలోకి వెళ్లి అక్కడి నుండి ఫెలోపియన్ ట్యూబ్‌లోకి చేరి, అక్కడికి చేరిన అండాశయం నుంచి విడుదలయిన అండంతో ఫలధీకరణ చెంది పిండం ఏర్పడుతుంది. ఈ పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి చొచ్చుకుని గర్భం ఏర్పడి పెరగడం మొదలవుతుంది. నీకు ఒక అండాశయం తొలగించినా, ఇంకొక అండాశయం ఉంది కాబట్టి, దాని నుంచి విడుదలయ్యే అండం వల్ల గర్భం తప్పకుండా వస్తుంది. (ఇతర వేరే సమస్యలు లేకపోతే) కాబట్టి నువ్వు భయపడకుండా, మీ తల్లిదండ్రులకు కూడా ఏమీకాదని ధైర్యాన్ని చెప్పడం మంచిది.
నా వయసు 43 ఏళ్లు. ఆరు నెలలుగా పీరియడ్స్ సమయంలో విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది. కడుపులో నొప్పిగా ఉంటోంది. గత రెండు నెలల్లో పీరియడ్స్‌కి పీరియడ్స్‌కి మధ్య కూడా బ్లీడింగ్ అయ్యింది. ఇదేమైనా ప్రమాదకరమా?
– నాగమణి, సోంపేట
ఆడవారిలో 40 సంవత్సరాలు పైబడిన తర్వాత హార్మోన్లలో మార్పులు, అండాశయం పనితీరులో మార్పులు, గర్భాశయంలో ఫైబ్రాయిడ్ కంతులు, ఎండోమెట్రియల్ పాలిప్స్, సర్వైకల్ పాలీప్స్, ఇన్‌ఫెక్షన్లు, గర్భాశయంలో వాపు, అడికోమయోసిన్, ఎండోమెట్రియోసిస్, అండాశయాలలో సిస్ట్‌లు, కంతులు ట్యూమర్స్, అరుదుగా గర్భాశయ క్యాన్సర్ వంటి అనేక సమస్యల వల్ల బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, కడుపులో నొప్పి, మధ్యలో బ్లీడింగ్ కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. మీరు కంగారు పడకుండా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, పెల్విక్ స్కానింగ్, పాప్‌స్మియర్, ధైరాయిడ్ పరీక్ష చేయించుకుని, అవసరమైతే సర్వైకల్ బయాప్సీ, ఎండోమెట్రియల్ బయాప్సీ వంటివి కూడా చేయించుకుని సమస్య ఏమిటి, ఎక్కడ ఉంది అని తెలుసుకుని దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది.
- డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment