బర్త్ ప్లానింగ్ అంటే ఏమిటి..? | what is birth planning? | Sakshi
Sakshi News home page

బర్త్ ప్లానింగ్ అంటే ఏమిటి..?

Published Fri, Nov 1 2013 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

బర్త్ ప్లానింగ్ అంటే ఏమిటి..?

బర్త్ ప్లానింగ్ అంటే ఏమిటి..?

అన్ని విషయాల్లో లాగే బిడ్డ పుట్టడానికి అవసరమైన ఏర్పాట్లు ఎలా ఉండాలన్నది తెలుసుకొని, ఆ మేరకు పర్యవేక్షించుకోవడాన్ని బర్త్ ప్లాన్‌గా చెప్పవచ్చు. ఈ బర్త్ ప్లాన్‌ను ఇటీవల చాలామంది చదువుకున్న మహిళలు తాము పురుడు పోసుకోడానికి ముందుగా తమ డాక్టర్‌తో చర్చించి, రాతపూర్వకంగా నమోదు చేసుకుంటున్నారు. దీన్నే బర్త్ ప్లాన్‌గా వ్యవహరిస్తున్నారు.
 
 చాలామంది మహిళలు తమకు ఎలాంటి ప్రసూతి జరగాలో కోరుకుంటూ ఆ మేరకు తమకు జరిగేలా చూడమని డాక్టర్‌ను కోరుతుంటారు. కొందరు తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్ డెలివరీయే కావాలని కోరుకుంటారు. మరికొందరు చాలా సందర్భాల్లో తమకు సిజేరియన్ జరిగేలా చూడమని డాక్టర్‌ను కోరుతుంటారు. కానీ ఇదంత మంచికోరిక కాదు. సిజేరియన్‌తో చాలా రకాల ఇబ్బందులు రావచ్చు. అటు అనస్థీషియా పరంగా, ఇటు పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ పరంగా... ఇలా అనేక రకాల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. సాధారణ స్వాభావిక ప్రసూతితో పోలిస్తే సిజేరియన్ చేయడం అన్నది అటు తల్లికీ, ఇటు బిడ్డకూ అవసరమని, అదే  సురక్షితమని డాక్టర్లు నిర్ణయిస్తేనే ఆ మేరకు డాక్టర్లు నిర్ణయం తీసుకుని, ఆ విషయాన్ని కాబోయే తల్లికి, ఆమె కుటుంబసభ్యులకు తెలిపి, తమకు అభ్యంతరం లేదనే అనుమతి (కన్సెంట్) తీసుకుంటారు. అందుకే ఈ నిర్ణయాన్ని పరిస్థితులను బట్టి డాక్టర్‌నే తీసుకోనివ్వాలి.
 
 ఇక దీనికి తోడు ప్రసూతికి వచ్చేప్పుడు ఎలా రావాలి? ఎవరితో రావాలి? ఆ టైమ్‌లో డాక్టర్ ఉంటారా? వంటి విషయాలను తెలుసుకుని, ఆ మేరకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు.


 ఆసుపత్రికి వచ్చాక... నొప్పులు వస్తుంటే, వాటిని తట్టుకోడానికి సంసిద్ధంగా ఉంటారా లేదా నొప్పులు తట్టుకోలేనివారైతే అవి వచ్చీ, రాగానే నొప్పులు తెలియకుండా తీసుకోవాల్సిన ఇంజెక్షన్ కోరుకుంటారా అన్న విషయాలనూ తెలుసుకుంటారు.
 
 ఆసుపత్రికి వచ్చేప్పుడు కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు అవసరమైన వస్తువులేమిటి, వాటిని ఎక్కడ నుంచి ఎలా పొందాలన్న అంశాలనూ తెలుసుకుంటారు. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటారు.
 
 ఇక డెలివరీ అయ్యాక సిజేరియన్ అయితే ఎన్నాళ్లు ఆసుపత్రిలో ఉండాలి, మామూలు ప్రసూతే అయితే ఎన్నాళ్లు ఉండాలన్న విషయాలతో పాటు, బిడ్డకు అవసరమైన వస్తువులు, ఇవ్వాల్సిన ఫీడింగ్ వంటి అంశాలు మొదలుకొని... ఆ తర్వాత బిడ్డకు అవసరమైన వ్యాక్సినేషన్ వివరాలనూ తెలుసుకుంటారు. తల్లిగా మారాక మొదటి చెకప్ ఎప్పుడన్న సంగతులతో పాటు, బిడ్డ జనన వివరాల నమోదు ఎలా అన్న సంగతి వరకు తెలుసుకోవడమే బర్త్ ప్లానింగ్‌గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. కాబోయే తల్లులూ, తండ్రులూ... ఇక పెన్నూ పేపర్ తీసుకుని బర్త్ ప్లాన్‌కు సిద్ధమైపోండి.
 
 డాక్టర్ సుశీల వావిలాల
 ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
 ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement