
మంచి రుచికరమైన ధాన్యాల్లో సజ్జలు ముఖ్యమైనవి. వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువ. దాంతోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియమ్, సోడియం, పొటాషియమ్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్–ఈ, విటమిన్–కె కూడా ఎక్కువే. సజ్జలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నివి. పాలిచ్చే తల్లులు రొమ్ముపాలు పుష్కలంగా పడేలా చేసే గుణం సజ్జలకు ఉంది. ఇందులో ఉండే మెగ్నీషియమ్ వల్ల మహిళల్లో రుతుసమయంలో వచ్చే ‘మెన్‌స్ట్రువల్ క్రాంప్స్’ తగ్గుతాయి. సజ్జల్లో ఫాస్ఫరస్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అవి ఎముకలను దృఢంగా మార్చుతాయి. అంతేకాదు.. సజ్జలు కండరాలను మరింత శక్తిమంతంగా చేస్తాయి.
సజ్జలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను తగ్గించి, గుండెజబ్బులను నివారిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పాళ్లను పెంచి రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడతాయి. వీటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పైల్స్, పెద్దపేగు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తాయి. సజ్జల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనోఎంజైమ్ త్వరగా కడుపు నిండేలా చేసి, సంతృప్తభావనను పెంచుతుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారికి సజ్జలు మంచి ఆహారం. ఇదే ఎంజైమ్ ఒత్తిడిని తగ్గించి, బాగా నిద్రపట్టేలా కూడా చేస్తుంది. తరచూ ఆహారంలో సజ్జలు తీసుకునేవారిలో గాల్‌స్టోన్స్ ఏర్పడటం చాలా తక్కువ.