నాకు 38 ఏళ్లు. ఆరునెలలుగా పీరియడ్స్ రావట్లేదు. ఇంతకుముందేమో హెవీ సైకిల్స్ ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే పీరియడ్స్ రాకపోవడం రిలీఫ్‌గానే ఉంది. కానీ మా ఫ్రెండ్సేమో ఇంత చిన్న వయసులో అలా పీరియడ్స్ ఆగిపోవడం కరెక్ట్ కాదు, డాక్టర్‌ని కన్సల్ట్ అవమని చెప్తున్నారు. ఇంతముందుగా మెనోపాజ్ వస్తుందా? – కె. పల్లవి, హైదరాబాద్
ఎర్లీ లేదా ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే 40–45 ఏళ్ల మధ్య నెలసరి పూర్తిగా ఆగిపోవడం. వీళ్లకి మెనోపాజ్ సింప్టమ్స్ అయిన హాట్ ఫ్లషెస్, చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్ వంటివీ ఉంటాయి. కానీ కొంతమందికి హఠాత్తుగా కొన్ని నెలలపాటు పీరియడ్స్ ఆగిపోతాయి. భవిష్యత్‌లో మళ్లీ స్టార్ట్ అవచ్చు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా 40 ఏళ్లలోపు కనపడుతుంది.
దీనిని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్‌సఫిషన్సీ అంటారు. అంటే అండాశయాల నుంచి అండాలు విడుదల కాకుండా, బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. దీనికి సరైన కారణమేంటో తెలీదు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్, డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలోనూ కనిపిస్తుంది. జన్యుపరమైన కారణమూ ఉండొచ్చు. కొంతమందికి మంప్స్, టీబీ, మలేరియా తరువాత ఇలా పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది.
మెనోపాజల్ సింప్టమ్స్‌తోపాటు జుట్టు ఊడిపోవడం, ఎముకలు బలహీనపడటం, బోన్ లాస్ వంటివీ ఉంటాయి. ఆస్ట్రియో పొరాసిస్ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నీ బాడీలో ఈస్ట్రజన్ హార్మోన్స్ తగ్గటం వలన తలెత్తుతాయి. ఎప్పుడైనా వరుసగా మూడునెలలు పీరియడ్స్ మిస్ అయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. కారణమేంటో త్వరగా కనుక్కొని వెంటనే చికిత్సను అందిస్తారు. ఒత్తిడి, డైట్‌లో మార్పులు, ఎక్సర్‌సైజ్ హాబిట్స్ వల్ల కూడా కొంత పీరియడ్ సైకిల్‌లో మార్పులు వస్తాయి.
థైరాయిడ్, ఎఫ్‌ఎస్‌హెచ్ టెస్ట్‌లు, బోన్ స్కాన్ చేస్తారు. దేహానికి హార్మోన్స్ అవసరం చాలా ఉంటుంది. అలాంటిది చిన్న వయసులోనే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతే రిస్క్ ఎక్కువవుతుంది. కాబట్టి కొంతమంది పేషంట్స్‌కి డాక్టర్ పర్యవేక్షణలో హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ ఇస్తారు. 51 ఏళ్లకి సహజంగానే మెనోపాజ్ వస్తుంది కాబట్టి ఆ సమయం వరకు జాగ్రత్తగా చెకప్ చేయించుకుంటూండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment