Muhurtam
-
లగ్న జననం!
ఒకప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే మావోడు ఏ ముహూర్తంలో పుట్టాడో చెప్పండి అని పండితులు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లేవాళ్లు. ఇప్పుడు పుట్టకముందే జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి డెలివరీకి ముహూర్తం పెట్టండి అని అడుగుతున్నారు. ముహూర్తం చూసుకుని శుభ ఘడియల్లో అమ్మ కడుపులోని బిడ్డను బయటకు తీస్తున్నారు. ఎక్కువ మంది రెండో బిడ్డ ప్రసవానికి ఈ లగ్నం పెడుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే, రెండో కాన్పు ఎలాగూ సిజేరియనే కదా అని నెలలు నిండక ముందే తేదీ నిర్ణయించేస్తున్నారు. రెండు మూడు రోజుల ముందు, మరి కొందరైతే వారం, పక్షం రోజుల ముందే బిడ్డను బయటకు తెచ్చేస్తున్నారు. ఈ ప్రసవం తరువాత తల్లికి బిడ్డకూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. కాణిపాకం: సిజేరియన్ పేరు చెబితే ఒకప్పుడు గర్భిణులంతా భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు అదే పదం మాటిమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మ నీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లోనే ఇది వరకు సిజేరియన్ చేసేవారు. కానీ ఇప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా కత్తి వాడుతున్నారు. కత్తి గాటు పడనిదే బిడ్డ బయటకు రావడం లేదు. సహజ కాన్పులో వేదన తప్ప కలిగే ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా ఈ పద్ధతికే ఓటేస్తున్నారు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మారుమూల పల్లె వాసులు కూడా సిజేరియన్‌కు వెళ్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రమైన చిత్తూరుతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 30 నుంచి 40 శాతం వరకు సిజేరియన్లు ఉంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్లపై జిల్లావాసులు ఎంతగా మక్కువ చూపుతున్నారంటే.. ఆపరేషన్లకు ముందుగానే ముహూర్తం పెట్టుకుని మరీ వస్తున్నారు. అంటే ప్రసవానికి ముందే వారు సిజేరియన్ చేసుకోవాలని నిర్ణయించు కుంటున్నారు. వారే అలా సిద్ధమయ్యే సరికి డాక్టర్లదేముంది. ఎలాగూ డబ్బులు వస్తాయి కదా అని వారికి అవగాహన కల్పించకుండా ఆపరేషన్ చేయడానికి సిద్ధమై పోతున్నారు. కొందరు డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం మాత్రం వినిపించుకోకపోవడం విడ్డూరం. పండుగల్లో ప్రత్యేకం శ్రావణమాసం, మాఘమాసం, కార్తీక మాసం, రంజాన్ మాసం, క్రిస్మస్ పండుగ రోజులలో డెలివరీల సందడి కనిపిస్తోంది. మంచి రోజులు వస్తాయంటే ఒకపక్క పెళ్లిళ్ల సందడి ఉండగా, మరోపక్క ఈ సమయంలోనే బిడ్డ పుడితే జాతకంతోపాటు భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. బిడ్డపైన ప్రభావం » బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. » అసహజ రీతిలో చేసే కత్తిగాట్ల వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పందనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి. » బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువగాను లేదా తక్కువగాను విడుదలై అవి భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి. ఇదీ వ్యాపారమే! ఒక సిజేరియన్‌కు జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల వారు సుమారు రూ.40వేల నుంచి రూ.80 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఇది ఓ మేజర్ ఆపరేషన్‌కు తీసుకున్నంత మొత్తంలో ఉంటోంది. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 50 నుంచి 90 వరకు వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీటిలో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటాయి. సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజుల వరకు ఉండాలి. ఖర్చు కూడా ఎక్కువే. సహజ ప్రసవానికి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. తల్లీ బిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చును. ముహూర్తాల వెర్రి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్ ఎప్పుడు చేస్తారంటే.. » గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు » గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం » గర్భాశయ ముఖ ద్వారాన్ని మాయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లో సిజేరియన్లు చేస్తారు. » తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తారు. అది భగవంతుడి నిర్ణయంపుట్టుక అనేది భగవంతుడు నిర్ణయించింది. ఆ సమ యంలోనే జననం జరగాలి. డెలివరీ డేట్లు ఒక రోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతు న్నారు. వారం, తిథి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే కాన్పుకెళుతున్నారు. రెండు, మూడు ఏళ్ల కిందట అంతగా లేకపోయినా, ప్రస్తుతం మంచిరోజు చూసుకునే సిజేరియన్ చేసుకుంటున్నారు. – సుధాకర్ గురుక్కల్, అర్చకులు, చిత్తూరు కడుపు కోత మంచిది కాదు చాలా మంది ముహూ ర్తం పెట్టి సిజేరియన్‌కు సిద్ధమవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బిడ్డను ఆ సమయంలోనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడం కరెక్ట్ కాదు. దీని వల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం. సిజేరియన్ అనేది అత్యవసర మైతేనే చేయాలి. అది కూడా సమయాన్ని బట్టి సిజేరియన్ చేస్తాం. సిజేరియన్ విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – ప్రభావతి, డీసీహెచ్ఎస్, చిత్తూరు -
Dussehra 2024: శరన్నవరాత్రుల సంబరం, దసరా ఎపుడు వచ్చింది?
వినాయక చవితి పండుగ వేడుక ముగించుకొని, బై..బై. గణేశా అంటూ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అలా ముగిసిందో లేదో మరో పండుగు సందడి మొదలైంది. అదే సరదాల దసరా పండుగ. దేశవ్యాప్తంగా దసరా పండుగను ఉత్సాహంగా జరుపుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మరి ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజు వచ్చిందో తెలుసా? ముహూర్తం ఎపుడు? తెలుసుకుందాం రండి.దసరా పండుగ, శుభ సమయం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతీ ఏడాది దసరా పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలోని శుక్ల పక్షం, దశమి రోజున అక్టోబరు 12న విజయ దశమి వచ్చింది. 2వ తేదీనుంచి శరన్నవరాత్రులు ఆరంభం కానున్నాయి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గా భవాని మహిషాసురుడిని సంహరించి ప్రజలకు శాంతిని చేకూర్చింది. అందుకే ఇది విజయదశమి అయిందని పెద్దలు చెబుతారు. అలాగే శ్రీరామడు రావణుడిని తుదముట్టించడం ద్వారా అధర్మంపై ధర్మం గెలిచిన రోజు కనుక విజయ దశమి అయిందని మరో కథనంలో చెబుతారు. విజయదశమి నాడు రావణ దహనం చేసి సంబరాలు చేసుకుంటారు. దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని, శమీ వృక్షంలో దాచిపెట్టిన ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజుగా కూడా చెబుతారు. ఈ క్రమంలో జమ్మి చెట్టుకు పూజలు కూడా నిర్వహిస్తారు. దుర్గమ్మ ఎదుట జమ్మి చెట్టును పూజించి ఆ జమ్మి ఆకులను ఇంటికి తీసుకువెళ్లి అందరికీ పంచిపెట్టి అలాయ్ బలాయ్ తీసుకుంటారు. ఇంటి ఆడపడుచులకు కూడా ప్రేమగా పంచుతారు.ముహూర్తం: గణేష్ చతుర్థి తరువాత అంతే ఉత్సాంగా నవరాత్రులు వేడుక చేసుకునేపండుగ దసరా పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రుల్లో వివిధ రూపాల్లో అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అశ్వినీ మాసం శుక్ల పక్ష తిథి అక్టోబర్ 12 వ తేదీన ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 వ తేదీన ఉదయం 9:08 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం పూజ సమయం మధ్యాహ్నం 1:17 నుండి 3:35 వరకు ఉండనుంది. -
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం!
రాబోయే జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. 84 సెకన్ల సూక్ష్మ ముహూర్తంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నూతన రామాలయంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ఐదు ముహూర్తాలు ప్రతిపాదించారు. అయితే రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతిమ నిర్ణయాన్ని గీర్వాణవాగ్వర్ధిని సభకు, కాశీ పండితులకు వదిలివేసింది. జనవరి 22న అత్యంత శుభ ముహూర్తంగా వారు నిర్ణయించారు. జనవరి 17, 21, 24, 25 తేదీలలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన శుభ ముహూర్తాన్ని దేశంలోని నలుమూలలకు చెందిన పండితులు అందించారు. వారిలో కాశీకి చెందిన పండితుతు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అందించిన ముహూర్తాన్ని ఎంపిక చేశారు. అభిజిత్ ముహూర్తంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చాలా సూక్ష్మమైన శుభ సమయం ఉందని గణేశ్వర్ శాస్త్రి తెలిపారు. జనవరి 22న మేష రాశిలో వృశ్చిక నవాంశ వేళ.. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు 84 సెకన్ల సమయం కలిగిన ఈ ముహూర్తాన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కాశీలోని వైదిక బ్రాహ్మణులు పర్యవేక్షించనున్నారు. కాశీ నుండే పూజలకు కావాలసిన సామగ్రిని తరలించనున్నారు. కాశీ నుండి పండితుల మొదటి బ్యాచ్ డిసెంబర్ 26న అయోధ్యకు బయలుదేరనుంది. వీరు యాగశాల, పూజా మండపం పనులు చేపట్టనున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 51 మంది వేద పండితులు పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరివైపే.. -
నవంబ్రాలు
భూమిపై పడ్డ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవలసిందే. ఇందులో ఏదైనా దురర్ధం ధ్వనిస్తుంటే మీరు మరీ సున్నిత మనస్కులైనట్లు! పెళ్లి చేసుకోబోయేవారు ప్రతి దాన్నీ తేలిగ్గా తీసుకునే తత్వాన్ని అలవవరచుకోవాలి. పెళ్లి అనేది భూతం ఏమీ కాదు. అలాగని భూతలం మీది అత్యున్నత సౌఖ్యమూ కాదు. బేసిగ్గా పెళ్లి అంటే బాధ్యత. బాధ్యతలను మీద వేసుకోడానికి ఈ నవంబరులో బలమైన ముహుర్తాలు చాలానే ఉన్నాయి. కార్తీకం ఆరంభం అయింది కదా! ఏయే తేదీలు, తిథులు ఈ నెలలో పెళ్లికి దివ్యంగా ఉన్నాయో పంచాంగం తిప్పే ముందు.. పెళ్లిళ్లు, భార్యాభర్తల విశేషాలు కొన్ని తెలుసుకోవడం వల్ల నూతన వధూవరులకు కొంత ఉపయుక్తంగా ఉండొచ్చు. ►తొలిచూపులోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న దంపతులలో 75 మంది విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కంగారు పడకండి. మిగతా 25 మంది సక్సెస్ఫుల్ కపుల్స్‌లో మీరు ఉండొచ్చు కదా! ►‘బ్రైడ్’ అంటే వధువు. బ్రైడ్కి ‘గ్రూమ్’ని కలిపితే వరుడు. (బైడ్ గ్రూమ్). సరే, ఈ నాలెడ్జికేంగానీ, బ్రైడ్ అంటే అసలు అర్థం తెలుసా! ‘వంట చేయడం’ అని!! ప్రాచీన జర్మన్ భాషల నుంచి బ్రైడ్ అనే పదం పుట్టుకొచ్చింది. ►భర్తగానీ, భార్యగానీ రోజుకి కనీసం 45 నిముషాలు ప్రయాణంలోనే గడుపుతుంటే వాళ్ల పెళ్లి పెటాకులయ్యే ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అట. మీ ఇష్టం మరి. ►ఆ మధ్య 99 ఏళ్ల ఓ భర్త తన 96 ఏళ్ల భార్యకు పెళ్లయిన 77 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. నైంటీన్ ఫార్టీస్లో ఆమెకు ఎవరితోనో అఫైర్ ఉందని ఆయనకు తెలిసిందట! అదీ విడాకులకు కారణం. ►పెళ్లికి ముందు దీర్ఘకాలం కలిసి ఉన్నవారు, పెళ్లయ్యాక అంతకన్నా తక్కువ సమయంలోనే విడిపోతారట! ఇదింకో అధ్యయనంలో తేలిన విషయం. ►పెళ్లయిన మూడో ఏడాది.. ఏ దంపతుల జీవితంలోనైనా అత్యంత ఆనందకరమైన సంవత్సరంగా ఉంటుందట! మీరిప్పుడు పెళ్లి చేసుకుంటే అత్యంత ఆనందకరమైన ఆ ఏడాది కోసం రెండేళ్లు ఎదురు చూడాలన్నమాట. పెళ్లి ఖర్చు తక్కువగా ఉంటే ఎక్కువ కాలం, పెళ్లి ఖర్చు ఎక్కువగా ఉంటే తక్కువ కాలం దంపతులు కలిసి ఉంటారట! ఇది ఇంకో అబ్జర్వేషన్. ►పెళ్లంటే ఉండే భయాన్ని ‘గామోఫోబియా’ అంటారు. మరి ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటే గామోఫోబియా రాదా అని మీరు అనుకుంటుంటే ఈ టాపిక్‌ని ఇక్కడితో ఆపేద్దాం. అనుకోకపోతే ఇంకో రెండు విషయాలు చెప్పుకుని ముగిద్దాం. ►ఒకటి: ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఏ ఫోబియాలూ మీ దరి చేరవు. ►రెండు: ముహూర్త బలం ఎంత బలమైనదో.. దాంపత్య ఫలం అంతే బలమైనది. భార్యాభర్తల్లోని ఇచ్చిపుచ్చుకునే సర్దుబాటు ధోరణి పెళ్లిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుతుంది. ముహూర్తానికే వన్నె తెస్తుంది. భలే మంచి ముహూర్తము 8 నవంబర్ 2019 శుక్రవారం ముహూర్తం: మధ్యాహ్నం 12.24 నుంచి నవంబర్ 9 తెల్లవారుఝాము 06.39 వరకు; నక్షత్రం: ఉత్తరాభాద్ర; తిథి : ద్వాదశి 9 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: ఉదయం 06.30 నుంచి నవంబర్ 10 ఉదయం 06.39 వరకు. నక్షత్రం: ఉత్తరాభాద్ర, రేవతి; తిథి: ద్వాదశి, త్రయోదశి. 10 నవంబర్ 2019 ఆదివారం ముహూర్తం: ఉదయం 06.39 నుంచి 10.44 వరకు; నక్షత్రం: రేవతి; తిథి: త్రయోదశి 14 నవంబర్ 2019 గురువారం ముహూర్తం: ఉదయం 09.15 నుంచి నవంబర్ 15 ఉదయం 06.43 వరకు; నక్షత్రం: రోహిణి, మృగశిర; తిథి: విదియ, తదియ 22 నవంబర్ 2019 శుక్రవారం ముహూర్తం: ఉదయం 09.01 నుంచి నవంబర్ 23 ఉదయం 06.50 వరకు; నక్షత్రం: ఉత్తర ఫల్గుణి, హస్త; తిథి: ఏకాదశి 23 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: ఉ. 06.50 నుంచి మధ్యాహ్నం 02.46 వరకు; నక్షత్రం: హస్త; తిథి: ద్వాదశి 24 నవంబర్ 2019 ఆదివారం ముహూర్తం: మధ్యాహ్నం 12.48 నుంచి నవంబర్ 25 అర్ధరాత్రి 01.06 వరకు; నక్షత్రం: స్వాతి; తిథి: త్రయోదశి 30 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: సాయంత్రం 06.05 నుంచి డిసెంబర్ 1 ఉదయం 06.56 వరకు; నక్షత్రం: ఉత్తరాషాఢ; తిథి: పంచమి. ►(నవంబర్ 15, 19, 20, 21, 22 తేదీలలో పెళ్లి ముహూర్తాలు అతి స్వల్ప నిడివిలో మాత్రమే ఉండగా.. 27, 28, 29 మంచి ముహూర్తాలు లేవనే చెప్పాలి). -
ముహూర్తం.. ముందరున్నదీ..
సాక్షి, భీమవరం: ఎన్నికల షెడ్యూలు విడుదల కావడం, నామినేషన్లు వేయడానికి రోజులు దగ్గర పడుతుండటంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులు నామినేషన్ వేయడానికి మంచి ముహుర్తాల కోసం పండితులు, సిద్ధాంతుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు చిన్నపాటి పార్టీల నాయకులు, స్వతంత్య్ర అభ్యర్థులకు ఎన్నికల సెంట్మెంట్ ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా నామినేషన్ వేయడానికి మంచి ముహుర్తంతోపాటు ప్రచారం ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే సెంటిమెంట్‌ను వీరంతా ఫాలోఅవుతారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకూ నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఈ ఎనిమిది రోజుల్లో అభ్యర్థుల జాతకం ప్రకారం తిథి, నక్షత్రం ఆధారంగా సిద్ధాంతులు మంచిరోజులు నిర్ణయిస్తారు. ఈ పద్ధతి ఎప్పటినుంచో ఆచరణలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా మంచి ముహుర్తాల కోసం అన్వేషిస్తున్నారు. ఈసారి నామినేషన్లకు ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉండగా వాటిలో 18వ తేదీ ద్వాదశి, 19వ తేదీ త్రయోదశి, 22వ తేదీ విదియ, 25వ తేదీ పంచమి మంచి రోజులుగా లెక్కలు వేస్తున్నారు. నామినేషన్లకు చివరి రోజు అయిన 25వ తేదీ పంచమి సోమవారం బలమైన ముహూర్తం ఉండటంతో ఆ రోజునే ఎక్కువ మంది నామినేషన్లు వేస్తారని పండితులు చెబుతున్నారు. అయితే పోటీచేసే అభ్యర్థి పేరు, జన్మనక్షత్రం, జాతకం ప్రకారమే ముహూర్తం నిర్ణయించాల్సి ఉంటుందంటున్నారు. మొత్తం మీద ఈ నాలుగు రోజులు పండితులు, సిద్ధాంతులను రాజకీయనాయకులు ఊపిరి సలపనివ్వరని తెలుస్తోంది. నామినేషన్ ముహూర్తంతోపాటు ఎన్నికల ప్రచారం ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రారంభించాలనే దానికి కూడా ముహూర్తాలు తప్పవంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం నియోజకవర్గానికి ఈశాన్యం నుంచి ప్రారంభించడం పరిపాటి. అయితే కొందరు నాయకులు మాత్రం గతంలో ప్రచారం ప్రారంభించిన ప్రాంతం సెంటిమెంట్‌గా ఈసారి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సెంటిమెంట్ ఎవరిని విజేతలను చేస్తుందో చూడాలి మరి. -
ఒకే ముహూర్తాన 131 పెళ్లిల్లు
సాక్షి, ఆసిఫాబాద్: ఒకే ముహూర్తాన 131 జంటలు మూడు ముడులు, ఏడు అడుగుల బంధంతో ఏకమయ్యాయి. ఇందులో 91 ఆదివాసీ జంటలున్నాయి. ఈ అపూర్వ ఘట్టానికి కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం గ్రౌండ్ వేది కైంది. బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ వర్గాల యువతీ యువకుల వివాహాలను ఘనంగా జరిపించారు. ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన జంటలకు కోనేరు ట్రస్టు ద్వారా ఉచితంగా పుస్తె మట్టెలు, వస్త్రాలు, ఫ్యాను, బీరువా తదితర సామగ్రిని కోనప్ప అందజేశారు. జంటలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తామన్నారు. -
ముహూర్తం మార్చుకున్న ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: అనుకున్న సమయంలో.. అనుకున్న విధంగా తాత్కాలిక సచివాలయ పనులు పూర్తి కాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల తరలింపు ముహూర్తాన్ని మార్చారు. సచివాలయం నుంచి పాలనా కార్యక్రమాలు ప్రారంభించేందుకు మరో రెండురోజులు వాయిదా వేశారు. ఈనెల 29న కేవలం ఐదవ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు శనివారం ప్రకటించారు. అదే రోజు పాలనా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. జూలై 6న ఐదవ బ్లాక్‌లోని మొదటి అంతస్తు, 15న 2, 3, 4 బ్లాక్ల్లోని గ్రౌండ్‌ఫ్లోర్లు, 21వ తేదీ 2, 3, 4 బ్లాక్ల్లోని మొదటి అంతస్తులను ప్రారంభించి పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన రెండవ అంతస్తు, ఆరవ బ్లాక్‌లను ఎప్పుడు పూర్తిచేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం! మొత్తంగా జూలై చాలా ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనులను ముఖ్యమంత్రి శనివారం పరిశీలించారు. ఈనెల 29న ప్రారంభించనున్న ఐదవ బ్లాక్‌ను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లను పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. కుంగిన బ్లాక్‌ను పరిశీలించకుండానే వెనుదిరిగిన సీఎం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనుల ప్రారంభం నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల సచివాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కుంగటం. ఆ తరువాత కొద్దిరోజులకే తాత్కాలిక సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఫ్లోర్ కుంగటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న అధికారయంత్రాంగం, ఇంజనీర్లు ఉలిక్కిపడ్డారు. అయితే భవనం కుంగిన విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. సాక్షి ద్వారా తెలుసుకున్న మిగిలిన పత్రికలు, మీడియా ప్రతినిధులు భవనం కుంగిన విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేశాయి. అయితే ఈ విషయాన్ని అధికారపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. కొన్ని పత్రికలు, ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని కావాలనే ప్రచారం చేస్తున్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశం, తుళ్లూరులో శనివారం చేపట్టిన ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాక్షిపై ప్రత్యక్ష దాడికి దిగారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలచే తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే తుళ్లూరులో నిర్వహించిన బహిరంగ సమావేశంలో సాక్షిపై తిరగబడాలంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అదే విధంగా సాక్షితో పాటు మిగిలిన ప్రతికలు, మీడియా కూడా సచివాలయం నిర్మాణం కుంగిందని ప్రముఖంగా రాయటం, ప్రసారం చేయడంపైనా సీఎం చిందులు వేశారు. అయితే తాత్కాలిక సచివాయలం ఫ్లోర్ కుంగిన విషయాన్ని సీఎం చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారు. 'ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్ని చిన్న పొరబాట్లు సహజం. అదేదో జరిగిందని భూతద్దంలో చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనుకోవటం పొరబాటు. ఏదైనా ఉంటే చెబితే సరిచేసుకుంటాం' అని బాబు చెప్పటం గమనార్హం! ఇలా తప్పుడు రాతలు రాసేవారిపై, తప్పుడు ప్రచారం చేసే వైఎస్సార్ కాంగ్రెస్‌పై యాక్షన్ తీసుకుందామా? మీరు ఎలా చెబితే అలా చేస్తామంటూ అనుకూల కార్యకర్తలచేత చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే శనివారం తాత్కాలిక సచివాలయం పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు కుంగిన రెండవ బ్లాక్‌లోని ఫ్లోర్‌ను పరిశీలించకుండా వెనుదిరిగి వెళ్లిపోవటం గమనార్హం! -
గ్రహం అనుగ్రహం (07-05-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శు.తదియ రా.3.44 వరకు, నక్షత్రం ఆరుద్ర ప.11.33 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం రా.11.20 నుంచి 12.55 వరకు దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు తదుపరి రా.10.51 నుంచి 11.35 వరకు అమృతఘడియలు..లేవు సూర్యోదయం : 5.28 సూర్యాస్తమయం: 6.28 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు భవిష్యం మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వృషభం: బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. మిథునం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం: మిత్రులతో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. సింహం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం అందుతుంది. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కన్య: బంధువులతో సఖ్యతగా మెలగుతారు. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. తుల: రుణ ఒత్తిడులు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది. వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం ఎదురవుతుంది. ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. మకరం: బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పాతమిత్రుల కలయిక. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం అందుతుంది. కుంభం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. మీనం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. - సింహంభట్ల సుబ్బారావు -
రామ..రామ
‘సువర్ణ భద్ర కవచం’ ముహూర్తం మారింది రాములోరి క్షేత్రంలో ‘ఆగమా’గం భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో భక్తరామదాసు కాలం నాటి ఉత్సవమూర్తులకు సువర్ణభద్రకవచం తొడిగే ముహూర్తం మారింది. శుక్రవారం ఉదయం 9.27 గంటలకు ఉత్సవ మూర్తులకు ప్రతిష్టాత్మకంగా సువర్ణ భద్రకవచ సమర్పణం గావించి, సాయంత్రం వేళ సార్వభౌమ సేవ జరిపించాలని ముందుగా నిర్ణయించినా బంగారు కవచం తయారీ పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో దీనిని శనివారం నాటికి మార్చారు. రాములోరి పంచలోహ విగ్రహాలను అమ్మకానికి పెట్టి అబాసుపాలైన భద్రాద్రి ఆలయాధికారులకు తాజా పరిణామాలు మరింత అపఖ్యాతిని మూటగట్టాయి. స్వామివారి పురాతన విగ్రహాలకు ప్రతి వందేళ్లకోమారు బంగారు కవచం తొడగటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్సవాలపై దేవస్థానం అధికారులు మొదటి నుంచి నిర్లక్ష్య దోరణితోనే వ్యవహరించారనడానికి తాజా పరిణామాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. స్వామివారి మూర్తులపై ఇదివరకే ఉన్న బంగారు పూతను తీయగా 3.457 కేజీల బంగారం వచ్చిందని శుక్రవారం దేవస్థానం అధికారులు ప్రకటించారు. కొత్తగా బంగారు కవచం వేసేందుకు పాత బంగారంతో పాటు తాజాగా దేవస్థానం ద్వారా 896.550 గ్రాము ల బంగారం కొనుగోలు చేశామన్నారు. భక్తులు విరాళంగా ఇచ్చిన 494.200 గ్రాముల బంగారం, నగదుతో కొన్న 87.250 గ్రాములను కలిపి మొత్తంగా 4.894 కేజీల బంగారంతో స్వామివారికి సువర్ణ భద్రకవచం వేయిస్తున్నట్లుగా ఈఓ జ్యోతి వెల్లడించారు. వందేళ్ల తరువాత చేపట్టే ఈ పనులపై ముందుగానే ఇక్కడి అధికారులు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి కోరారు. ఈ క్రమంలోనే వైదిక కమిటీ సూచనలతో శ్రీరామాయణ మహాక్రతువు షెడ్యూల్ విడుదల చేశారు. ఆ ప్రకారం ఉత్సవ మూర్తులకు శుక్రవారం సువర్ణ కవచం సమర్పణ చేయాలని నిర్ణయించారు. శాస్త్రోక్తంగా నిర్వహించతలపెట్టిన ఈ వేడుకకు ముహూర్తం మారిపోవటానికి దేవస్థానం అధికారులు చెబుతున్న సాంకేతిక కారణాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బంగారు కవచం తయారీలోనే నిర్లక్ష్యమా? స్వామివారి బంగారు కవచం తయారీ బాధ్యతలను కమిషనర్ అనుమతితో ఓ సంస్థకు అప్పగించినట్లుగా ఇక్కడి అధికారులు చెబుతున్నారు. బంగారు కవచంను తయారీదారులు అనుకున్న సమయానికి ఇవ్వకపోవటంతోనే వేడుక శనివారం నాటికి వాయిదా వేయాల్సి వచ్చిదని ఈఓ జ్యోతి వెల్లడించారు. ముహూర్తం వేళకు వీటిని అప్పగించకపోవటంలో నిర్లక్ష్యం ఎవరిదనేది వెల్లడి కావాల్సి ఉంది. బంగారు తొడుగు విషయంలో భద్రాద్రి దేవస్థానం అధికారులు మొదటి నుంచీ గోప్యత వహిస్తున్నారు. ఇక్కడి అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘భద్రాద్రి దేవస్థానంలో ఏం జరుగుతుంద’నే దానిపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. దేవాదాయశాఖ అధికారులు తగిన రీతిలో స్పందించకపోవటం వల్లే ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని మార్చాల్సివచ్చిందనే అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. విరాళాల సేకరణకు అనుమతి ఉందా? దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భద్రాద్రి ఆలయంలో చేపట్టే ఎటువంటి పనులకైనా ఆ శాఖ కమిషనర్ నుంచి ముందస్తు అనుమతి ఉండాలి. స్వామివారి ఉత్సవ మూర్తులకు కొత్తగా బంగారు కవచం చేయించేందుకు విగ్రహాలపై తొలగించిన పాత బంగారం సరిపోలేదని భక్తుల నుంచి బంగారు, ధన రూపేణ విరాళాలను సేకరించినట్లుగా ఈఓ జ్యోతి వెల్లడించారు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన స్వామివారి మూర్తులకు సువర్ణ కవచం వేసే బంగారంలో తమ భాగస్వామ్యం ఉంటే చాలనుకునే వారు అనేక మంది ఉన్నారు. దేవస్థానం అధికారులు దీనిపై ప్రచారం చేస్తే భక్తుల నుంచి బంగారం, ధన రూపేణ పెద్ద మొత్తంలో సమకూరేది. అలా కాకుండా కొంతమంది దగ్గర నుంచే బంగారం, డబ్బులు పోగు చేయటంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మహాకార్యంలో భాగస్వామ్యులను కానివ్వకుండా దేవస్థానం అధికారులు తీసుకున్న నిర్ణయాలపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రి దేవస్థానం అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్న నేపథ్యంలో దీనిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. -
పుష్కరం.. ముహూర్తమే అయోమయం
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం అనే దానిపై వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం ఒక ముహుర్తం ఆమోదించి ఏర్పాట్లు చేస్తుండగా...ఇద్దరు ప్రముఖ సిద్ధాంతులు వేర్వేరు ముహుర్తాలు నిర్ణయించడం విశేషం. ఈ మూడు ముహుర్తాలతో భక్తులలో అయోమయం నెలకొంది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతుల ముహూర్తం ప్రకారం పుష్కరాలు జూలై 14న ప్రారంభమవుతాయి. ప్రభుత్వం దీన్నే ఖరారు చేసి సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక రైళ్లు, బస్సులు అందుకు తగ్గట్టే నడపనున్నారు. కాగా, రాజమండ్రికి చెందిన ప్రముఖ జ్యోతిష పండితులు, మహామహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తిశాస్త్రి ఆదివారం ఉదయం 8.27 గంటలకు పుష్కరాలు ప్రారంభమయ్యాయని ప్రకటించారు. తొలి పంచాంగ సిద్ధాంతకర్త వరాహమిహిరుడి లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటే.. తాను చెప్పిన ముహూర్తానికే గురుడు సింహరాశిలోకి ప్రవేశించాడని, గోదావరి పుష్కరాలు ఆరంభమయ్యాయని అంటూ మధుర తన కుటుంబ సభ్యులతో రాజమండ్రి పుష్కరఘాట్‌లో ఆదివారం పుష్కర స్నానం ఆచరించారు. వీరితో పాటు అక్షరకోటి గాయత్రీపీఠం వ్యవస్థాపకుడు సవితాల చక్రభాస్కరరావు, గాయత్రీ ప్రజ్ఞాపీఠం వ్యవస్థాపకుడు ద్రాక్షారపు రాధాకృష్ణమూర్తి, డాక్టర బిక్కిన రాంమనోహర్ తదితర ప్రముఖులు కూడా పుష్కర స్నానం చేశారు. ఇలాఉండగా...రాజమండ్రికి చెందిన శ్రీశైలం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ జూలై ఏడు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయంటున్నారు. సూర్య సిద్ధాంతం ఆధారంగా తాను ఈ ముహూర్త నిర్ణయం చేశానంటున్నారు. పుష్కర ప్రారంభంపై ఇలా భిన్న వాదనలు చేస్తూ, ఎవరి లెక్కలు వారు చెపుతూ ముహూర్తాలు పెట్టడంతో గోదావరి పుష్కరాలు ప్రారంభమెప్పుడు అన్నదానిపై అయోమయం నెలకొంది. హెలికాప్టర్ సర్వీసులకు రెడీ గోపాలపట్నం (విశాఖపట్నం): గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ప్రత్యేక బస్సులు, రైళ్లు ప్రకటించగా హెలికాప్టర్లూ అందుబాటులోకి రానున్నాయి. పవన్‌హన్స్ సంస్థ రాజమండ్రికి హెలికాప్టర్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఇప్పటికే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. రాజమండ్రి విమానాశ్రయం నుంచి విశాఖ విమానాశ్రయానికి, అలాగే రాజమండ్రి నుంచి విజయవాడ విమానాశ్రయానికి హెలికాప్టర్ సర్వీసులు అందించబోతున్నారు. జులై14 నుంచి 25 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికార వర్గాల భోగట్టా. వీటి చార్జీలు ఖరారు కావలసి ఉంది. రాజమండ్రికి వివిధ విమానాశ్రయాల నుంచి విమానాలు కూడా పుష్కర ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ‘అందాల గోదావరి’ ఫొటోల ఎంట్రీలకు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: పుష్కరాల సందర్భంగా రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్లో ప్రదర్శించేందుకు ‘అందాల గోదావరి’ ఫొటో ఎంట్రీలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈనెల తొమ్మిదో తేదీలోగా ట్విట్టర్ లేదా ప్రభుత్వ ప్రత్యేక వెబ్‌సైట్‌కు ఫోటోలను ఆప్‌లోడ్ చేయాలని కోరింది. ఎంపికైన ఫోటోలను ఎగ్జిన్బిషన్లో ఉంచుతారు. ఆరుజిల్లాల్లో ‘సత్యసాయి’ సంస్థల సేవలు ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : వచ్చే నెల 14 నుంచి 25 వరకు జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణ లో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు జిల్లాల్లో సేవలు అందించనున్నట్టు శ్రీసత్యసాయి సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్జీ చలం చెప్పారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఖండకుర్తి, ఆదిలాబాద్ జిల్లా బాసర, ఖమ్మం జిల్లా భద్రాచలం, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ధర్మపురితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో సేవలందిస్తామన్నారు. పుష్కరాలు జరిగే కేంద్రాల్లో నిత్యం 4 వేల మంది సేవాదళ్ సభ్యులు పుష్కర ఘాట్లలో భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచడం, మంచినీరు, పాలు, అన్నప్రసాదం పంపిణీ వంటి సేవలను అందిస్తారన్నారు. -
ముందు ముహూర్తం చూడండి
బండెడేసి స్క్రిప్ట్‌లు.. గుండె నిండా ఆశలతో.. కథలు వినిపించడానికి నిర్మాతలు, హీరోల ఇళ్ల ముందు క్యూ కట్టే యంగ్ టాలెంట్స్ ఎందరో ఉంటారు. అదృష్టం తలుపుతట్టి కథ చెప్పే చాన్స్ దొరికి అది నచ్చినా.. వెంటనే వచ్చే క్వశ్చన్.. ‘సినిమా నువ్వు చెప్పినట్టే తీస్తావనే గ్యారంటీ ఏంటీ..?’ అని. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఓ కుర్రాడు వెరైటీగా ప్లాన్ చేశాడు. తాను రాసుకున్న సినిమా కథలో ఓ సీన్‌ను షార్ట్ ఫిల్మ్‌గా తీశాడు. దానికి ‘ముహూర్తం’ అని టైటిల్ ఫిక్స్ చేశాడు. ఆ షార్ట్‌ఫిల్మ్ చూపించి.. ‘నా ట్రయల్ షూట్ ఇది.. నచ్చితే సినిమా చేస్తా’ అని కాన్ఫిడెంట్‌గా ట్రయల్స్ చేస్తున్నాడు. ఈ పొట్టి చిత్రంతో ట్రయల్స్ చేస్తున్న యంగ్‌తరంగ్ శశితో సిటీప్లస్ ముచ్చటించింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడే రెండు షార్ట్ ఫిలింస్ తీశాను. నాకు తెలుగంటే అభిమానం. తెలుగులో బాగా రాయగలను. అది ఎక్కడ ఉపయోగపడుతుందా అని చూస్తే సినిమా కరెక్ట్ అనిపించింది. షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాను. నేను తీసిన ‘సురాజ్యం’ అనే బుల్లి చిత్రానికి డెరైక్టర్ రాజమౌళి నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంపిటీషన్లో బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. సుముహూర్తం.. సినిమాలో డెరైక్టర్‌గా చాన్స్ కోసం ఎన్నో ఏళ్లు తిరిగాను. ప్రొడ్యూసర్స్‌కి, యాక్టర్స్‌కి స్టోరీ నెరేట్ చేసినా.. తెరపై కథను ఎలా చూపిస్తావ్ అనే ప్రశ్నించేవారు. మంచి సినిమా తీయడానికి మంచి కథను ఒకదాన్ని సిద్ధం చేసుకున్నాను. సినిమాల్లోకి వెళ్లడానికి ఈ కథనే షార్ట్ కట్‌గా ఉపయోగించుకోవాలని ఫిక్సయ్యాను. అందుకే నేను అనుకున్న కథలో కొంత భాగాన్ని షార్ట్ సినిమాలా షూట్ చేశాను. నేను తీసే సినిమా కూడా ఇంతే క్వాలిటీగా ఉంటుందని చెబుతున్నాను. ముహూర్తం షార్ట్ మూవీని హీరో సందీప్ కిషన్ ట్విట్టర్లో పెట్టారు. వెన్నల కిషోర్ ఫేస్బుక్లో షేర్ చేసుకున్నారు. ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ అప్రిషియేట్ చేశారు. టైటిల్ అండ్ మేకింగ్.. ముహూర్తం చిత్రీకరణలో చాలా ఇబ్బందులే ఫేస్ చేశాను. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి హార్డ్‌వేర్ పాడవటం, ఎక్విప్మెంట్ మొరాయించడం.. ఏ ముహూర్తంలో షూటింగ్ స్టార్ట్ చేశామో అని విసుక్కున్నాం. ఆ ఎమోషన్ నుంచి ముహూర్తం టైటిల్ వచ్చింది. ఈ ముహూర్తం సక్సెస్ కావడానికి నా ఫ్రెండ్స్ అశోక్, కౌశిక్, ప్రదీప్, రాజేష్‌లు కారణం. ఈ నలుగురే 90స్ కిడ్స్ స్టూడియోస్ తరపున ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఐక్లిక్ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్లో సపోర్ట్ అందించింది. ఈ బుల్లి సినిమాలో టూ మెయిన్ లీడ్స్ గిరీష్, గాయత్రి. ఆమె గురించి స్పెషల్‌గా చెప్పాలి. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ అయిన తర్వాత, రాత్రిపూట షూటింగ్ వచ్చింది. చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమా చూసిన కొంతమంది ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు. ప్రస్తుతం డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. శాంపుల్ పిక్చర్ టైటిల్‌కు తగ్గట్టుగా సింపుల్‌గా, అందంగా, హాయిగా సాగిపోతుంది ఈ చిన్ని సినిమా. డైలాగ్స్, పిక్చరైజేషన్, యాక్టింగ్, క్వాలిటీ ఇలా ఏ యాంగిల్లో చూసినా పెద్ద సినిమాకు తగ్గని స్థాయిలో తీశారు. నటీనటులు హావభావాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, షాట్స్ కంపోజిషన్ అన్ని ఇంపుగా కుదిరిన ఈ సినిమాను యూట్యూబ్‌లో లక్ష మందికి పైగా చూసేశారు.