భూమిపై పడ్డ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవలసిందే. ఇందులో ఏదైనా దురర్ధం ధ్వనిస్తుంటే మీరు మరీ సున్నిత మనస్కులైనట్లు! పెళ్లి చేసుకోబోయేవారు ప్రతి దాన్నీ తేలిగ్గా తీసుకునే తత్వాన్ని అలవవరచుకోవాలి. పెళ్లి అనేది భూతం ఏమీ కాదు. అలాగని భూతలం మీది అత్యున్నత సౌఖ్యమూ కాదు. బేసిగ్గా పెళ్లి అంటే బాధ్యత. బాధ్యతలను మీద వేసుకోడానికి ఈ నవంబరులో బలమైన ముహుర్తాలు చాలానే ఉన్నాయి. కార్తీకం ఆరంభం అయింది కదా! ఏయే తేదీలు, తిథులు ఈ నెలలో పెళ్లికి దివ్యంగా ఉన్నాయో పంచాంగం తిప్పే ముందు.. పెళ్లిళ్లు, భార్యాభర్తల విశేషాలు కొన్ని తెలుసుకోవడం వల్ల నూతన వధూవరులకు కొంత ఉపయుక్తంగా ఉండొచ్చు.
►తొలిచూపులోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న దంపతులలో 75 మంది విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కంగారు పడకండి. మిగతా 25 మంది సక్సెస్‌ఫుల్ కపుల్స్‌లో మీరు ఉండొచ్చు కదా!
►‘బ్రైడ్’ అంటే వధువు. బ్రైడ్‌కి ‘గ్రూమ్’ని కలిపితే వరుడు. (బైడ్ గ్రూమ్). సరే, ఈ నాలెడ్జికేంగానీ, బ్రైడ్ అంటే అసలు అర్థం తెలుసా! ‘వంట చేయడం’ అని!! ప్రాచీన జర్మన్ భాషల నుంచి బ్రైడ్ అనే పదం పుట్టుకొచ్చింది.
►భర్తగానీ, భార్యగానీ రోజుకి కనీసం 45 నిముషాలు ప్రయాణంలోనే గడుపుతుంటే వాళ్ల పెళ్లి పెటాకులయ్యే ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అట. మీ ఇష్టం మరి.
►ఆ మధ్య 99 ఏళ్ల ఓ భర్త తన 96 ఏళ్ల భార్యకు పెళ్లయిన 77 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. నైంటీన్ ఫార్టీస్‌లో ఆమెకు ఎవరితోనో అఫైర్ ఉందని ఆయనకు తెలిసిందట! అదీ విడాకులకు కారణం.
►పెళ్లికి ముందు దీర్ఘకాలం కలిసి ఉన్నవారు, పెళ్లయ్యాక అంతకన్నా తక్కువ సమయంలోనే విడిపోతారట! ఇదింకో అధ్యయనంలో తేలిన విషయం.
►పెళ్లయిన మూడో ఏడాది.. ఏ దంపతుల జీవితంలోనైనా అత్యంత ఆనందకరమైన సంవత్సరంగా ఉంటుందట! మీరిప్పుడు పెళ్లి చేసుకుంటే అత్యంత ఆనందకరమైన ఆ ఏడాది కోసం రెండేళ్లు ఎదురు చూడాలన్నమాట. పెళ్లి ఖర్చు తక్కువగా ఉంటే ఎక్కువ కాలం, పెళ్లి ఖర్చు ఎక్కువగా ఉంటే తక్కువ కాలం దంపతులు కలిసి ఉంటారట! ఇది ఇంకో అబ్జర్వేషన్.
►పెళ్లంటే ఉండే భయాన్ని ‘గామోఫోబియా’ అంటారు. మరి ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటే గామోఫోబియా రాదా అని మీరు అనుకుంటుంటే ఈ టాపిక్‌ని ఇక్కడితో ఆపేద్దాం. అనుకోకపోతే ఇంకో రెండు విషయాలు చెప్పుకుని ముగిద్దాం.
►ఒకటి: ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఏ ఫోబియాలూ మీ దరి చేరవు.
►రెండు: ముహూర్త బలం ఎంత బలమైనదో.. దాంపత్య ఫలం అంతే బలమైనది. భార్యాభర్తల్లోని ఇచ్చిపుచ్చుకునే సర్దుబాటు ధోరణి పెళ్లిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుతుంది. ముహూర్తానికే వన్నె తెస్తుంది.
భలే మంచి ముహూర్తము
8 నవంబర్ 2019 శుక్రవారం
ముహూర్తం: మధ్యాహ్నం 12.24 నుంచి నవంబర్ 9 తెల్లవారుఝాము 06.39 వరకు; నక్షత్రం: ఉత్తరాభాద్ర; తిథి : ద్వాదశి
9 నవంబర్ 2019 శనివారం
ముహూర్తం: ఉదయం 06.30 నుంచి నవంబర్ 10 ఉదయం 06.39 వరకు. నక్షత్రం: ఉత్తరాభాద్ర, రేవతి; తిథి: ద్వాదశి, త్రయోదశి.
10 నవంబర్ 2019 ఆదివారం
ముహూర్తం: ఉదయం 06.39 నుంచి 10.44 వరకు; నక్షత్రం: రేవతి; తిథి: త్రయోదశి
14 నవంబర్ 2019 గురువారం
ముహూర్తం: ఉదయం 09.15 నుంచి నవంబర్ 15 ఉదయం 06.43 వరకు; నక్షత్రం: రోహిణి, మృగశిర; తిథి: విదియ, తదియ
22 నవంబర్ 2019 శుక్రవారం
ముహూర్తం: ఉదయం 09.01 నుంచి నవంబర్ 23 ఉదయం 06.50 వరకు; నక్షత్రం: ఉత్తర ఫల్గుణి, హస్త; తిథి: ఏకాదశి
23 నవంబర్ 2019 శనివారం
ముహూర్తం: ఉ. 06.50 నుంచి మధ్యాహ్నం 02.46 వరకు; నక్షత్రం: హస్త; తిథి: ద్వాదశి
24 నవంబర్ 2019 ఆదివారం
ముహూర్తం: మధ్యాహ్నం 12.48 నుంచి నవంబర్ 25 అర్ధరాత్రి 01.06 వరకు; నక్షత్రం: స్వాతి; తిథి: త్రయోదశి
30 నవంబర్ 2019 శనివారం
ముహూర్తం: సాయంత్రం 06.05 నుంచి డిసెంబర్ 1 ఉదయం 06.56 వరకు; నక్షత్రం: ఉత్తరాషాఢ; తిథి: పంచమి.
►(నవంబర్ 15, 19, 20, 21, 22 తేదీలలో పెళ్లి ముహూర్తాలు అతి స్వల్ప నిడివిలో మాత్రమే ఉండగా.. 27, 28, 29 మంచి ముహూర్తాలు లేవనే చెప్పాలి).
Comments
Please login to add a commentAdd a comment