ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
బహిష్టు బాధ వల్లే అఘాయిత్యానికి ఒడిగట్టిందంటున్న తల్లిబుద్ధిగా చదువుకుంటుంది.. ఎవ్వరితోనూ మాట్లాడదు.. ఎవరింటికీ వెళ్లదు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు.. గొడవలు, ప్రేమ వ్యవహారాలు అసలే తెలియవు. కానీ ఒక సమస్య మాత్రం ఆ చిన్నారిని నెలనెలా చిత్రవధ చేసేది. అప్పుడప్పుడూ తల్లికి చెప్పుకుని తల్లడిల్లేది. చివరికి నొప్పి భరించలేక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించింది. దీనికంతటికీ కారణం.. నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన బాధే కావడం గమనార్హం.
మదనపల్లె రూరల్: మదనపల్లె పట్టణం చీకిలిగుట్టలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. తెట్టు ఆదినారాయణ, సరస్వతమ్మల దంపతుల కుమార్తె లిఖిత(13) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆదినారాయణ స్థానికంగా ఓ సైకిల్‌షాపును నిర్వహిస్తున్నాడు. తల్లి స్థానికంగా ఉన్న ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో లిఖిత మంగళవారం స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. తర్వాత ఇంటిలో ఎవరూ లేనిది చూసి తలుపుకు గడిపెట్టి తన తల్లి చీరను ఫ్యాన్‌కు తగి లించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రలు బిడ్డ ఇంటిలో గడిపెట్టుకుని ఉరివేసుకున్న విషయాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరిగిందో తెలియక గుండెలు బాదుకున్నారు. అల్లారు ముద్దుగా సాకిన బిడ్డ ఇక లేదని తెలిసి కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ హనుమంతు నాయక్, ఎస్‌ఐ గంగిరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతికిగల కారణాలపై ఆరా తీశారు. బహిష్టు సమయంలో వచ్చే బాధవల్లే తన కూరుతు ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లి సరస్వతమ్మ తెలిపింది. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.