నేడు వరల్డ్ క్యాన్సర్ డే
మానవుల జీర్ణవ్యవస్థ (గట్) లో ప్రతి చదరపు సెంటీమీటరుకు కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. మనిషి దేహం మొత్తంలో 30 ట్రిలియన్ కణాలుంటాయని అంచనా వేస్తే గట్‌లో నివాసముండే సూక్ష్మజీవుల సంఖ్య 38 ట్రిలియన్లు! ఈ సూక్ష్మజీవుల సముదాయాన్ని డాక్టర్లు ‘మైక్రోబియమ్’ గా చెబుతుంటారు. ఈ సూక్ష్మ జీవజాలపు సమతౌల్యతే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. మంచి జీర్ణక్రియకు దోహదపడుతుంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సమర్థంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.
మానవుల మూడ్స్‌ను సైతం ఈ మైక్రోబయోమ్ ప్రభావితం చేస్తుంది. అలాంటి సూక్ష్మజీవుల సముదాయమే క్యాన్సర్ గడ్డ (ట్యూమర్)లోనూ ఉంటుందని తెలుసుకున్నారు పరిశోధకులు. గట్‌లో ఉండేవి ‘గట్ బయోమ్’ అయితే ట్యూమర్‌లో ఉండేవి ‘ట్యూమర్ బయోమ్’!! ట్యూమర్ పెరుగుదలనూ, చికిత్స సమయంలో ట్యూమర్ ప్రతిస్పందించే తీరునూ ఈ ‘ట్యూమర్ బయోమ్’ ప్రభావితం చేస్తుంది. నేడు (ఫిబ్రవరి 4న) ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా చికిత్సతో పాటు అనేక అంశాలను
ప్రభావితం చేసే ఈ ‘ట్యూమర్ సూక్ష్మక్రిముల’ గురించి తెలుసుకుందాం.
ఆరోగ్య స్పృహ ఉన్న వర్గాల్లో గట్ బయోమ్ గురించి బాగానే తెలుసు. కానీ అదే తరహాలో క్యాన్సర్ గడ్డలోనూ సూక్ష్మజీవుల సముదాయాలుంటాయన్న విషయం చాలామందికి పెద్దగా తెలియకపోయినప్పటికీ ఇది వాస్తవం. నిజానికి ఈ ‘బయోమ్’ ఎంత ప్రభావశీలమైనదంటే... క్యాన్సర్ కణం ఎలా ప్రవర్తించాలన్న అంశాన్నీ ఇది ప్రభావితం చేస్తుంది. ట్యూమర్ ఇన్‌ఫ్లమేషన్‌ను ఇది పెంచనూవచ్చు, తగ్గించనూవచ్చు.
జెనెటిక్స్‌తో మరింత తోడ్పాటు...
ట్యూమర్ మైక్రోబయోమ్ సహాయంతో క్యాన్సర్ చికిత్సలను మరింత ప్రభావవంతంగా అందించడానికి జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) మంచి తోడ్పాటును అందిస్తుంది. జన్యుశాస్త్ర సహాయంతో ట్యూమర్‌లోని మైక్రోబయోమ్ మనకు అనుకూలంగా పనిచేస్తోందా లేక ప్రతికూలంగా ఉందా, దాని బట్టి ఎలాంటి చికిత్స అందిస్తే మంచి ఫలితాలొస్తాయి వంటి అంశాలను అధ్యయనం చేస్తూ, మైక్రోబయోమ్‌నూ జెనెటిక్ ప్రోఫైలింగ్‌నూ సమన్వయం చేసుకోవడం వల్ల మరింత ప్రభావవంతమైన చికిత్సను అందించవచ్చు. ఇలా చేయడం వల్ల వచ్చే ఫలితాలూ అద్భుతంగా ఉంటాయి. అక్కడి సూక్ష్మజీవుల జన్యుపటలాల అధ్యయన విశ్లేషణలతో అవెలా మనుగడ సాగిస్తున్నాయీ, వాటిని ఎదుర్కొనేలా బాధితులకు సరిగ్గా సరిపడేలా వ్యక్తిగతమైన మందుల రూపకల్పన ఎలా అన్న విషయాలను తెలుసుకోవచ్చు. దాంతో క్యాన్సర్ చికిత్సలను మరింత సమర్థంగా జరిగేలా చూడవచ్చు. ఫలితంగా బాధితుల్లో వ్యాధిని పూర్తిగా నయం చేయడానికీ, వారు కోలుకుని మంచి నాణ్యమైన జీవితాన్ని అనుభవించడానికీ ఈ అధ్యయనాలు తోడ్పడతాయి.
జీవక్రియలు ఓ సింఫనీ అనుకుంటే... జీవనశైలీ, ఆహారాలతో ప్రయోజనాలివి...
మానవ జీవితంలోని జీవక్రియలను ఓ సింఫనీతో పోల్చవచ్చు. సింఫనీ అంటే అనేక మంది గాయకులు ఒకే స్వరంతో స్వరం కలిపి ఒకే లయలో పాడటం. అప్పుడు ఓ అద్భుత సంగీతం (మెలొడీ) ఆవిష్కృతమవుతుంది. ఇందులో కణాలన్నీ మంచి గాయకులనుకుంటే మంచి మైక్రోబియమంతా లయాత్మకంగా వాద్యాలను వాయించే అద్భుత సంగీతకారులు (మ్యూజీషియన్స్). అప్పుడు వినిపించేదంతా హాయినిగొలిపే ‘ఆరోగ్య’కరమైన సంగీతం. ఈ హెల్దీ సంగీత లహరి అలా హాయిగా సాగిపోతుండగా మనం తీసుకునే అనారోగ్యకరమైన, పోషకరహితమైన ఆహారం కారణంగా వినిపించే కొన్ని అనారోగ్యల అపస్వరాల ఆలాపాల వల్ల కలిగే అనర్థాలు!
ఇక ఈ పోలికలో ట్యూమర్ అనేది చక్కగా సాగే సింఫనీని చెడగొట్టేలా అన్నీ అపస్వరాలతో గట్టిగా గానాన్ని వినిపించే సోలో గాయకుడూ, అలాగే ‘ట్యూమర్’లోనూ ఉన్న మైక్రో బయోమ్ కూడా వినిపించే అందరూ సమన్వయంతో పాడుతుండగా వినిపించే ఈ అపస్వరాల అనారోగ్యం కర్ణ కఠోరంగా వినిపించే ‘రుగ్మత’.
ఇలాంటి సమయాల్లో మనం తీసుకునే పోషకాలతో కూడిన మంచి ఆహారంలోని ఫైబర్ పుష్కలంగా ఉండే న్యూట్రిషన్, ప్రొబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లూ ఇవన్నీ ఆ అపస్వరాలను అధిగమిస్తూ, వాటిని కప్పేస్తూ గట్టిగా వినిపించే సుస్వరాలు. అనుసరించే అద్భుతారోగ్యకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్) కూడా అదనంగా వినిపిస్తుండే ఆర్కెస్ట్రైజేషన్! ఇలా చేస్తున్నప్పుడు సమన్వయంతో సాగే సింఫనీలో పూర్తిగా అపస్వరాలే పైచేయి సాధించకుండా కనీసం వాటిని కప్పేస్తూ తప్పులను దొర్లనివ్వకుండా, దొరకనివ్వకుండా చేసే ‘కోకఫోనీ’!
అంటే... ఈ పోలికను క్యాన్సర్ జబ్బుతో అన్వయించినప్పుడు... మంచి చికిత్స, మంచి ఆహారం, మంచి లైఫ్‌స్టైల్‌తో జబ్బు మరింత పెరగదు. అనర్థాలు కనిపించవు. అపస్వరాలను డామినేట్ చేసేలా చికిత్స, ఆహారనియమాలూ, జీవనశైలి సాగితే క్రమంగా అపస్వరాలే వినిపించనివ్వకుండా చేసేలా మనకు మేలు చేసే మంచి మైక్రోబియమ్ పెరుగుతుంది. ఆ చెడు మైక్రోబియమ్‌ను అది డామినేట్ చేసి మరీ చికిత్సతో క్యాన్సర్ నయం చేయడానికి సహాయపడుతుందని ఈ పోలిక చెబుతోంది.
ఈ ఏడాది థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’ వరల్డ్ క్యాన్సర్ డే
సందర్భంగా వచ్చే రెండేళ్ల పాటు (అంటే 2025 నుంచి 2027 వరకు) అమల్లో ఉండే ‘థీమ్’... ‘యునైటెడ్ బై యునీక్’! ప్రతి క్యాన్సర్ బాధితుడూ ఓ ప్రత్యేక వ్యక్తి. ఈ బయోమ్ కారణంగా అతడిలోని జబ్బు అతడికే ప్రత్యేకం. అందుకే ఒక వ్యక్తిలో క్యాన్సర్ ప్రవర్తించే తీరును బట్టి వ్యక్తిగతంగా అతడికే ప్రత్యేకమైన మందుల రూపకల్పనకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఎంతోమంది ప్రత్యేక వ్యక్తులంతా ఐక్యంగా కలిసి క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలన్నదే ఈ థీమ్ అర్థం. తెలుగులో చెప్పుకోవాలంటే... ఇది ‘ప్రత్యేకుల ఐక్యత’! అంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వాలన్నీ ఏకమై క్యాన్సర్‌ను తుదముట్టించేందుకు ప్రయత్నించాలంటూ ఈ ప్రత్యేకమైన థీమ్ పిలుపునిస్తోంది.
కొన్ని ట్యూమర్ బయోమ్‌తో సమర్థమైన ఇమ్యూనో చికిత్స సాధ్యం...
క్యాన్సర్‌కు అందించే చికిత్సల్లో కీమో, రేడియేషన్, శస్త్రచికిత్సలతో పాటు ఇమ్యూనో థెరపీ అన్నది కూడా ఓ ప్రభావవంతమైన చికిత్స. ప్రతి వ్యక్తిలో ప్రతిరోజూ 200 నుంచి 1000 క్యాన్సర్ కణాలు పుడుతుంటాయి. మనందరిలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) వాటిని తుదముట్టిస్తుంది. ఆ వ్యవస్థ విఫలమైనప్పుడు అలా తుదముట్టించే ప్రక్రియలో ఒక్క క్యాన్సర్ కణమైనా తప్పించుకుని బతికితే అప్పుడు బాధితులకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది.
ఈ ఇమ్యూనో థెరపీలో బాధితుల వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తారు. ఫలితంగా క్యాన్సర్ రాకముందు వ్యాధినిరోధక వ్యవస్థ రోజూ పుట్టే క్యాన్సర్ కణాలను మట్టుబెట్టే ప్రక్రియే ఈ ఇమ్యూనోథెరపీలోనూ జరుగుతుంది. ఈ థెరపీ సమయంలో క్యాన్సర్ ట్యూమర్‌లోనూ, ఆ పరిసరాల్లోనూ ఉండే సూక్ష్మజీవుల సముదాయం మానవులకు మేలు చేసేదైతే ఈ చికిత్సకు ఆ బయోమ్ మరింత దోహదపడి ట్యూమర్‌ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.
ట్యూమర్‌కు కీడు చేసే బయోమ్‌తో బాధితుడికి మేలు...
గట్ బ్యాక్టీరియమ్‌లో మేలు చేసేవి ఎక్కువగా ఉన్నప్పుడు అవి మంచి ఆరోగ్యాన్నిస్తూ, చెడు బయోమ్ పెరిగినప్పుడు ఆరోగ్యం చెడిపోయినట్టే... క్యాన్సర్ ట్యూమర్‌లోనూ... ఆ గడ్డకు సహాయం చేసే బయోమ్ పెరిగితే అది చికిత్సను అడ్డుకుంటుంది. ట్రీట్‌మెంట్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే... ఇక దానికి చేటు చేసే బయోమ్ పెరిగినప్పుడు... ఆ సూక్ష్మజీవుల సముదాయం క్యాన్సర్ గడ్డ పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. ట్యూమర్ చుట్టూ అలాంటి బయోమ్ ఉన్నప్పుడు పేషెంట్స్‌కు అందించే చికిత్సకు... ముఖ్యంగా ‘కీమో’ చికిత్సకు బాధితులు సానుకూలంగా స్పందిస్తుంటారు. అలా ట్యూమర్ మైక్రోబయోమ్‌కూ క్యాన్సర్ చికిత్సకూ మధ్య పరస్పరం ప్రతిస్పందనలు కొనసాగుతుంటాయి.
క్యాన్సర్ ‘ఏ టు జడ్’ స్క్రీనింగ్స్ ఇలా!
చాప కింది నీరులా వ్యాపిస్తున్నప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. అయితే క్యాన్సర్‌ను వీలైనంత త్వరగా అంటే... దాని నాలుగు దశల్లో... మొదటి లేదా రెండోదశలోనైనా కనుక్కోగలిగితే క్యాన్సర్‌ను నయం చేసుకోవడం కష్టమేం కాదు. అయితే క్యాన్సర్స్‌ను ముందుగానే గుర్తించడమెలా, మహిళలకూ, పురుషులకూ లేదా ఈ ఇద్దరిలోనూ వచ్చే సాధారణ క్యాన్సర్లేమిటి... ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోడానికి ఉపయోగపడే ప్రత్యేక కథనాన్ని సాక్షి హెల్త్ ప్లస్‌లో చూడవచ్చు.
ట్యూమర్ బయోమ్‌తో ఉపయోగాలు
→ ఈ బయోమ్ కనుగొనడంతో క్యాన్సర్‌కు మరింత సమర్థమైన చికిత్సలు సాధ్యం
→ మైక్రోబయోమ్ ప్రతిస్పందనలకు అనుగుణంగా కొత్త మందుల రూపకల్పన
→ జన్యుశాస్త్ర, బయోమ్‌ల సమన్వయాలతో సరికొత్త థెరపీలు కనుగొనే వీలు
డా‘‘ ఏవీఎస్ సురేశ్,సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment