ప్రసవానికీ ముహూర్తం
సమస్యలు తెచ్చుకుంటున్న తల్లీబిడ్డలు
ఆజ్యంపోస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు
ఒకప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే మావోడు ఏ ముహూర్తంలో పుట్టాడో చెప్పండి అని పండితులు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లేవాళ్లు. ఇప్పుడు పుట్టకముందే జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి డెలివరీకి ముహూర్తం పెట్టండి అని అడుగుతున్నారు. ముహూర్తం చూసుకుని శుభ ఘడియల్లో అమ్మ కడుపులోని బిడ్డను బయటకు తీస్తున్నారు.
ఎక్కువ మంది రెండో బిడ్డ ప్రసవానికి ఈ లగ్నం పెడుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే, రెండో కాన్పు ఎలాగూ సిజేరియనే కదా అని నెలలు నిండక ముందే తేదీ నిర్ణయించేస్తున్నారు. రెండు మూడు రోజుల ముందు, మరి కొందరైతే వారం, పక్షం రోజుల ముందే బిడ్డను బయటకు తెచ్చేస్తున్నారు. ఈ ప్రసవం తరువాత తల్లికి బిడ్డకూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి.
కాణిపాకం: సిజేరియన్ పేరు చెబితే ఒకప్పుడు గర్భిణులంతా భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు అదే పదం మాటిమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మ నీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లోనే ఇది వరకు సిజేరియన్ చేసేవారు.
కానీ ఇప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా కత్తి వాడుతున్నారు. కత్తి గాటు పడనిదే బిడ్డ బయటకు రావడం లేదు. సహజ కాన్పులో వేదన తప్ప కలిగే ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా ఈ పద్ధతికే ఓటేస్తున్నారు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
మారుమూల పల్లె వాసులు కూడా సిజేరియన్‌కు వెళ్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రమైన చిత్తూరుతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 30 నుంచి 40 శాతం వరకు సిజేరియన్లు ఉంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది.
ముహూర్తం పెట్టుకుని మరీ
సిజేరియన్లపై జిల్లావాసులు ఎంతగా మక్కువ చూపుతున్నారంటే.. ఆపరేషన్లకు ముందుగానే ముహూర్తం పెట్టుకుని మరీ వస్తున్నారు. అంటే ప్రసవానికి ముందే వారు సిజేరియన్ చేసుకోవాలని నిర్ణయించు కుంటున్నారు.
వారే అలా సిద్ధమయ్యే సరికి డాక్టర్లదేముంది. ఎలాగూ డబ్బులు వస్తాయి కదా అని వారికి అవగాహన కల్పించకుండా ఆపరేషన్ చేయడానికి సిద్ధమై పోతున్నారు. కొందరు డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం మాత్రం వినిపించుకోకపోవడం విడ్డూరం.
పండుగల్లో ప్రత్యేకం
శ్రావణమాసం, మాఘమాసం, కార్తీక మాసం, రంజాన్ మాసం, క్రిస్మస్ పండుగ రోజులలో డెలివరీల సందడి కనిపిస్తోంది. మంచి రోజులు వస్తాయంటే ఒకపక్క పెళ్లిళ్ల సందడి ఉండగా, మరోపక్క ఈ సమయంలోనే బిడ్డ పుడితే జాతకంతోపాటు భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
బిడ్డపైన ప్రభావం
» బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది.
» అసహజ రీతిలో చేసే కత్తిగాట్ల వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పందనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి.
» బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువగాను లేదా తక్కువగాను విడుదలై అవి భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి.
ఇదీ వ్యాపారమే!
ఒక సిజేరియన్‌కు జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల వారు సుమారు రూ.40వేల నుంచి రూ.80 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఇది ఓ మేజర్ ఆపరేషన్‌కు తీసుకున్నంత మొత్తంలో ఉంటోంది.
జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 50 నుంచి 90 వరకు వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీటిలో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటాయి. సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజుల వరకు ఉండాలి. ఖర్చు కూడా ఎక్కువే. సహజ ప్రసవానికి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. తల్లీ బిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చును.
ముహూర్తాల వెర్రి
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు.
ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
సిజేరియన్ ఎప్పుడు చేస్తారంటే..
» గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు
» గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం
» గర్భాశయ ముఖ ద్వారాన్ని మాయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లో సిజేరియన్లు చేస్తారు.
» తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తారు.
అది భగవంతుడి నిర్ణయం
పుట్టుక అనేది భగవంతుడు నిర్ణయించింది. ఆ సమ యంలోనే జననం జరగాలి. డెలివరీ డేట్లు ఒక రోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతు న్నారు. వారం, తిథి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే కాన్పుకెళుతున్నారు. రెండు, మూడు ఏళ్ల కిందట అంతగా లేకపోయినా, ప్రస్తుతం మంచిరోజు చూసుకునే సిజేరియన్ చేసుకుంటున్నారు. – సుధాకర్ గురుక్కల్, అర్చకులు, చిత్తూరు
కడుపు కోత మంచిది కాదు
చాలా మంది ముహూ ర్తం పెట్టి సిజేరియన్‌కు సిద్ధమవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బిడ్డను ఆ సమయంలోనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడం కరెక్ట్ కాదు. దీని వల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం. సిజేరియన్ అనేది అత్యవసర మైతేనే చేయాలి. అది కూడా సమయాన్ని బట్టి సిజేరియన్ చేస్తాం. సిజేరియన్ విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – ప్రభావతి, డీసీహెచ్‌ఎస్, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment