కడుపు – మెదడుకు లింక్..
బలమైన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ‘గట్ ఫీలింగ్’ అంటుంటారు. అభిప్రాయాలూ, ఆలోచనలు కలగడం మెదడు పని కాబట్టి ఆ మాట మెదడునూ సూచిస్తుంది. గట్ అనే కడుపు (జీర్ణాశయ) భాగాన్ని మెదడుకు ముడిపెట్టే మాటలు ఎందుకోగానీ తెలుగులోనూ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు... ‘కడుపులోంచి దుఃఖం తన్నుకువస్తోంది’... ‘కడుపులో ఎంత బాధ దాచుకున్నాడో’... ‘కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు’... ‘ఆ అమ్మకడుపు చల్లగా’... వంటి ప్రయోగాలతో పాటు, నేర్పు, విద్యకు సంబంధించి... చదువు, లెక్కలు వంటివి వస్తే ‘డొక్కశుద్ధి’ ఉందనీ, విద్య లేకపోతే ‘పొట్టకోస్తే అక్షరం ముక్క రాద’నీ... ఇలా ఎన్నో. జీర్ణవ్యవస్థకూ, మెదడు చేసే పనులకూ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలతో పాటూ కడుపు ఆరోగ్యం బాగుంటేనే మెదడు ఆలోచనలూ, పూర్తి ఆరోగ్యమూ బాగుటుందని ఆధునిక వైద్యనిపుణులూ పేర్కొంటున్నారు. ఆ ఉదాహరణలను చూద్దాం..
కడుపు–మెదడు కనక్షన్ ఇలా..
– కడుపు ఖాళీ అవ్వగానే ఖాళీ అయ్యిందంటూ కడుపు మెదడుకు చెబుతుంది. మెదడు ‘గ్రెలిన్’ అనే హార్మోన్ విడుదల చేయగానే ఆకలేస్తుంది
– కడుపు నిండగానే ‘జీఎల్‌పీ–1’ అనే మరో హార్మోన్ విడుదలై ఇక భోజనం చాలనిపిస్తుంది.
– తిన్న వెంటనే పేగులకు రక్త ప్రసరణ పెరుగుతుంది.అందుకే తిన్న వెంటనే మందకొడిగా, స్థబ్దంగా మారడానికి ఈ కనెక్షనే కారణం.
– ఒత్తిడికీ, లేదా ఆందోళనకూ లోనైనప్పుడు పెద్ద మెదడు నుంచి భిన్నమైన సిగ్నళ్లు వెలువడి రెండో మెదడులా పనిచేసే గట్ బ్రెయిన్ ప్రభావితమవుతుంది.
ఇలా ఎందుకు జరుగుతుందంటే..
మెడడు నుంచి వేగస్ నర్వ్ ద్వారా న్యూరోట్రాన్స్ మీటర్లు పేగులకు వెళ్తాయి. వేగస్ నాడి మెదడుకు కడుపునకూ (గట్‌కూ) మధ్య టెలిఫోన్ తీగలా పని చేస్తూ ఉంటుంది. దీనికి తోడు పేగులకు కూడా ‘ఎంటెరిక్ నెర్వస్ సిస్టమ్’ అనే సొంత నాడీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మెదడు నుంచి అందుకునే సమాచారంతో పేగుల్లోని నాడీ వ్యవస్థ ప్రభావితమవుతూ ఉంటుంది. అందుకునే మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలకు గురైనప్పుడు జీర్ణ సమస్యలైన ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’, వాంతులు, నీళ్లవిరేచనాలూ, కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) లాంటి సమస్యలు తలెత్తుతాయి.
గట్ హెల్త్ దెబ్బతింటే..
పేగుల్లో కోటానుకోట్ల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఉజ్జాయింపుగా చెప్పాలంటే పది పక్కన పధ్నాలుగు సున్నాలు (టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్) సంఖ్య ఎంత పెద్దదో అన్ని సూక్ష్మజీవులుంటాయి. కడుపులోని ఈ సూక్ష్మజీవుల సముదాయాన్నే ‘గట్ మైక్రోబియం’ అంటారు. ఈ గట్ మైక్రోబియమే రోగనిరోధక వ్యవస్థ మొదలు మెటబాలిజం వరకూ శరీరంలోని పలు జీవక్రియావ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉన్నంత కాలం ఎంతటి తీవ్రమైన రుగ్మతలతోనైనా పోరాడటం సాధ్యమవుతుంది. పేగుల్లోని మైక్రోబియం హెచ్చుతగ్గులకు లోనైతే చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు మొదలుకొని మధుమేహం, ఉబ్బసంలాంటి వాటితో పాటు... చివరకు మానసిక వ్యాధుల బారిన పడతారు. అయితే గట్ హెల్త్ దెబ్బతిని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి ఆలోచనలూ, మానసికారోగ్యాలూ, భావోద్వేగాలు ప్రభావితం అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అవేమిటంటే...
– యాంటీబయాటిక్స్: వీటితో దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.
– ఒత్తిడి: వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిడులు, ఆఫీసుల్లో సహోద్యోగుల వల్ల తలెత్తే ఒత్తిడులు, సామాజిక ఒత్తిళ్లు.. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.
– ఆందోళన: మానసిక ఆందోళన కలగగానే... గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కు రక్త సరఫరా సక్రమంగా జరగదు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఆందోళనలు లోనైనప్పుడు విడుదలయ్యే రసాయనాలు (స్ట్రెస్ కెమికల్స్) వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో వ్యాధినిరోధకశక్తి పోరాడలేదు. ఆందోళనలకు గురయ్యేవారిలో కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అదేపనిగా కొనసాగుతుంటే కడుపు, పేగుల్లో పుండ్లు (అల్సర్స్) రావచ్చు. ఒక్కోసారి అక్కడ అల్సర్ మరింతగా పెరిగి కడుపులో రంధ్రం పడవచ్చు.
– ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు:
సెరటోనిన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా డిప్రెషన్, యాంగై్జటీ మొదలవుతాయి. మెదడులోనే ఉత్పత్తి అవుతుందని అందరూ అనుకునే సెరటోనిన్‌లో 95 శాతం పేగుల్లోనే తయారవుతుంది. అంతేకాదు... సెరటోనిన్, డోపమైన్ అనే ఈ హ్యాపీ హార్మోన్ల తయారీకి తోడ్పడే విటమిన్లు, అమినో యాసిడ్లను... నిజానికి పేగుల్లోని మంచి బ్యాక్టీరియానే ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గితే, సెరటోనిన్ కూడా తగ్గి మానసిక సమస్యలూ మొదలవుతాయి.
గట్ రక్షణకు పరిష్కార మార్గాలివి..
ఆహారపరమైనవి: పెరుగు తినడం వల్ల పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే మజ్జిగ, పెరుగు వంటి వాటిని ‘్రపో–బయోటిక్స్’ అంటుంటారు. వీటితో పాటు పీచు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల మలబద్దకం ఉండదు. పొద్దున్నే సుఖవిరేచనం అవుతుంది. దాంతో రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి భోజనంలో మూడింట ఒక వంతు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, డ్రైఫ్రూట్స్‌లో కివి, ఆఫ్రికాట్‌లతో పాటు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి తరచూ తింటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా తీసుకోవడం మూడ్స్‌ను బాగు చేస్తుంది. ఇందుకోసం చేపలు తినాలి. ∙వ్యాయామం ఎండార్ఫిన్స్‌ను వెలువరించడం వల్ల హాయి, సంతోషం లాంటి ఫీలింగ్స్ కలిగించడమే కాకుండా కడుపును తేలిగ్గా ఉంచుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్దకంతో మూడ్స్ చెడిపోతుంటే వైద్యులను సంప్రదించాలి.
ఇవి చదవండి: Health: చీకటి పొర చీల్చండి..
Comments
Please login to add a commentAdd a comment